Sakshi News home page

బైబ్యాక్‌లో వ్యవస్థాపకులూ పాల్గొనొచ్చు

Published Thu, Aug 31 2017 1:22 AM

బైబ్యాక్‌లో వ్యవస్థాపకులూ పాల్గొనొచ్చు

బెంగళూరు: ఐటీ దిగ్గజం ప్రతిపాదించిన రూ. 13,000 కోట్ల బైబ్యాక్‌ ఆఫర్‌లో వ్యవస్థాపకులు కూడా తమ షేర్లను విక్రయించాలనుకోవడంలో తప్పేమీ లేదని సంస్థ మాజీ సీఎఫ్‌వో వి. బాలకృష్ణన్‌ అభిప్రాయపడ్డారు. ఇన్వెస్టర్లకు ఇదేమీ తప్పుడు సంకేతాలు పంపబోదని పేర్కొన్నారు. ‘సాధారణ పరిస్థితుల్లో వ్యవస్థాపకులు తమ షేర్లను విక్రయిస్తుంటేనే సందేహపడాల్సి రావొచ్చు.

 దేశీ పరిభాషలో బైబ్యాక్‌ అనేది పన్నుపరమైన ప్రయోజనాలు కల్పించే డివిడెండ్‌కు మరో రూపం లాంటిదిగా భావించవచ్చు. నిజానికి సీఈవో సిక్కా రాజీనామా చేయడానికి కాస్త ముందుగా కంపెనీ బోర్డు బైబ్యాక్‌ ప్రకటించడమే నాలాంటి బయటి వ్యక్తులకు అసాధారణమైనదిగా అనిపిస్తోంది‘ అని ఆయన తెలిపారు. వ్యవస్థాపకులు బైబ్యాక్‌లో షేర్లు విక్రయిస్తే. కంపెనీ భవిష్యత్‌పై సందేహాలుండటం వల్లే ప్రమోటర్లు బైబ్యాక్‌లో పాల్గొన్నారన్న సంకేతాలేమైనా ఇచ్చినట్లవుతుందా అన్న ప్రశ్నపై స్పందిస్తూ బాలా ఈ విషయాలు చెప్పారు.

సీఈవో గురించి వారెప్పుడూ మాట్లాడలేదు..
కంపెనీ తమ సారథ్యంలోనే నడుస్తున్నప్పటికీ వ్యవస్థాపకులు ఎప్పుడూ కూడా తమ వాటాలను అడ్డం పెట్టుకుని నియంత్రణాధికారాలు దక్కించుకునేందుకు చూడలేదని బాలా చెప్పారు. తమ పనితీరు ఆధారంగానే కంపెనీపై అజమాయిషీ చేశారని, పనితీరు బాగుండి షేర్‌హోల్డర్లకు ప్రయోజనాలు చేకూర్చినంతకాలం వాటాదారుల మద్దతు తమకు ఉంటుందని వారు విశ్వసించారని తెలిపారు. ఇక, సీఈవో గురించి గానీ కంపెనీ పనితీరు లేదా వ్యూహాల గురించి గానీ వారెప్పుడూ మాట్లాడలేదని, సంస్థ వ్యవహారాల్లోనూ తలదూర్చలేదని బాలా చెప్పారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement