9,400 కిందే నిఫ్టీ.. కొనసాగిన నష్టాలు | Sakshi
Sakshi News home page

9,400 కిందే నిఫ్టీ.. కొనసాగిన నష్టాలు

Published Thu, May 25 2017 1:05 AM

9,400 కిందే నిఫ్టీ..  కొనసాగిన నష్టాలు

30,301 వద్ద క్లోజయిన సెన్సెక్స్‌  
ముంబై: మే నెలకు సంబంధించి ఫ్యూచర్స్, ఆప్షన్ల గడువు గురువారం తీరిపోనున్న నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్లు బుధవారం కూడా స్వల్ప నష్టాలను ఎదుర్కొన్నాయి. చైనా రేటింగ్‌ను మూడిస్‌ తగ్గించడం కూడా ప్రభావం చూపించింది. రోజంతా ట్రేడింగ్‌ ఊగిసలాట మధ్య కొనసాగింది. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగడంతో నిఫ్టీ కీలకమైన 9,400 మార్క్‌కు దిగువనే వరుసగా రెండోరోజూ క్లోజయింది. ఇంట్రాడేలో నిఫ్టీ 9,400పైకి వెళ్లినప్పటికీ అమ్మకాల నేపథ్యంలో నిలదొక్కుకోలేకపోయింది. చివరికి 25.60 పాయింట్ల నష్టంతో (0.27 శాతం) 9,360.55 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ సైతం 63 పాయింట్ల నష్టంతో (0.21 శాతం) 30,301.64 వద్ద క్లోజయింది.

ఇండెక్స్‌ షేర్లలో ఎల్‌అండ్‌టీ గరిష్టంగా 3.22 శాతం నష్టపోయింది. ఆ తర్వాత సిప్లా 2.40 శాతం, డాక్టర్‌ రెడ్డీస్, కోల్‌ ఇండియా, ఎస్‌బీఐ, ఎంఅండ్‌ఎం 2 శాతం వరకూ నష్టాలను చవిచూశాయి. ఫార్మా కంపెనీ లుపిన్‌ లాభం నాలుగో త్రైమాసికంలో సగం మేర తరిగిపోవడంతో కంపెనీ షేరు 1.71 శాతం నష్టపోయి 52 వారాల కనిష్ట స్థాయికి చేరింది. ఇక అత్యధికంగా లాభపడ్డ షేరుగా టాటా మోటార్స్‌ నిలిచింది. నాల్గవ త్రైమాసికంలో మంచి ఫలితాలు దీనికి ఒక కారణం.

Advertisement
Advertisement