అంతరాష్ట్ర దొంగలు అరెస్ట్ | Sakshi
Sakshi News home page

అంతరాష్ట్ర దొంగలు అరెస్ట్

Published Wed, Dec 13 2017 3:54 PM

interstat thieves arrest

అనంతపురం: తాళం వేసిన ఇళ్ళలో దొంగతనాలకు పాల్పడే అంతరాష్ట్ర దొంగలను అనంతపురం టూటౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు. టూటౌన్‌ సీఐ ఆరోహణరావు, ఎస్‌ఐ శివగంగాధర్‌రెడ్డిలతో కలిసి డీఎస్పీ వెంకట్రావ్‌ బుధవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. కర్నూలు జిల్లా డోన్‌ పట్టణంలోని తారకరామారావునగర్‌కు చెందిన ఆవుల గిడ్డయ్య, డోన్‌ ఆర్టీసీ బస్టాండ్‌ వెనుక శ్రీనివాసనగర్‌కు చెందిన ఎరుకుల ముంగాశంకర్‌ దొంగతనాలను వృత్తిగా పెట్టుకున్నారు. జల్సాలకు బానిసై డబ్బు కోసం దొంగతనాలు చేస్తున్నారు. ఇటీవల నగరంలో గణేష్‌నగర్, నాయక్‌నగర్, సాయినగర్, విద్యుత్‌నగర్‌ తదితర కాలనీల్లో తాళం వేసిన ఇళ్ళలో దొంగతనాలకు పాల్పడ్డారు. గతంలో వీరిపై 2011లో కళ్యాణదుర్గం, కంబదూరు పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో, 2016లో కదిరి టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. ఇటీవల నగరంలో తరచూ దొంగతనాలు జరుగుతుండడంతో డీఎస్పీ వెంకట్రావ్‌ ఆదేశాల మేరకు టూటౌన్‌ పోలీసులు నిఘా ఉంచారు. బుధవారం ఉదయం కళ్యాణదుర్గం రోడ్డులోని పెద్దమ్మ గుడి వద్ద నిందితులు ఉన్నట్లు సమాచారం అందుకున్న సీఐ ఆరోహణరావు, ఎస్‌ఐ శివగంగాధర్‌రెడ్డిలు సిబ్బందితో వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.5.40 లక్షల విలువైన బంగారు నెక్లెస్‌లు, గాజులు, చైన్‌లు, ఉంగరాలు తదితర బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. 
  

Advertisement
Advertisement