శివారెడ్డి హత్య కేసులో... | Sakshi
Sakshi News home page

శివారెడ్డి హత్య కేసులో...

Published Fri, Apr 6 2018 10:35 AM

Four Members Arrest In Shivareddy Murder Case - Sakshi

ఎస్కేయూ: కందుకూరు గ్రామానికి చెందిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త డి. శివా రెడ్డి హత్యకేసులోని నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటుకలపల్లి పోలీసు స్టేషన్‌లో గురువారం కేసు పూర్వపరాలు, నిందితులకు సంబంధించిన వివరాలను  అనంతపురం డీఎస్పీ  వెంకట్రావు  వెల్లడించారు. ఐదు రోజుల కిందట కందుకూరు గ్రామానికి చెందిన డి. శివారెడ్డిని హత్య చేసిన నిందితులను అదుపులోకి తీసుకున్నాం.. ఇందులో మొత్తం 11 మంది నిందితులు ఉన్నారు. వై. బాలకృష్ణ అలియాస్‌ బాల హత్యలో ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. బాలకృష్ణ తమ్ముళ్లు ఒకే కుటుంబానికి చెందిన ఆరు మందితో పాటు మరో 5 మంది నిందితులుగా ఉన్నారు. వీరిలో ఏ–1 నిందితుడు వై. బాలకృష్ణ, ఏ–4 నిందితుడు వై. అశోక్, ఏ–9 నిందితుడు తలుపూరి మహేంద్ర, మరో మైనర్‌ నిందితుడిని అదుపులోకి తీసుకున్నాము.

హత్య అనంతరం బాలకృష్ణ చిత్తూరు జిల్లా మొలకలచెరువులోని దేవల చెరువు తాండాలో  వసతి కల్పించిన వ్యక్తిపైన కేసు నమోదు చేశాము. రేణిగుంటకు చెందిన సురేష్‌ అనే వ్యక్తికి రూ.5 వేలు డబ్బులు తీసుకుని హత్యలో పాల్గొన్నాడు. గత ఏడాది కందుకూరులో మొహరం పండుగ రోజు నీటి సరఫరా విషయంలో చిన్న గొడవ జరిగింది. తరువాత ఇరువర్గాల వారు కేసులు పెట్టుకుని కోర్టులో రాజీ అయ్యారు.  రాజీ అయినప్పటికీ శివారెడ్డిపై బాలకృష్ణ కక్ష పెట్టుకున్నాడు.  శివారెడ్డిపై బాలకృష్ణ , అతని తమ్ముళ్లు , బంధువులతో కుట్ర పన్ని పథకం ప్రకారం బోయ భీముడు పొలం వద్ద బైక్‌పై వెళ్తుండగా హతమార్చారు. బాలకృష్ణ, రమేష్‌లపై గతంలో రౌడీషీట్లు నమోదయ్యాయి. బీకేఎస్‌ మండలం పసలూరు గ్రామంలో తలారి పోతులయ్య పొలం వద్ద నిందితులను అరెస్ట్‌ చేశాము. నేరానికి ఉపయోగించిన వేట కొడవళ్లు, ఒక మోటార్‌ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నాం. శివారెడ్డి హత్యకు కొందరి ప్రోద్బలం ఉందని, హతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు.

Advertisement
Advertisement