కరోనా.. టెర్రర్‌! | Sakshi
Sakshi News home page

కరోనా.. టెర్రర్‌!

Published Sat, Mar 7 2020 4:41 AM

YES Bank, virus concerns drag Sensex 894 pts lower - Sakshi

కోవిడ్‌–19(కరోనా) వైరస్‌ కల్లోలం కారణంగా ప్రపంచం మాంద్యంలోకి జారిపోతోందనే ఆందోళనతో ప్రపంచ మార్కెట్లు భారీగా పతనం కావడంతో శుక్రవారం మన మార్కెట్‌ కూడా భారీగా నష్టపోయింది. యస్‌ బ్యాంక్‌పై ఆర్‌బీఐ ఆంక్షలు విధించడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 38,000 పాయింట్లు, నిఫ్టీ 11,000 పాయింట్ల దిగువకు పడిపోయాయి. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతుండటం, డాలర్‌తో రూపాయి మారకం 74 స్థాయికి చేరువ కావడం, ముడి చమురు ధరలు 2.5 శాతం మేర క్షీణించడం కూడా ప్రతికూల ప్రభావం చూపించాయి.

ఇంట్రాడేలో 1,459 పాయింట్ల మేర క్షీణించిన సెన్సెక్స్‌ చివరకు 894 పాయింట్ల నష్టంతో 37,577 పాయింట్ల వద్దకు చేరింది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 280 పాయింట్లు పతనమై 10,989 పాయింట్ల వద్ద ముగిసింది. బ్యాంక్‌ నిఫ్టీ 1,014 పాయింట్లు కోల్పోయి 27,801 పాయింట్లకు చేరింది. సెన్సెక్స్‌ 2.3 శాతం, నిఫ్టీ 2.4 శాతం, బ్యాంక్‌ నిఫ్టీ 3.5 శాతం చొప్పున నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు క్షీణించాయి. సెన్సెక్స్, నిఫ్టీలు ఆరు నెలల కనిష్టానికి, బ్యాంక్‌ నిఫ్టీ ఐదు నెలల కనిష్టానికి పడిపోయాయి. ఇక వారం పరంగా చూస్తే, సెన్సెక్స్‌ 721 పాయింట్లు, నిఫ్టీ 212 పాయింట్లు నష్టపోయాయి.  

చివర్లో తగ్గిన నష్టాలు....
గురువారం అమెరికా మార్కెట్, శుక్రవారం ఆసియా మార్కెట్లు భారీగా నష్టపోవడంతో మన మార్కెట్‌ కూడా భారీ నష్టాల్లో ఆరంభమైంది. సెన్సెక్స్‌ 857 పాయింట్లు, నిఫ్టీ 326 పాయింట్ల నష్టాలతో మొదలయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 1,460 పాయింట్లు, నిఫ్టీ 442 పాయింట్ల మేర క్షీణించాయి. చివర్లో నష్టాలు కొంత తగ్గాయి. యస్‌ బ్యాంక్‌పై ఆర్‌బీఐ తీసుకున్న చర్యల నేపథ్యంలో బ్యాంక్‌ షేర్లు బేర్‌మన్నాయి. కరోనా వైరస్‌ కల్లోలం నేపథ్యంలో విమానయాన, లోహ షేర్లు నష్టపోయాయి.  ఆసియా మార్కెట్లు 1–3 శాతం, యూరప్‌ మార్కెట్లు 3–4 శాతం రేంజ్‌లో క్షీణించగా,  అమెరికా సూచీలు 2–3 శాతం నష్టాల్లో ట్రేడయ్యాయి.  

► 30 సెన్సెక్స్‌ షేర్లలో మూడు షేర్లు–బజాజ్‌ ఆటో, మారుతీ సుజుకీ, ఏషియన్‌ పెయింట్స్‌ మాత్రమే లాభపడ్డాయి.     

► యస్‌ బ్యాంక్‌లో వాటాను ఎస్‌బీఐ కొనుగోలు చేయనున్నదన్న వార్తల నేపథ్యంలో ఎస్‌బీఐ షేర్‌ 6 శాతం నష్టంతో రూ.270 వద్దకు చేరింది.  

► చైనాలో రిటైల్‌ అమ్మకాలు 85 శాతం తగ్గడంతో టాటా మోటార్స్‌ షేర్‌ 9% నష్టంతో రూ.114 వద్ద ముగిసింది.  

► దాదాపు 600కు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, ఐటీసీ, ఓఎన్‌జీసీ, పీఎన్‌బీ,  ఇండిగో,  తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.   

► మొత్తం ఐదు షేర్లు సెన్సెక్స్‌ను 510 పాయింట్ల మేర పడగొట్టాయి. సెన్సెక్స్‌ నష్టాల్లో హెచ్‌డీఎఫ్‌సీ వాటా 140 పాయింట్లుగా ఉంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వాటా 125 పాయింట్లు, ఐసీఐసీఐ బ్యాంక్‌ 113 పాయింట్లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 68 పాయింట్లు, ఎస్‌బీఐ వాటా 64 పాయింట్లుగా ఉన్నాయి.  

► దాదాపు 400 మేర షేర్లు లోయర్‌ సర్క్యూట్లను తాకాయి. కార్పొరేషన్‌ బ్యాంక్, డీహెచ్‌ఎఫ్‌ఎల్,  ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్,  తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.


రూ.3.30 లక్షల కోట్ల సంపద ఆవిరి
స్టాక్‌ మార్కెట్‌ భారీ నష్టాలతో రూ.3.30 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.3.29 లక్షల కోట్లు తగ్గి రూ.144.3 లక్షల కోట్లకు పడిపోయింది.

Advertisement
Advertisement