అనుమానాస్పదరీతిలో వివాహిత మృతి | Sakshi
Sakshi News home page

అనుమానాస్పదరీతిలో వివాహిత మృతి

Published Wed, Jan 17 2018 8:26 AM

married woman suspicious death - Sakshi

చిట్టినగర్‌(విజయవాడపశ్చిమం):అనుమానాస్పదరీతిలో వివాహిత మృతి చెందిన ఘటన కొత్తపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పంజా సెంటర్‌లో సోమవారం చోటుచే సుకుంది. భర్తే చంపి ఆత్మహత్యగా చిత్రీకరించాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. పోలీసుల కథనం ప్రకారం కలరా హాస్పటల్‌ సమీపంలోని అల్లినగర్‌కు చెందిన ఖమరున్‌ (27) పదేళ్ల కిందట బీహార్‌కు చెందిన నసీమ్‌ హైదర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి ఇద్దరు సంతానం ఉన్నారు. బ్యాగులు కుట్టుకునే నసీమ్‌ హైదర్‌ కొంత కాలంగా భార్యను వేధింపులకు గురి చేస్తున్నాడు.

శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నాడు. రెండు రోజుల కిందట ఖమరున్‌ తన తల్లి సలీమన్‌తో భర్త పెడుతున్న చిత్రహింసల గురించి చెప్పుకుని బాధపడింది. సోమవారం సాయంత్రం 7 గంటల సమయంలో తన భార్య ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందంటూ హైదర్‌ స్థానికులతో పేర్కొనడమే కాకుండా నేరుగా వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు.  విషయం తెలుసుకుని  ఇంటికి వచ్చిన ఖమరున్‌ తల్లి  సలీమన్‌ ఉరికి వేలాడుతున్న బిడ్డను చూసి కన్నీటిపర్యంతం అయింది. ఖమరున్‌ వంటిపై గాయాలు ఉండటం, రెండు రోజుల  కిందట తన కూతురు చెప్పుకున్న బాధను గుర్తు చేసుకుని అల్లుడే తన బిడ్డను చంపి ఉరి వేసి ఉంటాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఘటనపై సమాచారం అందుకున్న కొత్తపేట  పోలీసులు మృతదేహాన్ని  ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

అండగా వైఎస్సార్‌ సీపీ.....
బాధితురాలి కుటుంబానికి తగిన న్యాయం జరిగేలా చూడాలని వైఎస్సార్‌ సీపీ నగర అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి షేక్‌.ఆసీఫ్‌ డిమాండ్‌ చేశారు.  పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఇంటి వద్దకు తీసుకురావడంతో వైఎస్సార్‌ సీపీ నేతలతో పాటు టీడీపీ నేతలు, స్థానిక పెద్దలు ఘటనా స్థలానికి చేరుకుని జరిగిన విషయం గురించి ఆరా తీశారు. బీహార్‌ ప్రాంతం నుంచి విచ్చేసిన కొంత మంది స్థానికంగా ఉన్న మైనార్టీ  కుటుంబాల వారి ఆర్థిక పరిస్థితిని ఆసరాగా చేసుకొని  పెళ్లిళ్లు చేసుకోవడం, కొంత కాలం తర్వాత చిత్ర హింసలకు గురి చేయడం పరిపాటిగా మారిందని స్థానికులు పేర్కొన్నారు. తల్లి మరణంతో అనాథలైన చిన్నారులకు నష్ట పరిహారం వచ్చేలా  చూడాలని పోలీసులను కోరారు.  ప్రభుత్వం నుంచి సాయం అందేలా చూడాలని స్థానిక   టీడీపీ నేతలకు సూచించారు. మృతురాలి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

Advertisement
Advertisement