Sakshi News home page

పెళ్లి పేరుతో మోసగాడి ఆటకట్టు

Published Tue, Jun 18 2019 1:31 PM

Man Arrested Matrimonial Fraud Wanaparthy - Sakshi

సాక్షి, వనపర్తి : విలాసాలకు అలవాటుపడిన ఓ వ్యక్తి.. తన భార్యకు విడాకులిచ్చానంటూ మ్యాట్రిమోని వెబ్‌సైట్‌లో ఫొటో అప్‌లోడ్‌ చేసి విడాకులు తీసుకున్న అమ్మాయిలను టార్గెట్‌ చేసుకొని మోసం చేయడానికి పూనుకున్నాడు. గత 8 నెలల క్రితం వనపర్తికి చెందిన ఓ అమ్మాయిని మ్యాట్రిమోనిలో పరిచయం చేసుకొని మోసం చేస్తున్న చంద్రశేఖర్‌ను వనపర్తి పోలీసులు పట్టుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను సోమవారం సాయంత్రం సీఐ సూర్యనాయక్‌ విలేకరులకు వెల్లడించారు.

పెద్దపల్లి జిల్లా రామగూడెం పాతకాలనీకి చెందిన చంద్రశేఖర్‌ అలియాస్‌ చందుకు 2007లో వివాహం జరిగింది. అతడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే పేకాట.. ఇతర జల్సాలకు అలవాటుపడిన అతను భార్యను పుట్టింటికి పంపాడు. తన భార్యకు విడాకులు ఇచ్చానని.. మ్యాట్రిమోని వెబ్‌సైట్లో ప్రొఫైల్‌ క్రియేట్‌ చేశాడు. వనపర్తికి చెందిన ఓ మహిళ తన భర్తకు విడాకులిచ్చింది. తను కూడా మ్యాట్రిమోనిలో అప్‌లోడ్‌ చేసింది. వెబ్‌సైట్‌ ద్వారా ఆమెను పరిచయం చేసుకున్న చంద్రశేఖర్‌ సామ్‌సాంగ్‌ కంపెనీలో సేల్స్‌ మేనేజర్‌గా పనిచేస్తానంటూ నమ్మబలికాడు. ఒక స్కీంలో ఇన్వెస్ట్‌మెంట చేస్తే తనకు ఎక్కువ లాభాలు వస్తాయని, ఈక్రమంలో డబ్బులు అవసరం ఉందని చెప్పి ఆమె ద్వారా రూ.9.70 లక్షలు తన ఖాతాలో వేయించుకున్నాడు.

వాటితో ఓ బైక్, సెల్‌ఫోన్‌ కొనుగోలు చేశాడు. అంతటితో ఊరుకోక ఆమె మెడలో ఉన్న బంగారు చైన్‌ కావాలంటూ తీసుకున్నాడు. చివరకు మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు ఈ నెల 14న పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో అతనిపై నిఘా పెట్టారు. మహిళ చంద్రశేఖర్‌కు ఫోన్‌ చేసి వనపర్తికి పిలిచింది. వనపర్తికి వచ్చిన అతన్ని స్థానిక రాజీవ్‌ చౌరస్తాలో పట్టుకున్నట్లు సీఐ తెలిపారు. అతను పేకాటకు అలవాటు పడి డబ్బుల కోసం మహిళలను మోసం చేస్తూ డబ్బులు వసూలు చేసేవాడని వెల్లడించారు. గతంలో రాజమండ్రిలో ఓ అమ్మాయి వద్ద రూ.70 వేలు, మధ్యప్రదేశ్‌లో ఓ అమ్మాయి వద్ద రూ.80 వేలు డబ్బులు ఖాతాలో వేయించుకొని మోసం చేశాడన్నారు.

పేకాటకు అలవాటుపడి ఆర్థిక ఇబ్బందులతో విడాకులు తీసుకున్న అమ్మాయిలను ఎంచుకున్నానని నిందితుడు ఒప్పుకున్నాడని తెలిపారు. ఇతను పేకాట ఆడేందుకు గోవా, రాయిచూర్‌ వెళ్లేవాడన్నారు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. కేసును ఛేదించిన వారిలో రేవల్లి ఎస్‌ఐ వెంకటేష్‌గౌడ్, ట్రెయినీ ఎస్‌ఐ ఉమ, కానిస్టేబుల్‌ రాజగౌడ్‌ తదితరులున్నారు.  

Advertisement

What’s your opinion

Advertisement