గణాంకాలు, విదేశీ సంకేతాలే కీలకం | Sakshi
Sakshi News home page

గణాంకాలు, విదేశీ సంకేతాలే కీలకం

Published Mon, Aug 11 2014 12:57 AM

గణాంకాలు, విదేశీ సంకేతాలే కీలకం - Sakshi

న్యూఢిల్లీ: చివరి దశకు చేరిన కార్పొరేట్ ఫలితాలు, ఆర్థిక గణాంకాలు, విదేశీ సంకేతాలే ఈ వారం మార్కెట్లకు దిక్సూచిగా నిలవనున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. మంగళవారం(12న) జూన్ నెలకు పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ)తోపాటు, జూలై నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు వెలువడనున్నాయి. ఇక గురువారం(14న) జూలై టోకు ధరల ఆధారిత ధరల(డబ్ల్యూపీఐ) వివరాలు వెల్లడికానున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం కారణంగా శుక్రవారం(15న) స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. దీంతో ట్రేడింగ్ 4 రోజులకే పరిమితంకానుంది.

 అమ్మకాలు కొనసాగుతాయ్...
 గత వారం మార్కెట్లలో కనిపించిన ప్రతికూల పరిస్థితులు కొనసాగుతాయని భావిస్తున్నట్లు రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్‌లిక్ చెప్పారు. అయితే ఎన్‌ఎస్‌ఈ ప్రధాన సూచీ నిఫ్టీకి 7,450 వద్ద మద్దతు లభిస్తుందని అంచనా వేశారు. క్యూ1 ఫలితాలు చివరి దశకు చేరిన ప్రస్తుత పరిస్థితుల్లో విదేశీ సంకేతాలు కీలకంగా నిలవనున్నాయని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు ఇరాక్ సంక్షోభంపై దృష్టిపెడతారని పేర్కొన్నారు.

 రిజల్ట్స్‌కు దిగ్గజాలు రెడీ
 ఈ వారం పలు దిగ్గజ కంపెనీలు క్యూ1(ఏప్రిల్-జూన్) ఫలితాలను ప్రకటించనున్నాయి. జాబితాలో సన్ ఫార్మా, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఓఎన్‌జీసీ, కోల్ ఇండియా, ఐవోసీ, ఆయిల్ ఇండియా, హిందాల్కో, ఎన్‌ఎండీసీ, టాటా పవర్, సిప్లా, జేపీ అసోసియేట్స్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఉన్నాయి. కాగా, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు వంటి అంశాలు కూడా సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు పేర్కొన్నారు. గడచిన శుక్రవారం(8న) డాలరుతో మారకంలో రూపాయి ఐదు నెలల కనిష్టమైన 61.74కు చేరగా, మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్ నాలుగు వారాల కనిష్టం 25,329 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే.

 ద్రవ్యోల్బణం ఎఫెక్ట్
 స్వల్ప కాలంలో మార్కెట్ల నడకను టోకుధరలు, రిటైల్ ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు నిర్దేశిస్తాయని క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్ డెరైక్టర్ వివేక్ గుప్తా అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా ఇరాక్ మిల టెంట్ స్థావరాలపై వైమానిక దాడులకు ఆదేశించిన నేపథ్యంలో అంతర్జాతీయ పరిణామాలను ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలిస్తారని అత్యధిక శాతంమంది నిపుణులు వ్యాఖ్యానించారు. మరోవైపు ఉక్రెయిన్, గాజా ఆందోళనలు కొనసాగుతుండటం కూడా సెంటిమెంట్ బలహీనపడటానికి కారణమైనట్లు తెలిపారు. ఈ పరిస్థితులు అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరల పెరుగుదలకు దారితీస్తున్నాయన్నారు.

Advertisement
Advertisement