ఫండ్స్... ఏవి బెస్ట్.. | Sakshi
Sakshi News home page

ఫండ్స్... ఏవి బెస్ట్..

Published Mon, May 16 2016 4:02 AM

ఫండ్స్... ఏవి బెస్ట్..

ప్రముఖ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా అయేషా ఈ మధ్యనే వృత్తి జీవితాన్ని ప్రారంభించింది. చిన్నప్పటి నుంచే చక్కటి ప్రణాళికలతో ముందుకెళ్ళిన అయేషా ఇప్పుడు ఉద్యోగం చేయడం ప్రారంభించిన తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ కోసం కూడా అదే విధానాన్ని ఎంచుకుంది. ఇందులో భాగంగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించుకొని ఫండ్ అడ్వైజర్‌ని సంప్రదించింది. అడ్వైజర్‌తో సంభాషించిన తర్వాత మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి మూడు అంశాలు ఆకర్షించాయి. ఇందులో మొదటిది అయేషా స్వల్పకాలిక దృష్టితో కాకుండా దీర్ఘకాలానికి సంపదను సృష్టించుకోవాలన్నది లక్ష్యం.

దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్‌కు మ్యూచువల్ ఫండ్స్ ఒక చక్కటి ఇన్వెస్ట్‌మెంట్ సాధనంగా భావించింది. అలాగే ఈ రంగంలో బాగా అనుభవం ఉన్న ఫండ్ మేనేజర్లకు ఇన్వెస్ట్‌మెంట్ అవకాశం ఇవ్వడం రెండోది. అలాగే ఇన్వెస్ట్‌మెంట్ విధానం చాలా సులభంగా ఉండటం, ఎప్పుడు కావాలంటే అప్పుడు నగదును వెనక్కి తీసుకునే అవకాశం ఉండటం మరింత ఆకర్షించింది. అయేషా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించుకుందే కానీ... ఏ పథకంలో ఇన్వెస్ట్ చేయాలన్నది ఇప్పుడు అతిపెద్ద సమస్య. సుమారు 40 ఫండ్ హౌస్‌లు 1,000కిపైగా పథకాలను అందిస్తున్నాయి.

దీర్ఘకాలంలో సంపద సృష్టికి ఈక్విటీలు చక్కటి అవకాశంగా భావిస్తున్న అయేషా డెట్ పథకాల్లో కాకుండా కేవలం ఈక్విటీ పథకాల్లోనే ఇన్వెస్ట్ చేయాలనుకుంటోంది. కానీ ఈక్విటీల్లో కూడా డైవర్సిఫైడ్ ఈక్విటీ, బ్యాలెన్స్‌డ్, మిడ్‌క్యాప్, సెక్టర్ ఫండ్స్ అంటూ అనేక రకాలున్నాయి. ఇప్పుడు వీటిల్లో వేటిని ఎంచుకోవాలన్నది కూడా సమస్యే. అయేషా ఇన్వెస్ట్‌మెంట్ ప్రణాళిక ప్రకారం బ్యాలెన్స్‌డ్, మిడ్ క్యాప్ ఫండ్స్ అనుకూలం కాదు. ఇక మిగిలినది డైవర్సిఫైడ్ ఈక్విటీ, సెక్టర్ ఫండ్స్. ఇప్పుడు ఈ రెండింటిలో ఉన్న లాభనష్టాలను పరిశీలిద్దాం..

 
తేడా ఏమిటి..

డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్... పేరుకు తగ్గట్టుగానే ఈ ఫండ్ అత్యధికంగా వివిధ రంగాలకు చెందిన లార్జ్‌క్యాప్ షేర్లలో ఇన్వెస్ట్ చేస్తుంది. కొంతమొత్తం చిన్న షేర్లకు కేటాయిస్తుంది. ఈ ఫండ్ ముఖ్యోద్దేశం సాధ్యమైనంత వరకు స్టాక్ మార్కెట్లో ఉండే నష్టభయాన్ని తగ్గించడమే. ఇందుకోసం ఒకదానితో ఒకటి సంబంధం లేని షేర్లను ఎంపిక చేసుకుంటారు. ఇంకా సులభంగా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే.. మీ ఇన్వెస్ట్‌మెంట్ మొత్తాన్ని బ్యాంకులు, ఆటోమొబైల్, రియల్ ఎస్టేట్ రంగాలకు కేటాయించారనుకుందాం.

ఒక్కసారి వడ్డీరేట్లు పెరగడం మొదలైతే ఈ మూడు రంగాలు బాగా దెబ్బతింటాయి. దీంతో భారీ నష్టాలను మూటకట్టుకోవాల్సి వస్తుంది. వడ్డీరేట్లు తగ్గితే లాభాలు కూడా అదే విధంగా వస్తాయి కానీ అది వేరే విషయం. ఇలా ఒక సంఘటన వల్ల ఎక్కువ నష్టాలు రాకుండా ఉండే విధంగా పోర్ట్‌ఫోలియోలో విభిన్న రంగాలకు చెందిన పెద్ద కంపెనీల షేర్లు ఉండే విధంగా చూస్తారు.
 
ఇక సెక్టర్ ఫండ్స్ విషయానికి వస్తే ఇవి కేవలం ఒక సెక్టర్‌కి చెందిన షేర్లలో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాయి. ఉదాహరణకు ఫార్మా ఫండ్‌ను తీసుకుంటే ఈ పథకం కేవలం ఫార్మా కంపెనీల్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తుంది. అదే బ్యాంక్ ఫండ్ బ్యాంకు షేర్లలో, ఎఫ్‌ఎంసీజీ ఫండ్ ఆ రంగానికి చెందిన ఎఫ్‌ఎంసీజీ షేర్లలో ఇన్వెస్ట్ చేస్తుంది. వీటిలో ప్రధాన ఆకర్షణ ఏమిటంటే..

ఆ రంగం పనితీరు బాగున్నప్పుడు మంచి లాభాలు వస్తాయి. కానీ ఇదే సమయంలో ఆ రంగం పనితీరు బాగోకపోతే నష్టాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. గత మూడేళ్లను పరిశీలిస్తే ఫార్మా ఫండ్స్ సగటున 19.5 శాతం రాబడిని ఇస్తే, బ్యాంకింగ్ ఫండ్స్ 5.2 శాతం, టెక్నాలజీ ఫండ్ 22 శాతం లాభాలను అందించాయి.  ఇదే సమయంలో డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్ 11.4 శాతం లాభాలను ఇచ్చాయి. దీన్ని బట్టి మీరు దేన్ని ఎంచుకుంటారు?
 
లక్ష్యం ఏమిటి?
స్టాక్ మార్కెట్లో ఉండే సహజమైన నష్ట భయాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకుంటూ అధిక లాభాలను పొందాలన్న ఉద్ధేశంతో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. ముఖ్యంగా రిటైర్మెంట్, పిల్లల చదువు వంటి లక్ష్యాలకు ఇన్వెస్ట్ చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇలా ఒక లక్ష్యం కోసం ఇన్వెస్ట్ చేసేవారికి సెక్టర్ ఫండ్స్ అనుకూలంగా ఉండవు. ఒకసారి ఆ రంగంలో ఏదైనా ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే మీ లక్ష్యాన్ని చేరుకోలేరు.

మూడేళ్ల క్రితం ఐటీ సెక్టర్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు మంచి లాభాలు వచ్చాయి. కానీ ఇదే సమయంలో బ్యాంకింగ్, ఇన్‌ఫ్రా రంగాల్లో ఇన్వెస్ట్ చేసిన వారి పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. కాబట్టి రాబోయే కాలంలో ఏ సెక్టర్ పనితీరు బాగుంటుందో ముందుగా ఊహించడం చాలా కష్టమైన పని. కాబట్టి దీర్ఘకాలిక లక్ష్యాలకు డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్ అనువుగా ఉంటాయి. ఒకేసారి విభిన్నమైన రంగాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా రిస్క్ భయాన్ని తగ్గించుకోవడం ద్వారా లక్ష్యాన్ని చేరుకోవచ్చు.
 
రిస్క్ చేస్తానంటే...
డైవర్సిఫైడ్ ఫండ్స్ కాకుండా సెక్టర్ ఫండ్స్‌ను ఎంచుకుంటే ఆ మేరకు మీ పోర్ట్‌ఫోలియోలో రిస్క్ భయం పెరుగుతుంది. సెక్టర్ ఫండ్స్‌లో మూడు రకాలైన భయాలుంటాయి. ఉదాహరణకు ఫార్మా సెక్టర్‌ను తీసుకుంటే... యూఎస్ ఎఫ్‌డీఏ నిబంధనల వల్ల గడచిన ఏడాది నుంచి ఫార్మా షేర్లు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇలా మన అంచనాలకు సంబంధం లేకుండా బయటి సంఘటనల వల్ల కొన్ని సందర్భాల్లో ఆయా రంగాలు ఒత్తిడిని ఎందుర్కొంటాయి. అలాగే సెక్టర్ ఫండ్స్‌లో లార్జ్ క్యాప్ షేర్లు చాలా తక్కువ ఉంటాయి. దీంతో ఫండ్ మేనేజర్లు చిన్న షేర్లలో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. దీంతో పోర్ట్‌ఫోలియోలో రిస్క్ మరింత పెరుగుతుంది. డైవర్సిఫైడ్ ఫండ్స్‌తో పోలిస్తే సెక్టర్ ఫండ్స్‌లో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి.
 
అయేషా ఏమి చేయాలి?
చివరగా అయేషా పోర్ట్‌ఫోలియో ఏవిధంగా ఉంటే బాగుంటుందో ఇప్పుడు చూద్దాం.
డైవర్సిఫైడ్ ఫండ్స్‌తో అనేక లాభాలున్నాయి కాబట్టి ప్రధానంగా వీటిపైనే దృష్టిపెట్టాలి.
అయేషా చిన్న వయస్సులోనే ఉద్యోగం ప్రారంభించింది కాబట్టి ఇన్వెస్ట్‌మెంట్‌లో కొంత రిస్క్ చేయొచ్చు. సెక్టర్ ఫండ్స్  పనితీరును పరిశీలించడం కోసం పోర్ట్‌ఫోలియోలో గరిష్టంగా 20 శాతం మించకుండా సెక్టర్ ఫండ్స్‌కు కేటాయించుకోవచ్చు.
ఒకేసారిగా కాకుండా ప్రతినెలా ఇన్వెస్ట్ చేసే విధంగా సిప్ విధానాన్ని ఎంచుకోవాలి. దీనివల్ల మార్కెట్లో ఉండే ఒడిదుడుకుల నుంచి లబ్ధి పొందొచ్చు.
సెక్టర్ ఫండ్స్ పనితీరును మధ్యమధ్యలో పరిశీలించాలి. ఒకవేళ పనితీరు బాగోలేకపోతే.. వాటినుంచి వైదొలిగి ఆ మొత్తాన్ని తిరిగి డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్‌కు మరల్చాలి.
 - అనిల్ రెగో
 సీఈవో, రైట్ హొరెజైన్స్

Advertisement
Advertisement