మరణ మృదంగం | Sakshi
Sakshi News home page

మరణ మృదంగం

Published Mon, Jan 15 2018 12:43 PM

five members dead in road accident - Sakshi

నెల్లూరులోని జాతీయ రహదారి రక్తసిక్తమైంది. ఎన్టీఆర్‌ నగర్, ప్రశాంతి నగర్‌ సమీపంలో ఆదివారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. పొగమంచు కారణంగా ముందు వెళుతున్న వాహనాలు కనిపించకపోవడంతో ఈ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. దీంతో బాధిత కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.   

దైవ దర్శనానికి వెళుతూ ముగ్గురు..   
తోటపల్లిగూడూరు మండలం వెంకన్నపాలెంకు చెందిన ముత్యాల మల్లికార్జున, నరసమ్మ (వైఎస్సార్‌ సీపీ నేత, వెంకన్నపాలెం పంచాయతీ సర్పంచ్‌)లు దంపతులు. వారు తమ కుటుంబసభ్యులు, బంధువులతో కలిసి ఆదివారం తెల్లవారుజామున రెండు కార్లలో దైవదర్శనం నిమిత్తం తమిళనాడు రాష్ట్రంలోని నాగపట్నంకు బయలుదేరారు. ఇన్నోవాకు డ్రైవర్‌గా నెల్లూరు నగరం వెంగళరావునగర్‌కు చెందిన జాఫర్‌ (35) వ్యవహరించగా, అతని పక్కన మల్లికార్జున (50) కూర్చున్నాడు. వెనుక సీట్లో ఇరుగుపొరుగు వారైన పామంజి మంజులమ్మ (43), నరసమ్మ (40), ముత్యాల అనిల్‌ కుర్చున్నారు. ఆ వెనుక సీట్లలో పామంజి పోలమ్మ, ముత్యాల ప్రేమ్‌సాగర్‌ (14) ఉన్నారు. మరో కారులో ఏడుగురు ఉన్నారు. వారు బయలుదేరే సమయానికి పొగమంచు దట్టంగా కమ్ముకుని ఉంది. దీంతో జాఫర్‌ ఇన్నోవాను నెమ్మదిగా నడపసాగాడు. ఉదయం 7.15 గంటల సమయంలో కార్లు ఎన్టీఆర్‌ నగర్‌ హైవే పైకి చేరుకున్నాయి.

ఈ క్రమంలో జాఫర్‌ వేగాన్ని పెంచాడు. వారికి ముందు రెండు లారీలు, ఓ కంటైనర్‌ వెళుతున్నాయి. కంటైనర్‌ పొగమంచు కారణంగా వేగాన్ని తగ్గించడంతో వెనుక వెళుతున్న సిమెంట్‌ లారీ దానిని ఢీకొంది. దీంతో లారీ ముందుభాగం పాక్షికంగా దెబ్బతినగా రెండు లారీలు రోడ్డుపై ఆగిపోయాయి. వెనుక వస్తున్న బర్రెల లోడ్‌ లారీ డ్రైవర్‌ ఈవిషయాన్ని గుర్తించి సడన్‌బ్రేక్‌ వేశాడు. ఈ విషయాన్ని గమనించని జాఫర్‌ వేగంతో లారీని ఢీకొట్టాడు. కారు సగ భాగంపైగా లారీ కిందకు దూసుకెళ్లింది. దీంతో డ్రైవర్‌ జాఫర్, సర్పంచ్‌ నరసమ్మ, మంజులమ్మలు అక్కడికక్కడే మృతిచెందారు. మల్లికార్జున, అనిల్, పోలమ్మలకు తీవ్రగాయాలయ్యాయి. ప్రేమ్‌సాగర్‌ సురక్షితంగా బయటపడ్డాడు. వెనుక కారులో వస్తున్న వారు ప్రమాదాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. 

గంట పాటు శ్రమించి
కారు లారీ కిందకు వెళ్లిపోవడంతో మృతులు, క్షతగాత్రులు ఇరుక్కుపోయారు. నగర ట్రాఫిక్‌ డీఎస్పీ మల్లికార్జున, ఇన్‌స్పెక్టర్‌ వెంకటరావులు తమ సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను వెలికి తీసేందుకు ప్రయత్నించారు. డ్రైవర్‌ జాఫర్‌ మృతదేహాన్ని బయటకు తీసేందుకు కష్టంగా ఉండటంతో క్రేన్‌ సాయంతో కారును వెనక్కు తీశారు. అనంతరం డోర్‌ను కోసి మృతదేహాన్ని బయటకు తీశారు. స్థానికుల సాయంతో సుమారు గంట పాటు శ్రమించి క్షతగాత్రులను బయటకు తీశారు. దీంతో ఆ ప్రాంతమంతా రెండు గంటల పాటు ట్రాఫిక్‌ స్తంభించి సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. మల్లికార్జున పరిస్థితి విషమంగా ఉండటంతో చెన్నైకు తీసుకెళ్లారు. మృతుల కుటుంబసభ్యులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంటినుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ప్రమాదం జరగడంతో వారు బోరున విలపించారు. 

కాకాణి గోవర్ధన్‌రెడ్డి పరామర్శ  
ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న వైఎస్సార్‌ సీపీ నెల్లూరు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సింహపురి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి వారి కుటుంబసభ్యులతో మాట్లాడారు. అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి జీజీహెచ్‌కు చేరుకుని దగ్గరుండి మృతదేహాలకు శవపరీక్షలు చేయించి బాధిత కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతుల కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ జి.వెంకట్రావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.   

Advertisement
Advertisement