ఇన్వెస్టర్ల సంపద రూ.20.70 లక్షల కోట్లు అప్‌ | Sakshi
Sakshi News home page

ఇన్వెస్టర్ల సంపద రూ.20.70 లక్షల కోట్లు అప్‌

Published Sat, Mar 31 2018 2:39 AM

The Sensex is up 11% in 2017-18 - Sakshi

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరాన్ని (2017ఏప్రిల్‌ – 2018మార్చి)లాభాలతో ముగించింది. ఈ మధ్యకాలంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ సూచీ (3348.18 పాయింట్లు) 11శాతం లాభపడగా, నిఫ్టీ సూచీ 934 పాయింట్లు (10.25 శాతం) లాభపడింది. ఈ క్రమంలో బీఎస్‌ఈ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ విలువ సరికొత్త శిఖరాలకు చేరింది. ఈ సమీక్షా కాలంలోనే ఇన్వెస్టర్ల సంపద రూ.20.70 లక్షల కోట్లకు చేరింది.

తద్వారా బీఎస్‌ఈలో లిస్టెడ్‌ కంపెనీల ఉమ్మడి మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ విలువ రూ.121.54 లక్షల కోట్ల నుంచి రూ.142.24 లక్షల కోట్లకు చేరింది. దేశీయ మార్కెట్‌లోకి విదేశీ నిధులు తరలిరావడం, దేశీయ ఇన్వెస్టర్ల పెట్టుబడుల మద్దతు, పెద్ద సంఖ్యలో ఐపీఓలు విజయవంతం కావడం వంటి అంశాలు ఇన్వెస్టర్ల సంపద పెరగడానికి దోహదపడ్డాయి. అంతకు ముందు 2016–17ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన రూ.26.79 లక్షల కోట్లతో పోల్చితే ఇది తక్కువ.

చివరి రెండు నెల(ఫిబ్రవరి– మార్చి)ల్లో మూలధనంపై ధీర్ఘకాలిక పెట్టుబడి పన్ను, గ్లోబల్‌ సెల్‌–ఆఫ్, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కుంభకోణాలు వంటి ప్రతికూల అంశాలతో అమ్మకాల ఒత్తిడి చోటుచేసుకుని లార్జ్, మిడ్, స్మాల్‌క్యాప్‌ సూచీలు నష్టాలపాలయ్యాయి. బీఎస్‌ఈలో రంగాల వారీగా  కన్జూమర్‌ డ్యూరెబుల్స్‌ అత్యధికంగా 51.41% లాభపడగా, హెల్త్‌కేర్‌ రంగం  14.18% అత్యధికంగా నష్టపోయాయి. విద్యుత్, పీఎస్‌యూ, హెల్త్‌కేర్‌ విభాగాలు మినహా అన్నీ రంగాలు లాభాల్లో ముగిశాయి.  

భారీగా పడిన స్మాల్, మిడ్‌క్యాప్‌
ఈ ఏడాది(2018) బ్లూచిప్‌ స్టాక్స్‌తో పోలిస్తే మిడ్, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ ఇన్వెస్టర్ల సంపదను హరించి వేశాయి. ప్రధాన సూచీలతో పోలిస్తే ఈ రెండూ భారీగా పతనమయ్యాయి. 2018 జనవరి నుంచి మార్చి వరకూ చూస్తే స్మాల్‌ క్యాప్‌ సూచీ 11.62 శాతం క్షీణించి 16,994.36కు చేరింది. మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 10.43 శాతం తగ్గి 15,962.59కు చేరింది. ఇదే సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ మాత్రం కేవలం 3.19 శాతమే కోల్పోయి 32,968.68గా ఉండడం గమనార్హం.

Advertisement
Advertisement