Sakshi News home page

హెచ్చా... ఎఫ్ఫా?

Published Fri, Oct 26 2018 10:21 AM

Conflicts in Plot Registration hyderabad - Sakshi

చైతన్యపురి: చైతన్యపురి పోలీసుస్టేషన్‌ పరిధిలోని హరిపురికాలనీలో ఉన్న ఓ ఖరీదైన స్థలానికి సంబంధించి వివాదం రేగింది. సదరు స్థలం ఉన్న సర్వే నెంబర్‌ ‘హెచ్‌’ అంటూ ఒకరు... కాదు ‘ఎఫ్‌’ అంటూ మరొకరు వాదిస్తున్నారు. చివరకు కొందరు అక్కడ నిర్మాణాలు చేపడుతుండటంతో ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న చైతన్యపురి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే కేసు దర్యాప్తు సక్రమంగా సాగట్లేదంటూ ఫిర్యాదుదారుడు ఆరోపిస్తున్నాడు. నిర్మాణాలు ఆపమని జీహెచ్‌ఎంసీ అధికారులు ఆదేశించినా ఫలితం లేదని తెలిపాడు. పోలీసులు మాత్రం విషయాన్ని రెవెన్యూ విభాగానికి నివేదించామని, వారిచ్చే నివేదిక ఆధారంగా కేసులో తదుపరి చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. గత నెల 21న నమోదైన ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. పోలీసు రిజిస్టర్‌ చేసిన ప్రాథమిక సమాచార నివేదికలోని (ఎఫ్‌ఐఆర్‌) అంశాల ప్రకారం... వారాసిగూడ ప్రాంతానికి చెందిన వ్యాపారి వీపీ శ్రీనివాస్‌కు చైతన్యపురి పరిధిలోని హరిపురికాలనీలోని సర్వే నెం.9/1/హెచ్‌లో 15 ఎకరాల స్థలం ఉంది. దీనికి సంబంధించిన యూనిక్‌ బిల్డర్స్‌తో పాటు మరో రెండు కో–ఆపరేటివ్‌ సొసైటీలతో వీరికి వివాదం ఏర్పడింది.

సదరు స్థలం సర్వే నెం.9/1/ఎఫ్‌కు సంబంధించినది అంటూ కొందరు ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నరన్నది ఫిర్యాదుదారుడి ఆరోపణ. దీనికి సంబంధించి కోర్టులో వివాదం నడుస్తోంది. మరోపక్క  ఈ వివాదం తేలకుండానే కొందరు తన (సర్వే నెం. ‘హెచ్‌’) స్థలంలోకి ప్రవేశించి అక్రమంగా బోర్‌ వేస్తున్నారంటూ గత నెల 21న చైతన్యపురి పోలీసులకు శ్రీనివాస్‌ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితులపై ఐపీసీలోని 447, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తాముజీహెచ్‌ఎంసీకి సైతం ఫిర్యాదు చేశామని, ఈ నేపథ్యంలోనే సదరు నిర్మాణానికి ఇచ్చిన అనుమతిని వారు తాత్కాలిక రద్దు చేశారని ఫిర్యాదుదారుడు చెబుతున్నాడు. ఈ విషయం పోలీసులకు తెలిపినా వారి నుంచి సరైన స్పందన లేదని, కేసు దర్యాప్తు సైతం సక్రమంగా సాగట్లేదని ఆరోపిస్తున్నారు. దీనిపై చైతన్యపురి ఎస్సై  సాయి ప్రకాష్‌ను వివరణ కోరగా... ‘ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. ఈ స్థలం ఎవరికి చెందిందని అనే విషయం తేల్చాల్సిందిగా రెవెన్యూ అధికారులను కోరాం. వారిచ్చిన నివేదిక ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటాం’ అన్నారు. 

Advertisement

What’s your opinion

Advertisement