వసూళ్ల కేంద్రంగా సీఎంవో! | Sakshi
Sakshi News home page

వసూళ్ల కేంద్రంగా సీఎంవో!

Published Sat, Jul 7 2018 3:27 AM

CMO became as place to the Fraud & Scams - Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పెద్దలు, ఉన్నత వ్యక్తులే యధేచ్ఛగా వసూళ్లకు పాల్పడుతుంటే కిందిస్థాయి సిబ్బంది కూడా అదేబాటలో నడుస్తున్నారు. పెద్దల స్థాయి పెద్దలది, మా స్థాయి మాది అన్నట్టుగా   సీఎం కార్యాలయం సిబ్బంది వసూళ్లపై మాట్లాడుకోవడం విస్మయపరుస్తోంది. రాష్ట్ర పరిపాలనా కేంద్రానికి వేదికైన సీఎం కార్యాలయమే లంచాలు, వసూళ్లకు వేదిక కావడం, దీనిపై చర్యలు తీసుకునే నాథుడే లేకపోవడం అధికార వర్గాలతోపాటు సామాన్యుల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. టీచర్‌ ఉద్యోగాల పేరుతో సీఎం చంద్రబాబు కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి ఒకరు నిరుద్యోగుల నుంచి రూ.కోట్లలో వసూలు చేయడం కలకలం రేపుతోంది. 

పాలనా కేంద్రంలో జోరుగా బేరసారాలు
పాలనకు ఆయువుపట్టుగా ఉండే సీఎంవోలో వసూళ్లు, లంచాలకు సంబంధించి లావాదేవీలు జరుగుతున్నట్టు వెల్లడి కావడం అధికార వర్గాల్లో సంచలనం కలిగిస్తోంది. రాష్ట్రానికి ప్రధాన పరిపాలనా కేంద్రమైన ఇక్కడే ఇలా బేరసారాలు జరగడంపై ఉన్నతాధికార వర్గాలు విస్తుపోతున్నాయి. సీఎంవోలోనే ఇలా ఉంటే ఇక జిల్లా కేంద్రాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో అంచనా వేయవచ్చనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. టీచర్‌ ఉద్యోగాల పేరుతో దాదాపు 73 మందిని మోసగించినట్లు భావిస్తున్నారు.

సీఎంవో ఉద్యోగి కావడంతో విశ్వసించిన బాధితులు
నిత్యం నలుగురైదుగురు ఐఏఎస్‌లు, అదనపు కార్యదర్శులు, డిప్యూటీ సెక్రటరీలు, సహాయ కార్యదర్శులు పనిచేసే ముఖ్యమంత్రి కార్యాలయంలో అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌గా వ్యవహరించిన రాంగోపాల్‌ ఎయిడెడ్‌ స్కూళ్లలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ బాధితుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడ్డాడు. ఒక్కో నిరుద్యోగి నుంచి రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల దాకా వసూలు చేసినట్లు  బాధితుల ఫిర్యాదు మేరకు తెలిసింది. సీఎం కార్యాలయం ఉద్యోగి కావడంతో అభ్యర్థులు పూర్తిగా విశ్వసించి లంచాలు చెల్లించారు. అయితే నెలలు గడుస్తున్నా ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ బాధితులు ఆందోళనకు దిగటంతో  విషయం బయటకు వచ్చింది.

సీఎంకు దగ్గరగా ఉంటారని.. ఏపనైనా ఇట్టే చేస్తారని!
సీఎంవో కార్యాలయం ఉద్యోగి రాంగోపాల్‌(ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం కోశాధికారిగా కూడా వ్యవహరిస్తున్నారు) బాధితుడైన సురేష్‌బాబుకు  ఇబ్రహీంపట్నంకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి రంగనాయకమ్మ ద్వారా పరిచయమయ్యాడు. సీఎంకు దగ్గరగా ఉంటారని, ఏపనైనా ఇట్టే చేసి పెడతారని చెప్పడంతో సురేష్‌బాబుకు గురి కుదిరింది. అలా కుదిరిన పరిచయంతో టీచర్‌ పోస్టు కోసం సురేష్‌బాబు డబ్బులు చెల్లించాడు. మరికొంత మంది నిరుద్యోగులను తీసుకొస్తే వాళ్లకు కూడా ఉద్యోగాలు ఇప్పిస్తానని రాంగోపాల్‌ చెప్పాడు. ఒక్కో ఎయిడెడ్‌ పోస్టుకు రూ.16 లక్షలు చెల్లించేలా బేరం కుదిరింది. తన ఖాతాలో డబ్బులు వేస్తే ఇబ్బందులొస్తాయని రాంగోపాల్‌ చెప్పడంతో దాసరి సురేష్‌ అనే వ్యక్తి ఖాతాలో జమ చేసేలా  ఏర్పాట్లు చేశారు. తొలిదశలో రూ.22 లక్షలు బ్యాంకులో వేశారు. రాంగోపాల్‌ ఆ తర్వాత గుంటూరు కోస్టల్‌ బ్యాంకులోని తన భార్య ఖాతాకు రూ.10 లక్షలు మళ్లించుకున్నట్లు బాధితుడు తుళ్లూరు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. 

అనుమానంతో నిలదీసిన నిరుద్యోగులు
ఓవైపు లావాదేవీలు జరుగుతున్నా ఎవరికీ ఉద్యోగాలు రాకపోవడం, ఆర్నెళ్లకుపైగా గడిచిపోవడంతో బాధితులు రాంగోపాల్‌పై ఒత్తిడి తెచ్చారు. దీంతో తాను ఉన్నతాధికారులకు డబ్బులిచ్చానని, తొందర పెట్టొద్దని చెప్పాడు. అయితే డబ్బులు చెల్లించిన నిరుద్యోగులకు అనుమానం వచ్చి మరింత ఒత్తిడి చేయడంతో విషయం బట్టబయలైంది. డబ్బుల వసూలు వెనుక ఉన్నత స్థాయి వ్యక్తులున్నట్లు  అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

రాంగోపాల్‌కు కీలక నేత అండదండలు...
నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసిన రాంగోపాల్‌  సీఎంఆర్‌ఎఫ్‌ (ముఖ్యమంత్రి సహాయ నిధి) కార్యాలయంలో పనిచేస్తున్న ఓ అధికారికి అత్యంత సన్నిహితుడని చెబుతున్నారు. దీంతోపాటు ఉద్యోగుల సంఘంలో కీలక నేత అండదండలు కూడా పుష్కలంగా ఉన్నాయి. సీఎంవోలో ఓ కీలకౖ∙వ్యక్తితో దగ్గర సంబంధం ఉండటంతో యథేచ్ఛగా వసూళ్లకు పాల్పడినట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు రాంగోపాల్‌కు ట్రావెల్‌ ఏజన్సీలతోపాటు చిట్టీల వ్యాపారం ఉన్నట్లు సమాచారం.

కాగా, బాధితులు కొందరు ఫిర్యాదు చేయడానికి నేరుగా సీఎంవోకి రావడంతో పరువు పోతుందని ఆందోళన చెందిన అధికారులు రాంగోపాల్‌ను సీఎంవో నుంచి జీఏడీకి మార్చారు. తర్వాత అక్కడ నుంచి యువజన సర్వీసులకు మార్చారు.

కేసు నమోదుకు ఆదేశించాం
నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసిన విషయం మా దృష్టికి వచ్చింది. రూ.22 లక్షల వరకూ వసూలు చేసినట్టు మాకు ఫిర్యాదులందాయి. కేసు నమోదు చేయాలని డీఎస్పీని ఆదేశించాం. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను కోరాం.
–నాగులాపల్లి శ్రీకాంత్, సాధారణ పరిపాలనాశాఖ కార్యదర్శి (రాజకీయ)

చావే శరణ్యం
వ్యవసాయం చేసుకునే తనకు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి రంగనాయకమ్మ ద్వారా రాంగోపాల్‌ పరిచయమైనట్లు బాధితుడు వి.సురేష్‌బాబు ఈనెల 2న తుళ్లూరు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఉద్యోగమొస్తుందంటే ఆశపడి తనతోపాటు 73 మంది బాధితులు  డబ్బులు కట్టారని తెలిపాడు. డబ్బు తిరిగి ఇప్పించకుంటే తన కుటుంబానికి చావే శరణ్యమని ఫిర్యాదులో పేర్కొన్నాడు. సీఎంవోలో తనకు తెలిసిన వారున్నారని రాంగోపాల్‌ బెదిరిస్తున్నట్లు  ఆందోళన వ్యక్తం చేశాడు. 

Advertisement
Advertisement