నాతో పెట్టుకోకు.. చంపేస్తా! | Sakshi
Sakshi News home page

నాతో పెట్టుకోకు.. చంపేస్తా!

Published Sat, Apr 27 2019 8:11 AM

Chennai Police Arrested Maoist In Cinematic Way - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: చేసేది చెన్నైలో కూలీ పని. అయినా అతడిలోని తీవ్రవాది మాత్రం నిద్రపోలేదు. అజ్ఞాతంలో ఉన్నానన్న సంగతిని మర్చిపోయి ఆవేశం కట్టలు తెంచుకోగా అతడిలోని రాక్షసుడు బైటకువచ్చాడు. ‘నాతో పెట్టుకోకు చంపేస్తా...ఇప్పటికే ఎందరినో హతమార్చా నంటూ బెదిరింపు మాటలే అతడిని పోలీసులకు పట్టించాయి. అసోం రాష్ట్రం మావోయిస్ట్‌ తీవ్రవాద సంస్థలో కీలకమైన వ్యక్తి క్యూ బ్రాంచ్‌ పోలీసులకు చిక్కిపోయాడు. సుందరప్పదాస్‌ అనే తీవ్రవాదిని పట్టుకునేందుకు సినిమా పక్కీలో వలపన్ని శుక్రవారం అరెస్ట్‌ చేశారు. ఈస్టర్‌ పండుగ రోజున శ్రీలంకలో చోటుచేసుకున్న వరుస పేలుళ్లలో 359 మందిని పొట్టనపెట్టుకున్న సంఘటన ప్రపంచం మొత్తాన్ని కలవరపాటుకు గురిచేసింది. తీవ్రవాదుల ఉనికిపై అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. భారత హోంమంత్రిత్వశాఖ సైతం అన్ని రాష్ట్రాలకు ముందస్తు హెచ్చరికలు జారీచేసింది. తమిళనాడులో గతంలోని తీవ్రవాద చర్యల అనుభవం దృష్ట్యా రాష్ట్ర పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. అనుమానిత ప్రాంతాల్లో తీవ్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

గ్రేటర్‌ చెన్నై పోలీసుల సహకారంతో క్యూ బ్రాంచ్‌ పోలీసులు నిషేధిత తీవ్రవాద సంస్థలకు చెందిన వారిని గుర్తించేపనిలో పడ్డారు. అయితే పోలీసులు ఊహించని రీతిలో అసోం తీవ్రవాది తన దుందుడుకు తనంతో పట్టుబడిపోయాడు. చెన్నై అమంజికరై నెల్సన్‌ మాణిక్యం రోడ్డులోని ఒక ప్రయివేటు ఆస్పత్రిలో నిర్మాణ పనులు జరుగుతుండగా నెలరోజుల క్రితం అసోం రాష్ట్రానికి చెందిన సుందరప్పదాస్‌ (26) పనికి చేరాడు. గురువారం నాడు సహ భవన నిర్మాణ కార్మికునితో గొడవకు దిగాడు. తనతో పెట్టుకోవద్దు, ఇప్పటికే ఎంతోమందిని హతమార్చాను, నేను తలుచుకుంటే ఇప్పటికిప్పుడే నిన్ను చంపేయగలను అని బెదిరించాడు. బాధిత కార్మికుడు అదే ఆసుపత్రిలో సెక్యూరిటీ విధులు నిర్వర్తిస్తున్న రిటైర్డు డీఎస్పీ రామదాస్‌కి ఫిర్యాదు చేశాడు. సుందరప్పదాస్‌ను రామదాస్‌ పిలిచి విచారించగా అతడిని కూడా బెదిరింపులకు గురిచేస్తూ తీక్షణంగా మాట్లాడాడు. అతడు అసోం రాష్ట్రానికి చెందిన వాడు కావడంతో తీవ్రవాద సంస్థతో సంబంధాలు ఉండవచ్చని రామదాస్‌ అనుమానించాడు.

వెంటనే యూట్యూబ్‌ ద్వారా అసోం తీవ్రవాద సంస్థల వీడియోలు చూస్తూ ఆరాతీయగా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం శిలిగురి అనేచోట ఆరునెలల క్రితం మావోయిస్ట్‌ తీవ్రవాద సంస్థకు చెందిన ముగ్గురిని ఆ రాష్ట్ర పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ ముగ్గురి ఫొటోలను పరిశీలించగా తమ ఆస్పత్రిలో పనిచేస్తున్న సుందరప్పదాస్‌ ముఖ కవళికలతో కూడిన వ్యక్తి కూడా ఉన్నట్లు గుర్తించాడు. వెంటనే క్యూ బ్రాంచ్‌ పోలీసులకు రహస్య సమాచారం ఇచ్చాడు. క్యూ బ్రాంచ్‌ పోలీసులు సుందరప్పదాస్‌ గురించి సేకరించిన సమాచారంలో అతడు పశ్చిమబెంగాల్‌ను కేంద్రంగా చేసుకుని నడుపుతున్న ఒక తీవ్రవాద సంస్థకు చెందిన కీలకమైన వ్యక్తిగా గుర్తించారు. వెంటనే అమంజికరై పోలీసుల సహకారంతో క్యూ బ్రాంచ్‌ పోలీసులు శుక్రవారం తెల్లవారుజాము 3 గంటలకు అయ్యావుకాలనీలోని సందరప్పదాస్‌ ఇంటిని చుట్టుముట్టి అరెస్ట్‌ చేశారు.

భారీగన్‌ను చేతపుచ్చుకుని ఫొటోకు ఫోజిచ్చిన సుందరప్పదాస్‌ ఫోటో అతడి ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఉల్ఫా తీవ్రవాదిగా పోలీసులు అనుమానిస్తున్న ఇతడు పశ్చిమ బెంగాల్‌లో ఆరునెలల క్రితం అరెస్టయిన తరువాత నెలరోజుల క్రితం బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చి తమిళనాడుకు చేరుకుని చెన్నైలో అజ్ఞాతజీవితం గడుపుతున్నట్లు తెలుసుకున్నారు. తమ తీవ్రవాద సంస్థలోకి యువకులను చేర్చుకునే నిమిత్తం చెన్నైలో నివసిస్తున్నట్లు అతడు అంగీకరించాడు. తమిళనాడుకు చెందిన ఎంతమందిని తన సంస్థలో చేర్చుకున్నాడు, సుందరప్పదాస్‌లా ఇంకా ఎంతమంది తమిళనాడులో సంచరిస్తున్నారు, ప్రయివేటు ఆసుపత్రిలో అతడిని పనికి కుదిర్చిన వ్యక్తి ఎవరు, అమంజికరైలోని సుందరప్పదాస్‌ రూములో అతనితోపాటూ ఇంకా ఎంతమంది నివసిస్తున్నారు అనే కోణంలో క్యూ బ్రాంచ్‌ పోలీసులు విచారిస్తున్నారు.

రాష్ట్రంలో తనిఖీలు:
 శ్రీలంక పేలుళ్ల నేపథ్యంలో రాష్ట్రంలో పలుచోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు. చెన్నై లోని ముఖ్యమైన రైల్వేస్టేషన్‌లలో ‘ఆపరేషన్‌ స్ట్రోమింగ్‌’ పేరున బాంబ్‌ స్క్వాడ్‌ పోలీసులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. బాంబులు పెట్టి ఉన్నట్లు తమకు ఎలాంటి సమాచారం లేదు, భద్రతా చర్యల్లో భాగంగానే తనిఖీలు నిర్వహిస్తున్నామని రైల్వే డీఐజీ బాలకృష్ణన్, ఎస్పీ రోహిత్‌నాథన్‌ రాజగోపాల్‌ మీడియాకు తెలిపారు. ఇలాంటి తనిఖీలు రాష్ట్రంలోని అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లలో సాగుతున్నట్లు చెప్పారు. శ్రీలంక పేలుళ్ల నేపథ్యంలో కోయంబత్తూరుకు చెందిన ఆరుగురిని అనుమానంపై ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

శ్రీలంకలో నేనే బాంబు పెట్టా: చెన్నై కంట్రోల్‌రూంకు ఫోన్‌
ఇదిలా ఉండగా, శ్రీలంకలోని చర్చిల్లో తానే బాంబులను అమర్చానని చెన్నై పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలోని కంట్రోలురూంకు అజ్ఞాతవ్యక్తి శుక్రవారం ఫోన్‌ చేశాడు. శ్రీలంకలోనే కాదు చెన్నై కోయంబేడు మేట్టుకుప్పంలో కూడా బాంబులు పెట్టాను, చేతనైతే కనిపెట్టండి అని సవాల్‌ విసిరి ఫోన్‌ కట్‌ చేశాడు. పోలీస్‌ విచారణలో అతడు చెన్నై ఆళ్వార్‌ తిరునగర్‌కు చెందిన మైకేల్‌ప్రెడి (43)గా తేలింది. అరెస్ట్‌ చేసేందుకు అతడి ఇంటికి వెళ్లగా రెండురోజులుగా ఇంటికి రావడం లేదని, తాగుడుకు బానిసని మైకెల్‌ భార్య నవీన పోలీసులకు తెలిపారు.

Advertisement
Advertisement