ప్రచారం.. రక్తపాతం! | Sakshi
Sakshi News home page

ప్రచారం.. రక్తపాతం!

Published Thu, Jan 17 2019 7:33 AM

Both Sides Attacks Case In Mahabubnagar - Sakshi

నారాయణపేట రూరల్‌:  పాతోకక్షలు రక్తపాతానికి దారి తీశాయి. పండగ వేళ ఎన్నికల ప్రచారం ఈ ఘటనకు కారణమైంది. ఆ వివరాలు.. నారాయణపేట మండలం జాజాపూర్‌ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, రైతు సమన్వయసమితి నాయకుడికి, గ్రామ తాజామాజీ సర్పంచ్‌ వర్గీయులకు చాలా కాలంగా విరోధం ఉంది. గతంలో చాలాసార్లు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుని పోలీస్‌స్టేషన్‌ వరకు వెళ్లారు. ఈ క్రమంలోనే పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. ఇరు వర్గాలకు చెందిన మద్దతుదారులు బరిలో నిలవడంతో గ్రామంలో రాజకీయం వేడెక్కింది.పండుగ పూట కూడా తమ మద్దతుదారులతో గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్నారు.

మంగళవారం సాయంత్రం ఇరువర్గాల వారు 8వ వార్డులో ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఈ క్రమంలోనే ఇరువర్గాల వారు ఒకరికి మరొకరు తారసపడ్డారు. తమకంటే తమకు ఓటువేయాలని గట్టిగా నినాదాలు చేస్తు ముందుకు కదిలారు. ఈ సమయంలోనే గుంపులోని కొందరు రాళ్లు విసరడంతో ఘర్షణ మొదలైంది. రాళ్లతో దాడులకు పాల్పడ్డారు. దీంతో ఓ కారు అద్దాలు పగిలాయి. రాము అనే వ్యక్తి తల పగిలింది. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. నారాయణపేట ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం వారిని మహబూబ్‌నగర్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే గ్రామంలో పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేశారు. ఇరువర్గాల వారిని పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. రాము ఫిర్యాదు మేరకు కోట్ల జగన్మోహన్‌రెడ్డి, వెంకటప్పతో పాటు మరి కొందరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపారు.

Advertisement
Advertisement