త్వరలో మైక్రో హోమ్ లోన్స్ | Sakshi
Sakshi News home page

త్వరలో మైక్రో హోమ్ లోన్స్

Published Thu, Sep 4 2014 12:43 AM

త్వరలో మైక్రో హోమ్ లోన్స్

డీసీబీ బ్యాంక్ (గతంలో డెవలప్‌మెంట్ క్రెడిట్ బ్యాంక్) ప్రధానంగా గ్రామీణ మార్కెట్‌పై దృష్టిసారిస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా రైతులు, చిన్నవ్యాపారుల అవసరాలకు అనుగుణంగా కొత్త రుణ పథకాలను ప్రవేశపెట్టడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో శాఖలు ఏర్పాటుచేస్తున్నామని,  రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున విస్తరణ కార్యక్రమాలు చేపట్టామంటున్న డీసీబీ బ్యాంక్ అగ్రి, ఇంక్లూజివ్ బ్యాంకింగ్ హెడ్ నరేంద్రనాథ్ తో సాక్షి’ ఇంటర్వ్యూ వివరాలు ఇవీ...


 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తీవ్ర వర్షాభావ పరిస్థితిని ఎదుర్కొంటుడడంతో వ్యవసాయ మార్కెట్‌పై ఏమైనా ప్రభావం పడిందా?
 మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు బాగా తక్కువ కురవడంతో వ్యవసాయ రుణాలపై కొంత ప్రభావం ఉన్న మాట వాస్తవమే. కానీ రానున్న వారాల్లో వర్షాలు కొంత మెరుగుపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నుంచి సమాచారం వస్తుండటంతో పరిస్థితి మెరుగుపడుతుందని భావిస్తున్నాం.

 గ్రామీణ ప్రాంత ప్రజల కోసం ఎటువంటి ప్రత్యేకమైన పథకాలను డీసీబీ బ్యాంక్ అందిస్తోంది?
 గ్రామీణ ప్రాంత ప్రజల అవసరాలు, వారి ఆదాయ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకమైన పథకాలను అందిస్తున్నాము. ఉదాహరణకు రైతులకు ఉద్యోగస్తుల వలే ప్రతి నెలా స్థిరమైన ఆదాయం ఉండదు. కొన్ని కాలాల్లో అధికాదాయం ఉంటే మరికొన్ని కాలాల్లో ఉండదు. దీనికి అనుగుణంగానే రైతులు నగదు లభ్యతను బట్టి ఈఎంఐలు చెల్లించే విధంగా ట్రాక్టర్ రుణాలను అందిస్తున్నాము.

అలాగే వారి అవసరాలకు అనుగుణంగా ఇంటి వద్దనే బ్యాంకింగ్ సేవలను అందిస్తున్నాం. రైతులకు అవసరమైన కిసాన్ క్రెడిట్ కార్డులు, బంగారు ఆభరణాలపై రుణాలు, ట్రాక్టర్లు, ఇంకా వ్యవసాయానికి సంబంధించిన వాణిజ్య వాహనాలకు రుణాలను ఇస్తున్నాం. కేవలం ఒక ఎకరం భూమి ఉన్న రైతుకు కూడా ట్రాక్టర్లకు రుణాలను ఇస్తున్నాం. అర్హత కలిగిన రైతులకు మూడు రోజుల్లోనే రుణాలను మంజూరు చేస్తున్నాం.

 రైతులకు, గ్రామీణ మహిళలకు కొత్తగా ఏమైనా పథకాలను ప్రవేశపెట్టే ఆలోచన ఉందా?
 కూలీల దగ్గర నుంచి జీతం ఆదాయంగా ఉన్న వారి వరకు అందరికీ ఇచ్చేలా మైక్రో గృహ రుణ పథకాన్ని త్వరలో ప్రవేశపెట్టనున్నాం. ఈ పథకం కింద కనిష్టంగా రూ. లక్ష నుంచి గరిష్టంగా  రూ. 5 లక్షల వరకు రుణాన్ని ఇస్తాము.

 రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో వ్యాపార విస్తరణ కార్యక్రమాల గురించి వివరిస్తారా?
 రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో వ్యాపార అవకాశాలు పెరిగాయి. అందుకే ఈ రెండు రాష్ట్రాల విస్తరణపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నాము. మొన్నటి వరకు హైదరాబాద్, వరంగల్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తూ వచ్చిన డీసీబీ ఈ మధ్యే ఆకివీడు, అనపర్తి, గుంటూరు సమీపంలోని నల్లపాడు, కరీంనగర్‌కు దగ్గర్లోని రేకుర్తి, విజయవాడలో కొత్తగా శాఖలను ఏర్పాటు చేయడం జరిగింది.

త్వరలోనే నిజామాబాద్‌లోని బోర్గాన్, కైకలూరు, మిర్యాలగూడ, మహబూబాబాద్ సమీపంలోని పెద్దతండాల్లో శాఖలను ఏర్పాటు చేయనున్నాం. దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 133 శాఖలను కలిగి ఉన్నాం. ప్రధానంగా వ్యవసాయం, మైక్రో ఎస్‌ఎంఈ లు, ఎస్‌ఎంఈలు, మిడ్ కార్పొరేట్స్, రిటైల్ వ్యాపారాలపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నాం. రూ. 100లతో రికరింగ్ డిపాజిట్, మైక్రో బిజినెస్, డీసీబీ ఎలైట్ అకౌంట్ పేరుతో విభిన్న పథకాలను అందిస్తున్నాం.
 
ఈ రెండు రాష్ర్ట ప్రభుత్వాలు ప్రకటించిన రుణ మాఫీ పథకం మీ వ్యవసాయ పోర్ట్‌ఫోలియోపై ఏమైనా ప్రభావం చూపిందా?
 రిటైల్ అగ్రి వ్యాపారంలోకి ఈ మధ్యనే ప్రవేశించాం. అందులో ఈ రెండు రాష్ట్రాల్లో అగ్రి బ్రాంచ్‌లను కొత్తగా ప్రారంభించడంతో ఈ రుణ మాఫీ పథక ప్రభావంపై అప్పుడే చెప్పలేం.
 
ప్రధాన మంత్రి ప్రవేశపెట్టిన ‘జన ధన యోజన’ పథకంలో డీసీబీ కూడా పాలుపంచుకుంటోందా?
 ఇతర వాణిజ్య బ్యాంకుల్లాగానే ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నాం.

Advertisement
Advertisement