ఏసీబీ వలలో అవినీతి తిమింగలం | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో అవినీతి తిమింగలం

Published Tue, Feb 27 2018 1:07 PM

ACB Officials Rides On EE Ravindar rao  - Sakshi

విద్యారణ్యపురి/ వరంగల్‌ క్రైం: ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగలం చిక్కింది. రాష్ట్ర విద్యామౌలిక సదుపాయాల సంస్థ (గతంలో ఎస్‌ఎస్‌ఏ) ఈఈగా పనిచేస్తున్న రవీందర్‌రావు హన్మకొండలోని రూరల్‌ డీఈఓ కార్యాలయంలో తన చాంబర్‌లో ఓ కాంట్రాక్టర్‌ నుంచి రూ.3 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. వరంగల్‌ జోన్‌ ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్‌ తాళ్లపెల్లి సుదర్శన్‌గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సీఎంఏ ఫండ్‌ కింద జిల్లాలోని 25 ప్రభుత్వ పాఠశాలలకు హన్మకొండలోని వన్నాల కన్నా అనే కాంట్రాక్టర్‌ డ్యూయల్‌ డెస్క్‌లు సరఫరా చేశారు. రూ.32 లక్షల బిల్లులో ట్యాక్స్‌లు పోనూ రూ.28 లక్షల బిల్లులు చెల్లించాల్సి ఉంది. రూ.5 లక్షల లంచం ఇస్తేనే బిల్లులకు సంబం«ధించిన చెక్‌ ఇస్తానని ఆ కాంట్రాక్టర్‌ను ఈఈ వేధిస్తుండడంతోపాటు మూడు నెలలుగా తిప్పుకుంటున్నాడు. చివరకు మొదటి విడతలో రూ.3 లక్షలు ఇస్తే రూ.24,94,919 చెక్‌ ఇస్తానని.. మిగతా రెండు పాఠశాలల బిల్లులు మాత్రం రూ.2 లక్షలు ఇచ్చిన తర్వాతే బిల్లు ఇస్తానని ఈఈ చెప్పాడు.

దీంతో కాంట్రాక్టర్‌ వన్నాల కన్నా ఏసీబీని ఆశ్రయించాడు. పథకం ప్రకారం.. సోమవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఈఈ రవీందర్‌ రావుకు అతని చాంబర్‌లో వన్నాలకన్నా రూ.3 లక్షలు ఇవ్వగా.. చెక్‌ ఇచ్చాడు. ఈ సమయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామని సుదర్శన్‌గౌడ్‌ తెలిపారు. ఈఈ రవీందర్‌రావుపై అనేక ఆవినీతి ఆరోపణలు ఉన్నాయని.. వాటన్నింటిపైనా సమగ్ర విచారణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈఈ రవీందర్‌రావు వద్ద ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే సమాచారం  తమ వద్ద కొంత ఉందని, అనేక ఫిర్యాదులు కూడా ఉన్నాయన్నారు. తాజాగా నిర్వహించిన సోదాలో కొందరికి సంబం«ధించిన బిల్లులను ఇవ్వకుండా.. తన వద్దనే అట్టిపెట్టుకున్నట్లు తేలిందన్నారు. వాటన్నింటినీ పరిశీలిస్తామని చెప్పారు. గతంలో పరకాల హౌసింగ్‌ అధికారిగా పనిచేసినప్పుడుకూడా రవీందర్‌రావు సిమెంట్‌ అమ్ముకున్నారనే ఆరోపణలతో  కేసు నమోదైందన్నారు. దాడుల్లో ఏసీబీ అధికారులు బీవీ. సత్యనారాయణ, కరీంనగర్‌ డీఎస్పీ కిరణ్‌కుమార్, సీఐలు సతీష్, వెంకటి, క్రాంతికుమార్, రామలింగారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

ఆఫీస్, ఇంట్లో సోదాలు..
ఈఈ రవీందర్‌రావును వరంగల్‌ రూరల్‌ డీఈఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని కార్యాలయంలో పలు రికార్డులను పరిశీలించారు. వివిధ బిల్లులకు సంబంధించిన ఫైళ్లను రాత్రి 11 గంటల వరకు తనిఖీ చేస్తున్నారు. అదేవిధంగా.. హన్మకొండలోని ఎన్జీవోస్‌ కాలనీ రోడ్డులోని రవీందర్‌రావు ఇంట్లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు.
కరీంనగర్‌ డీఎస్పీ ఆధ్వర్యంలో ఇంట్లో విలువైన పత్రాలు, బ్యాంకు పాస్‌ పుస్తకాలు, ఏటీఎం కార్డులు వివరాలను నమోదు చేసుకున్నారు.మంగళవారంఆస్తులకు సంబంధించిన వివరాలతో పాటు రవీందర్‌రావును కోర్టుకు హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు.

3 నెలలుగా తిప్పుతున్నాడు..
సీఎంఏ ఫండ్‌ కింద పాఠశాలలకు ఫర్నిచర్‌ సరఫరా చేసేందుకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరయ్యాయి. 25 ప్రభుత్వ పాఠశాలల్లో నేను ఫర్నిచర్, డ్యూయల్‌ డెస్క్‌లను సరఫరా చేశాను. రూ.28 లక్షల బిల్లులు పాస్‌చేసి నాకు చెక్‌ ఇవ్వాలి. కానీ.. బిల్లులు పాస్‌ చేసేందుకు రూ.5 లక్షల లంచం డిమాండ్‌ చేశాడు. నేను ఇవ్వకపోయేసరికి అందులో రూ.24,94,919 చెక్‌ను తయరు చేసి.. తొలుత రూ.3 లక్షలు లంచం ఇవ్వాలని.. తర్వాత రూ.2ల క్షలు ఇస్తేనే మిగతా రూ.4 లక్షల బిల్లులు పాస్‌ చేస్తానని మూడు నెలలుగా చెక్‌ను అతడి వద్దనే అట్టిపెట్టుకున్నాడు. పలుసార్లు తిరిగినప్పుటికీ బిల్లు ఇవ్వకపోవడంతో చివరకు ఏసీబీని అశ్రయించాను. – వన్నాల కన్నా, బాధిత కాంట్రాక్టర్‌

Advertisement
Advertisement