వివాహేతర సంబంధం అంటగట్టారని.. | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం అంటగట్టారని..

Published Thu, Mar 15 2018 12:35 PM

Married Womens Commit to Suicide - Sakshi

అర్వపల్లి(తుంగతుర్తి) :   ఓ వ్యక్తి తమపై వివాహేతర సంబంధం అంటగట్టాడని మనస్తాపానికి గురై ఇద్దరు మహిళలు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాదకర ఘటన సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం కుంచమర్తి గ్రామపంచాయతీ ఆవాసం ఉయ్యాలవాడ గ్రామ శివారు బుడగజంగాల కాలనీలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... బుడగజంగాల కాలనీకి చెందిన తిరుపాటి గట్టమ్మ(26), భూతం సరోజ (25)లు ఇద్దరు వరుసకు వదినా మరదళ్లు. వీరిద్దరి కుటుంబాలు జంగిడిబర్లు కాసుకుంటూ జీవనం సాగిస్తున్నాయి

బహిర్భూమికని వెళ్లి..
పెద్ద మనుషుల సమక్షంలో నిందారోపణలు, భర్తల నిలదీతలతో ఆ ఇద్దరు వివాహితుల తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అవమానభారంతో జీవించే కంటే చావే మేలనుకుని నిర్ధారించుకున్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం తెల్లవారు జామున బహిర్భూమికని వెళ్లి కాలనీ సమీపంలో చెట్లకింద క్రిమిసంహారక మందు తాగారు.అనంతరం ఇద్దరూ ఇంటికి వచ్చి పడుకున్నారు. అయితే వారినోట్లో నుంచి నురుగురావడంతో గట్టమ్మ భర్త అయోధ్య వెంటనే విషయాన్ని కాలనీవాసులకు చెప్పి వారిని 108లో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి బయలుదేరారు. 

మార్గమధ్యలోనే గట్టమ్మ చనిపోగా సరోజ చికిత్స పొందుతూ మృతి చెందింది. సరోజకు భర్త శ్రీను, కుమారుడు, కుమార్తె ఉండగా, గట్టమ్మకు కూడా భర్త అయోధ్య, కుమారుడు కుమార్తె ఉన్నారు.  మృతదేహాలకు సూర్యాపేట ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం జరిపించారు. ఇద్దరు వివాహితల ఆత్మహత్యకు  కడమంచి లింగయ్య కారణమని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతడిపై  కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై పాపిరెడ్డి తెలిపారు. సంఘటన స్థలాన్ని నాగరాం ఎస్సై శ్రీనివాస్‌ పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.

మూడేళ్లుగా మాటలు బంద్‌
మృతురాలు భూతం సరోజ భర్త శ్రీను కుటుంబానికి నిందితుడు కడమంచి లింగయ్య కుటుంబాలకు మూడేళ్లుగా మాటలు లేవు. రెండు కుటుంబాలకు గొడవలు జరిగి మాట్లాడుకోవడం లేదు. ఈ క్రమంలోనే లింగయ్య శ్రీను భార్య సరోజతో వివాహేతర సంబంధం ఉందని అనడం కూడా ఆత్మహత్యకు ఓ కారణం. అయితే కడమంచి లింగయ్య మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తాడని తనకు నచ్చిన మహిళలను  లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తాడని  కాలనీవాసులు తెలిపారు.

పంచాయితీలో నింద
కాలనీలో మంగళవారం సాయంత్రం పెద్ద మనుషుల సమక్షంలో ఓ పంచాయితీ జరిగింది. ఆ పంచాయితీకి హాజరైన అదే కాలనీకి చెందిన లింగయ్య తాను ఇదే కాలనీకి చెందిన తిరుపాటి గట్టమ్మ, భూతం సరోజలతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నానని పేర్కొన్నాడు. ఈ విషయం తెలిసిన వార్తి భర్తలు అవాక్కై భార్యలను నిలదీశారు.

కొంతకాలంగా  వేధింపులు
గట్టమ్మ, సరోజలను కడమంచి లింగయ్య తరుచూ ఫోన్లు చేస్తూ వేధిస్తున్నాడని తెలిసింది. వారితో ఫోన్‌లో మాట్లాడే విషయాలు సెల్‌లో రికార్డు చేసి బెదిరించేవాడని సమాచారం.అయితే నిందితుడు లింగయ్య పరారీలో ఉన్నాడు. అయన్ను  విచారిస్తే అన్ని విషయాలు బయటపడతాయని బుడిగజంగాల కుటుంబాల వారు చెబుతున్నారు.

Advertisement
Advertisement