ధర.. దడ... | Sakshi
Sakshi News home page

ధర.. దడ...

Published Wed, Nov 15 2017 12:58 AM

Wholesale inflation touches 6-month high in October - Sakshi

న్యూఢిల్లీ: ఇంధనం, ఆహార పదార్ధాల రేట్లు పెరగడంతో అక్టోబర్‌లో టోకు ధరల ఆధారిత సూచీ (డబ్ల్యూపీఐ) ఆరు నెలల గరిష్టానికి ఎగిసి 3.59 శాతానికి చేరుకుంది. సెప్టెంబర్‌లో ఇది 2.60 శాతంగా ఉండగా, గతేడాది అక్టోబర్‌లో 1.27 శాతంగానే నమోదయింది.

ఈ ఏడాది ఏప్రిల్‌లో నమోదైన 3.85 శాతం స్థాయి అనంతరం ఆరు నెలల తర్వాత అక్టోబర్‌లో నమోదైనదే అత్యధికం కావడం గమనార్హం. కేంద్ర గణాంకాల శాఖ మంగళవారం విడుదల చేసిన డేటా ప్రకారం ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం రెట్టింపై 4.30 శాతానికి చేరింది. ఉల్లి రేట్లు ఏకంగా 127.04 శాతం ఎగియగా, కూరగాయల ధరలు 36.61 శాతం, గుడ్లు..మాంసం.. చేపల విభాగం 5.76 శాతం మేర పెరిగాయి.

ఇక మిగతా విభాగాల సంగతి చూస్తే..
తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గి 2.6%గా నమోదైంది. సెప్టెంబర్‌లో 2.7%.
 ఇంధనం, విద్యుత్‌ విభాగంలో ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 9.01% ఉండగా.. అక్టోబర్‌లో 10.52%కి పెరిగింది. పప్పు ధాన్యాలు 31%, బంగాళదుంప 44%, గోధుమలు 2% ప్రతికూల ద్రవ్యోల్బణం నమోదు చేశాయి.

యథాతథంగానే వడ్డీ రేట్లు..
డబ్ల్యూపీఐలోని కూరగాయలు, పండ్లు, ముడిచమురు, సహజ వాయువు, ఇంధనాలు, ఖనిజాలు, విద్యుత్‌ మొదలైన అన్ని విభాగాలు భారీగానే పెరిగినట్లు కన్సల్టెన్సీ సంస్థ ఇక్రా ప్రిన్సిపల్‌ ఎకానమిస్ట్‌ అదితి నాయర్‌ తెలిపారు. డబ్ల్యూపీఐ ఊహించిన దానికన్నా అధికంగానే పెరిగిన నేపథ్యంలో రాబోయే పరపతి విధాన సమీక్షలో రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్లను యథాతథంగానే ఉంచే అవకాశాలు ఉన్నాయని నాయర్‌ తెలిపారు.

డిసెంబర్‌ 6న ఆర్‌బీఐ పాలసీ సమీక్ష నిర్వహించనుంది.  ఆహార పదార్ధాల రేట్ల పెరుగుదలతో  రిటైల్‌ ద్రవ్యోల్బణం 7 నెలల గరిష్టమైన 3.58%కి ఎగిసిన సంగతి తెలిసిందే. అటు తయారీ రంగం అంతంత మాత్రం పనితీరుతో పాటు కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ ఉత్పత్తి తగ్గుదలతో పారిశ్రామికోత్పత్తి సెప్టెం బర్‌లో 3.8% మాత్రమే వృద్ధి నమోదు చేసింది.

కాగా, ఇటీవలే 200 ఉత్పత్తులపై వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ)ను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఆహార, పానీయాల రేట్లు తగ్గొచ్చని ఆర్థిక సేవల సంస్థ నొమురా ఒక నివేదికలో పేర్కొంది. దీంతో రిటైల్‌ ద్రవ్యోల్బణం సైతం ప్రస్తుత స్థాయి నుంచి 20 బేసిస్‌ పాయింట్ల (0.2 శాతం) మేర తగ్గొచ్చని తెలిపింది.

Advertisement
Advertisement