నేడు దక్షిణాదిలో బ్యాంకులు బంద్ | Sakshi
Sakshi News home page

నేడు దక్షిణాదిలో బ్యాంకులు బంద్

Published Tue, Dec 2 2014 12:00 AM

నేడు దక్షిణాదిలో బ్యాంకులు బంద్

వేతన సవరణపై ఉద్యోగుల సమ్మె
జోన్ల వారీగా నాలుగు రోజులపాటు..
బ్యాంకింగ్ కార్యకలాపాలపై ప్రభావం


ముంబై: వేతన సవరణ డిమాండ్‌తో ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగుతుండటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో మంగళవారం(నేడు) బ్యాంకులు పనిచేయవు. ఇరు రాష్ట్రాల్లోని 5,000 శాఖలకు చెందిన దాదాపు 80 వేల పైచిలుకు ఉద్యోగులు, అధికారులు ఇందులో పాల్గొంటున్నారని యునెటైడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్‌బీయూ) ప్రాంతీయ శాఖ తెలిపింది. వేతన సవరణపై సోమవారం ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్‌తో (ఐబీఏ) జరిపిన చర్చలు విఫలం కావడంతో యూఎఫ్‌బీయూ ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. దీని ప్రకారం ఉద్యోగులు జోన్లవారీగా మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు రిలే సమ్మెకు దిగుతున్నారు.

ముందుగా దక్షిణాదిన నేడు (డిసెంబర్ 2), ఉత్తరాది జోన్‌లో 3న, తూర్పు జోన్‌లో 4న, పశ్చిమ జోన్‌లో 5న స్ట్రయిక్ చేస్తున్నారు. దీంతో బ్యాంకింగ్ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడనుంది. ఐబీఏ, యూఎఫ్‌బీయూ మధ్య సయోధ్య కుదిర్చేందుకు ముంబైలోని డిప్యుటీ చీఫ్‌లేబర్ కమిషనర్ చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో సమ్మె అనివార్యమైంది.

ఇటు ప్రభుత్వం, అటు ఐబీఏ సమ్మె ప్రతిపాదన విరమించుకుని చర్చల్లో పాల్గొనాలని సూచించినట్లు యూఎఫ్‌బీయూ మహారాష్ట్ర కన్వీనర్ విశ్వాస్ ఉతాగి తెలిపారు. అయితే, తాము మాత్రం సమ్మె యోచన అమలుకే నిర్ణయించుకున్నట్లు ఆయన వివరించారు. వేతన సవరణ, వారానికి అయిదు రోజులకు పనిదినాల కుదింపు తదితర డిమాండ్లతో బ్యాంకు ఉద్యోగుల యూనియన్లు గత నెల 12న దేశవ్యాప్తంగా సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే.

మరోవైపు, బ్యాంకు యూనియన్లు తలపెట్టిన సమ్మె అనైతికమని..  సమ్మె యోచన విరమించుకోవాలని ఐబీఏ విజ్ఞప్తి చేసింది. సిబ్బంది వ్యయాలు పెరిగి, లాభాలు క్షీణిస్తున్నందున ఉద్యోగులు కోరుతున్నట్లుగా 23% మేర జీతభత్యాలు పెంచే పరిస్థితి లేదని   పేర్కొంది. ఉద్యోగులు 23% డిమాండ్‌ను తగ్గించుకుంటే చర్చలకు తాము సిద్ధమని తెలిపింది.

Advertisement
Advertisement