నెత్తురోడిన రోడ్లు | Sakshi
Sakshi News home page

నెత్తురోడిన రోడ్లు

Published Tue, Jan 29 2019 7:15 AM

Four Died in Visakhapatnam Road Accident - Sakshi

విధి కర్కశంగా కాటేయడంతో వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం పాలయ్యారు. విధులు ముగించుకుని నగరంలోని ఐఎన్‌ఎస్‌ డేగా సమీపాన మారుతి సర్కిల్‌ వద్ద రోడ్డు దాటుతున్న యువకుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. అక్కయ్యపాలెంలో రోడ్డుపై నడుచుకుని వెళ్తున్న శ్రీకాకుళం జిల్లా వాసిని టిప్పర్‌ ఢీకొనడంతో ఘటనా స్థలంలోనే తనువు చాలించాడు. అదేవిధంగా నర్సీపట్నంలో బ్రాండిక్స్‌ బస్సు ఢీకొని  ఓ కానిస్టేబుల్‌ మృతి చెందగా, చోడవరంలో బస్సు కింద పడి ఓ మిల్లు ఆపరేటర్‌ దుర్మరణం చెందాడు. తీవ్ర విషాదాన్ని నింపిన ఈ దుర్ఘటనలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

సీతమ్మధార(విశాఖ ఉత్తర): నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధి  అక్కయ్యపాలెంలో టిప్పర్‌ ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీకాకుళం జిల్లా, సోంపేట మండలం కర్తనవానిపాలెంకు చెందిన భద్రచలం మణి ప్రసాద్‌ టైలరింగ్‌ వర్కు చేస్తుంటాడు. సోమవారం రోడ్డుపై నడుచుకొని వెళ్తుండగా టిప్పర్‌ ఢీకొట్టి మణిప్రసాద్‌ పైనుంచి వెళ్లిపోవడంతో తల నుజ్జయి అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. అతని బంధువులకు సమచారం అందించారు. అనంతరం పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. ఏఎస్‌ఐ లక్ష్మణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గుర్తు తెలియని వాహనం ఢీకొని...
మల్కాపురం(విశాఖ పశ్చిమ): రోడ్డు దాటుతున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఒడిశా ప్రాంతానికి చెందిన ఎస్‌.బలరామ్‌(32) ఎం.వి.ఆర్‌ కనస్ట్రక్షన్‌(రోడ్లు పనులు జరిపే సంస్థ)లో పని చేస్తున్నాడు. సోమవారం విధులు ముగించుకుని ఐఎన్‌ఎస్‌ డేగా సమీపాన మారుతి సర్కిల్‌ వద్ద రోడ్డు దాటుతున్నాడు. ఆ సమయంలో మారుతి సర్కిల్‌ నుంచి షీలానగర్‌ వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం బలరామ్‌ను బలంగా ఢీకొట్టిందని పాదచారులు చెబుతున్నారు. వాహనం ఢీకొట్టడంతో కొంతదూరం వెళ్లి పడిన బలరామ్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన చూసిన పాదచారులు వెంటనే మల్కాపురం పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి వివరాలు సేకరించారు. మృతుని వద్ద ఉన్న ఐడీ కార్డు ఆధారంగా బంధువులకు సమాచారం అందించారు. వారు వచ్చిన తరువాత మృతునికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. సీఐ లంక భాస్కర్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

బస్సు చక్రాల కింద పడి...
చోడవరం టౌన్‌: చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కశింకోటకు చెందిన తోకల శ్రీనివాసరావు(48) స్థానిక పూర్ణాథియేటర్‌ సమీపంలో ఉన్న ఎం.రాజినాయుడు పిండిమిల్లులో ఆపరేటర్‌గా చేస్తున్నాడు.  సోమవారం ఉదయం శ్రీనివాసరావు చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద రోడ్డు డివైడర్‌ను తన్నుకొని  అనకాపల్లి నుంచి చోడవరం వస్తున్న ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు వెనక చక్రం కింద పడిపోయాడు. దీంతో అతని తల నుజ్జు అయ్యింది. పోలీసులు సంఘటనా స్థ లానికి చేరుకొని ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. పంచనామా నిర్వహించి, మృతిదేహాన్ని చోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాసరావు భార్య నూకరత్నం చోడవరం వచ్చి మృతదేహాన్ని గుర్తించారు. కేసు నమోదు చేసి ఆర్టీసీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్టు ఎస్‌ఐ పి.మల్లేశ్వరరావు తెలిపారు. పోస్టుమార్టం నిర్వహించి, మృతి దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. శ్రీనివాసరావుకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

బస్సు ఢీకొని కానిస్టేబుల్‌ దుర్మరణం
నర్సీపట్నం: రోడ్డు ప్రమాదంలో ఓ కానిస్టేబుల్‌ మృతి చెందాడు. పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. నర్సీపట్నానికి చెందిన అ«ధికారి బంగార్రాజు గొలుగొండ మండలం కృష్ణాదేవిపేట పోలీసు స్టేషన్‌లో కానిబుస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం అర్థరాత్రి   తన ద్విచక్రవాహనంపై జోగునాథుపాలెం వెళ్లి తిరిగి వస్తుండగా, పెదబొడ్డేపల్లి భూషణ ఐటీఐకు సమీపంలో ద్విచక్రవాహనం మొరా యించింది. బంగార్రాజు వాహనం కిక్కు కొడుతున్నాడు. అదే సమయంలో  కార్మికులను తీసుకుని అతివేగంగా వస్తున్న బ్రాండెక్స్‌ బస్సు రోడ్డు పక్కన ఉన్న బంగార్రాజును బలంగా ఢీకొంది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి   భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.   బంగార్రాజు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బంగార్రాజు మృతదేహానికి పోలీసు లాంఛనాలతో నర్సీపట్నం శ్మశాన వాటికలో సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement