నకిలీ పోలీసుల ముసుగులో దోపిడీలు | Sakshi
Sakshi News home page

నకిలీ పోలీసుల ముసుగులో దోపిడీలు

Published Sat, Mar 24 2018 10:45 AM

Fake Police Gang Arrest - Sakshi

నెల్లూరు(క్రైమ్‌): నకిలీ పోలీసుల ముసుగులో దోపిడీలకు పాల్పడుతూ పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న ఓ ముఠాను శుక్రవారం సీసీఎస్, నాలుగో నగర పోలీసులు అరెస్ట్‌ చేశారు. నెల్లూరులోని సీసీఎస్‌ పోలీసు స్టేషన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో సీసీఎస్‌ డీఎస్పీ ఎం.బాలసుందరరావు వివరాలను వెల్లడించారు. ఈనెల 17వ తేదీన మాగుంటలేఅవుట్‌ ఎస్‌ఆర్‌కే స్కూల్‌ సమీపంలో ఓ మహిళను గుర్తుతెలియని నలుగురు దుండగులు పోలీసులమని బెదిరించి రూ.3 లక్షలను దోచుకుని పరారయ్యారు. బాధిత మహిళ నాలుగోనగర పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదుచేశారు. సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌కే బాజీజాన్‌సైదా, నాలుగోనగర ఇన్‌స్పెక్టర్‌ వి.సుధాకర్‌రెడ్డిల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టింది.

శుక్రవారం మినీబైపాస్‌రోడ్డులోని పీవీఆర్‌ కల్యాణమంటపం సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న టీపీగూడూరు మండలం ఈదూరు గ్రామానికి చెందిన గుండాల వంశీకృష్ణారెడ్డి, కోటమండలం కొండగుంట గ్రామానికి చెందిన మాలేపాటి హర్షవర్ధన్‌ అలియాస్‌ హర్ష, నెల్లూరు రూరల్‌ మండలం పెనుబర్తి గ్రామానికి చెందిన చల్లా గోవర్ధన్‌ అలియాస్‌ జగ్గు, నెల్లూరు కిసాన్‌నగర్‌కు చెందిన గుండాల మహేంద్రరెడ్డిలను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. వారిని తమదైన శైలిలో విచారించగా ఎస్‌ఆర్‌కే స్కూల్‌ సమీపంలో దోపిడీకి పాల్పడింది తామేనని వెల్లడించారు. దీంతో వారిని అరెస్ట్‌చేసి వారి వద్ద నుంచి రూ.3 లక్షల నగదు, దోపిడీకి ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు.    

పలు కేసుల్లో ముద్దాయిలు  
నిందితులందరూ స్నేహితులు. జల్సాలకు అలవాటుపడి నకిలీ పోలీసుల అవతారమెత్తారు. వంశీకృష్ణారెడ్డిపై నాయుడుపేట, నెల్లూరు నగరంలోని 3, 4 పోలీసు స్టేషన్‌లు, టీపీగూడూరు ప్రాంతాల్లో చీటింగ్‌ కేసులున్నాయి. బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో రేప్‌ కేసులో నిందితుడు. హర్షవర్ధన్‌పై తెలంగాణ రాష్ట్రంలో పలు చీటింగ్‌ కేసులున్నాయి. గోవర్ధన్‌పై ముత్తుకూరు పోలీసు స్టేషన్, నెల్లూరు రూరల్‌ పోలీసు స్టేషన్లలో దాడి కేసులున్నాయి. మహేంద్రరెడ్డిపై హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ స్టేషన్‌ పరిధిలో రేప్‌ కేసు ఉంది. ముఠాను అరెస్ట్‌ చేసేందుకు కృషిచేసిన సీసీఎస్, నాలుగో నగర ఇన్‌స్పెక్టర్‌లు బాజీజాన్‌సైదా, వి.సుధాకర్‌రెడ్డి, సీసీఎస్‌ ఎస్సై మురళీ, హెడ్‌కానిస్టేబుల్స్‌ ఆర్‌.సురేష్‌కుమార్, వై.వెంకటేశ్వర్లు, శ్రీహరి, పోలయ్య, కానిస్టేబుల్స్‌ రాజేష్, హరీష్‌రెడ్డి, ప్రభాకర్‌లను డీఎస్పీ అభినందించారు.

Advertisement
Advertisement