స్కీములు.. స్కాములు! | Sakshi
Sakshi News home page

స్కీములు.. స్కాములు!

Published Wed, Jul 25 2018 12:17 PM

Fake Lottery Schemes In Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఎలాంటి అనుమతులు లేకుండా స్కీమ్‌లు నిర్వహిస్తూ నిషేధిత లాటరీ దందాకు పాల్పడటంతో పాటు అనేక మందిని మోసం చేస్తున్న ఇద్దరు నిందితులను పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వీరిద్దరూ ఒకే ప్రాంతంలో, ఒకే భవనంలో దందా చేస్తున్నారని డీసీపీ రాధాకిషన్‌రావు తెలిపారు. నిందితుల నుంచి రూ.1.91 లక్షల నగదు తదితరాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. కార్వాన్‌కు చెందిన మహ్మద్‌ అబేద్, మహ్మద్‌ షకీర్‌ టప్పాచబుత్రలోని ఎస్‌ఏ ప్లాజాలో ఆరిమ్‌ ఎంటర్‌ప్రైజెస్, న్యూ యువÆ్టŠ‡ నీడ్స్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పేర్లతో దుకాణాలు నిర్వహిస్తున్నారు. వివిధ రకాల స్కీములు నిర్వహిస్తున్న వీరిద్దరూ నిషేధిత లాటరీ దందా నడుపుతున్నారు. ఒక్కో స్కీమ్‌లో సభ్యులుగా ఉండే 3 వేల మంది 16 నెలల పాటు నెలకు రూ.వెయ్యి చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి నెల 5, 18 తేదీల్లో డ్రాలు తీస్తుంటారు.

అబేద్‌ మొదటి బహుమతి కింద బుల్లెట్, రెండో బహుమతిగా మూడు తులాల బంగారం, మూడో బహుమతి కింద బైక్‌... షకీర్‌ కారు, బైక్‌ తదితరాలను ప్రకటించారు. ఇలా ప్రతి నెలా సభ్యుల నుంచి దాదాపు రూ.30 లక్షల వరకు వసూలు చేస్తున్న వీరు గరిష్టంగా రూ.15 లక్షల విలువైన బహుమతులే ఇస్తున్నారు. ఇలా మొదటి నెల మినహా మిగిలిన 15 నెలల్లో నెలకు 10 మంది చొప్పున మొత్తం 150 మందికే ఈ  బహుమతులు ఇస్తున్నారు. మిగిలిన 2850 మందికీ లాటరీ రాని కారణంగా వారు చెల్లించిన రూ.16 వేలకు బదులుగా గరిష్టంగా రూ.10 వేల విలువైన టీవీలు, మిక్సీలు, వాషింగ్‌ మిషన్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. వీరి అక్రమ దందాపై సమాచారం అందుకున్న పశ్చిమ మండ ల టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.గట్టుమల్లు నేతృత్వంలో ఎస్సైలు పి.మల్లికార్జున్, ఎం.ప్రభాకర్‌రెడ్డి, ఎల్‌.భాస్కర్‌రెడ్డి ఏకకాలంలో దాడి చేసి మంగళవారం ఇరువురినీ అరెస్టు చేశారు. తదుపరి చర్యల నిమిత్తం కేసులను టప్పాచబుత్ర పోలీసులకు అప్పగించారు.

Advertisement
Advertisement