Sakshi News home page

సాహో.. సెన్సెక్స్‌!

Published Wed, Apr 26 2017 11:57 PM

సాహో.. సెన్సెక్స్‌!

► తొలిసారిగా 30,000 మార్కుపైన క్లోజింగ్‌
► మరో కొత్త గరిష్ట స్థాయికి నిఫ్టీ
► 9,367 పాయింట్ల వద్ద ముగింపు
► స్టాక్‌మార్కెట్‌ రికార్డుల మోత


అంతర్జాతీయ మార్కెట్లలో ర్యాలీ, స్టాక్‌ మార్కెట్లోకి నిధుల ప్రవాహం ఊతంతో .. దేశీ సూచీలు కొంగొత్త మైలురాళ్లను అధిగమిస్తున్నాయి. రికార్డుల మోత మోగిస్తున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ బుధవారం తొలిసారిగా 30,000 మార్కును దాటేసి క్లోజయ్యింది. అటు నిఫ్టీ కూడా మరో కొత్త గరిష్ట స్థాయికి చేరింది. బుధవారం పటిష్టంగా ప్రారంభమైన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఇంట్రా డేలో జీవితకాల గరిష్ఠ స్థాయి 30,167.09 పాయింట్ల స్థాయికి కూడా ఎగిసింది. చివరికి 190.11 పాయింట్ల లాభంతో 30,133.35 పాయింట్ల వద్ద క్లోజయింది. దీంతో ఏప్రిల్‌ 5 నాటి రికార్డు స్థాయి ముగింపు 29,974.24 పాయింట్లను దాటేసింది.

గతంలో 2015 మార్చి 4న సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 30,024.74 పాయింట్ల రికార్డు స్థాయిని తాకింది. మూడు రోజుల వ్యవధిలో సెన్సెక్స్‌ 2.62 శాతం (సుమారు 768.05 పాయింట్లు) పెరిగింది. ఇక నిఫ్టీ కూడా మంగళవారం నాటి 9,306.60 క్లోజింగ్, ఇంట్రాడే రికార్డు 9,309.20 పాయింట్లను కూడా దాటేసి పరుగులు తీసింది. మరో కొత్త గరిష్ట స్థాయి 9,367 పాయింట్ల స్థాయిని తాకింది. చివరికి 45.25 పాయింట్ల లాభంతో 9,351.85 వద్ద క్లోజయ్యింది. బీఎస్‌ఈ సరికొత్త రికార్డు స్థాయిలో ముగిసినప్పటికీ.. ఎన్‌ఎస్‌ఈలో కేవలం 0.27 శాతం మాత్రమే పెరిగి రూ. 1,007.90 వద్ద ముగిసింది.

అంతర్జాతీయంగా సానుకూల ధోరణులు..
ఫ్రాన్స్‌ అధ్యక్ష ఎన్నికల తొలి రౌండులో ఎమాన్యుయెల్‌ మాక్రోన్‌కి ఆధిక్యం దక్కిన నేపథ్యంలో అంతర్జాతీయంగా సానుకూల ధోరణులకు అనుగుణంగా దేశీయంగానూ షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పన్ను సంస్కరణల ప్రతిపాదనలపైనా ఇన్వెస్టర్లు ఆశావహంగా ఉండటం కూడా ప్రపంచమార్కెట్ల లాభాలకు కొంత కారణమని మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఇక దేశీయంగా.. ఢిల్లీ మునిసిపల్‌ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యం సైతం ర్యాలీకి కొంత ఊతమిచ్చినట్లు అభిప్రాయపడ్డాయి. కార్పొరేట్ల ఆదాయాలు మెరుగ్గా ఉంటాయన్న ఆశావహ అంచనాలు, దేశ..విదేశ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల జోరుతో స్టాక్‌ మార్కెట్లు ర్యాలీ చేస్తున్నాయని పేర్కొన్నాయి.

అమెరికాలో పన్నుల సంస్కరణల అమలు, యూరోజోన్‌లో రాజకీయపరమైన రిస్కులు తగ్గుముఖం పట్టే సూచనలపై ఆశావహ ధోరణే మార్కెట్‌ పరుగులకు దోహదపడుతోందని వివరించాయి. ‘ఆఖర్లో కాస్త హెచ్చుతగ్గులకు లోనైనప్పటికీ.. ఎక్స్‌పైరీ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ షార్ట్‌కవరింగ్‌ జరగడంతో మార్కెట్‌ మళ్లీ పెరిగింది. ఆదాయాలపై ఆశావహ ధోరణి, దేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు కొనసాగిస్తుండటం మొదలైనవి ర్యాలీకి దోహదపడుతున్నాయి‘ అని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ విభాగం హెడ్‌ వినోద్‌ నాయర్‌ పేర్కొన్నారు.

ఐటీసీ 3 శాతం అప్‌..: 30 షేర్ల సెన్సెక్స్‌లో 18 స్క్రిప్స్‌ లాభాల్లోనూ.. 12 నష్టాల్లోనూ ముగిశాయి. ప్రధానంగా ఐటీసీ 3.36 శాతం, ఎంఅండ్‌ఎం 3.29%, హెచ్‌డీఎఫ్‌సీ 2.36%, హెచ్‌యూఎల్‌ 1.78%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.61% లాభపడ్డాయి. అయితే అదానీ పోర్ట్స్‌ 2.31%, ఇన్ఫోసిస్‌ 1.61%, డాక్టర్‌ రెడ్డీస్‌ 1.31% మేర క్షీణించాయి. బీఎస్‌ఈలో రంగాలవారీగా చూస్తే ఎఫ్‌ఎంసీజీ 2.04%, ఆటోమొబైల్‌ 1.01%, బ్యాంకెక్స్‌ 0.82% లాభపడ్డాయి. రియల్టీ 2.92%, ఎనర్జీ 1.13%, ఐటీ 1.08% క్షీణించాయి. 1,954 స్టాక్స్‌ నష్టాల్లో, 952 షేర్లు లాభాల్లోనూ ముగిశాయి.

చౌక ఇళ్ల నిర్మాణానికి స్థలాల ధరలు తగ్గాల్సిన అవసరం ఉందంటూ నీతి అయోగ్‌ పేర్కొనడంతో రియల్టీపై కొంత ఒత్తిడి పడి ఉండొచ్చని, ఆర్‌బీఐ మరిన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల కన్సాలిడేషన్‌కు అనుకూలంగా ఉండటం బ్యాంక్‌ నిఫ్టీకి పెరుగుదలకు తోడ్పడి ఉండొచ్చని మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఎన్‌ఎస్‌ఈలో స్టాక్స్‌లో రూ. 29,475 కోట్లు, డెరివేటివ్స్‌లో రూ. 7,95,323 కోట్ల టర్నోవరు నమోదైంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు నికరంగా రూ. 493 కోట్ల విక్రయాలు జరపగా, దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ఏకంగా రూ. 1,011 కోట్ల మేర కొనుగోళ్లు జరిపారు.

ప్రపంచ మార్కెట్లు...
అమెరికా మార్కెట్లో ర్యాలీకి అనుగుణంగా ఆసియా సూచీలు అధిక స్థాయుల్లో ముగిశాయి. టోక్యో నికాయ్‌ 1.1 శాతం, హాంకాంగ్‌ హాంగ్‌ సెంగ్‌ 0.5 శాతం, షాంఘై కాంపోజిట్‌ ఇండెక్స్‌ 0.2 శాతం పెరిగాయి. అయితే, యూరప్‌లో సూచీలు మాత్రం కొంత మిశ్రమంగా ట్రేడయ్యాయి.


కొనసాగుతున్న రూపాయి పరుగు..
ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ బలపడుతుండడం కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసే భారత్‌ కమోడిటీ మార్కెట్‌లో (కామెక్స్‌) రూపాయి విలువ 64.11 వద్ద ముగిసింది. మంగళవారం విలువతో పోల్చితే 15 పైసలు బలపడింది. 10వ తేదీ ఆగస్టు 2015 తరువాత (అప్పట్లో 63.87) రూపాయి ఈ స్థాయిలో కామెక్స్‌ మార్కెట్‌లో ముగియడం ఇదే తొలిసారి.  తాజా ముగింపు 21 నెలల గరిష్ట స్థాయి. భారత కమోడిటీ మార్కెట్‌లో రూపాయి 64.23–63.93 శ్రేణిలో తిరిగింది.

ఫారెక్స్‌లో...: అంతర్జాతీయ  ఫారెక్స్‌ మార్కెట్‌లో రూపాయి బుధవారం కడపటి సమాచారం అందే సరికి  64.395 –63.935 రేంజ్‌లో తిరికింది. ఈ వార్త రాసే సమయానికి 64.091 వద్ద ట్రేడవుతోంది. గత ఏడాది నవంబర్‌ చివర్లో 68.881 స్థాయికి చేరిన రూపాయి, అటు తర్వాత క్రమంగా బలపడుతూ వస్తోంది. రూపాయితో పోలిస్తే డాలర్‌ బలహీనమవుతోంది. భారత్‌ ఆర్థిక వృద్ధి బాగుంటుందన్న అంచనాలు, విదేశీ మారక ద్రవ్యం దేశానికి భారీగా రావడం, మార్కెట్ల పరుగు, దేశంలో వడ్డీరేట్లు తగ్గే పరిస్థితి లేదని ఆర్‌బీఐ సంకేతాలు, వీటన్నింటికీ తోడు అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ బలహీనపడాల్సిందేనంటున్న అమెరికా అధ్య క్షుడు ట్రంప్‌ విధానం రూపాయికి బలంగా మారుతున్నాయి.  

పెన్నీ స్టాక్స్‌కు దూరంగా ఉండండి
సెన్సెక్స్‌ రికార్డు స్థాయిని దాటేసిన ఉద్వేగంలో కనిపించిన స్టాక్‌ను కొనుక్కుంటూ పోవద్దని, అప్రమత్తంగా వ్యవహరించాలని బీఎస్‌ఈ సీఈవో ఆశీష్‌ చౌహాన్‌ సూచించారు. పెన్నీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌కి దూరంగా ఉండటం శ్రేయస్కరమని పేర్కొన్నారు. పటిష్టమైన మూలాలు ఉన్న మంచి కంపెనీలనే ఎంచుకోవాలని లేదా మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేయాలంటే మ్యూచువల్‌ ఫండ్స్‌ మార్గాన్నైనా ఎంచుకోవాలని ఆయన సూచించారు.

‘ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 30,000 పాయింట్ల మైలురాయిని సెన్సెక్స్‌ అధిగమించింది. ఎకానమీ పటిష్టంగా ఉండటం, దేశ విదేశ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు వెల్లువెత్తుతుండటం ఇందుకు దోహదపడ్డాయి. అయితే ఇదే ధోరణి కొనసాగుతుందన్న ఊహల్లో ఉండిపోవద్దని ఎక్స్ఛేంజ్‌ కోణంలో ఇన్వెస్టర్లకు మా సూచన. పెన్నీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయొద్దని, రాత్రికి రాత్రి బిచాణా ఎత్తేసే ఆపరేటర్ల చేతిలో మోసపోవద్దని మా సూచన‘  అని చౌహాన్‌ తెలిపారు. జీఎస్‌టీ వంటి సంస్కరణల అమలుతో ఎకానమీ వృద్ధి చెందనున్న నేపథ్యంలో ఈ ఏడాది మార్కెట్స్‌కు లాభదాయకంగా ఉంటుందని చౌహన్‌ చెప్పారు. ఇది ఆరంభం మాత్రమేనని, మరిన్ని ముందు ముందు మరిన్ని మంచి రోజులు రాబోతున్నాయన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement