కుంతీ పుత్రుడు | Sakshi
Sakshi News home page

కుంతీ పుత్రుడు

Published Tue, Oct 31 2017 7:36 AM

mother leave birth child on roadside - Sakshi

జోల పాటతో నిద్రపుచ్చాల్సిన తల్లి కటిక చీకట్లో వదిలేసింది.. లోకానికి పరిచయం చేయాల్సిన చేతులే నిర్దయగా వదిలించుకున్నాయి.. కళ్లెదుట కనిపించిన అమృతమూర్తి ముఖం అంతలోనే అంతర్ధానమైంది.. పొత్తిళ్లలో సేదతీరాల్సిన చిన్నారికి బస్టాండ్‌ ఆవరణ ఆవాసమైంది.. ఒంటిపై నూలుపోగు కూడా లేదు.. చలిపొద్దు మేల్కొలుపుతో కంటి నిండా నీళ్లు.. నవమాసాలు మోసిన అమ్మను చూడాలనే తపన కెవ్వుమని కేకపెట్టింది.. రక్తం పంచిన మాతృమూర్తి కోసం మూగ మనసు తపించింది.. కన్నపేగు తల్లడిల్లిందో లేదో కానీ ఓ తల్లి మనసు కరిగింది.. పరుగుపరుగున వెళ్లి ఒడిలోకి తీసుకుంది.. మాతృత్వపు మధురిమను పంచి నిదురపుచ్చింది. ఇక ఈ కుంతీపుత్రుడి పయనమెటో కాలమే నిర్ణయించాలి?

సంతానం కలుగలేదని..
పుట్టిన బిడ్డను నిర్దయగా వీధికొదిలేసిన తల్లి ఒకరయితే.. పెళ్లయి ఏళ్లు గడుస్తున్నా కడుపు పండలేదని ఓ ఇల్లాలు ఏకంగా లోకాన్నే వీడింది. పుట్లూరు మండలంలోని గాండ్లపాడులో సోమవారం మహాలక్ష్మి(22) విష గుళికలు మింగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈమెకు పెద్దిరాజుతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. సంతానం కలుగకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. కోలుకోలేక మరణించింది. విధి వైపరీత్యం అంటే ఇదే కాబోలు. బిడ్డ భారమనుకుని వదిలించుకున్న తల్లి ఒకరు కాగా.. అదే బిడ్డ కోసం తన ప్రాణాన్నే బలితీసుకున్న మహిళ ఇంకొకరు. జీవితమంటే ఇదీ.– పుట్లూరు

కదిరి: రెండు రోజుల క్రితం జన్మించిన మగ శిశువును సోమవారం కదిరి ఆర్‌టీసీ బస్టాండ్‌ ప్రాంగణంలో వదిలేసి వెళ్లారు. తెల్లవారు జామున చలికి వణికిపోతూ కెవ్వున ఏడుస్తున్న చిన్నారిని అక్కడి మహిళా స్వీపర్‌లు గుర్తించారు. వెంటనే డిపో మేనేజర్‌ సూర్యనారాయణకు విషయం తెలియజేశారు. డీఎంతో పాటు ఆర్‌టీసీ కార్యాలయ సూపరింటెండెంట్‌ హరిమోహన్‌ స్పందించి ఐసీడీఎస్‌ అధికారులకు సమాచారం అందజేసి అప్పగించారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం చిన్నారిని అనంతపురం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇంట్లోనే ప్రసవం
అనంతపురం న్యూసిటీ: కదిరి బస్టాండ్‌లో వదిలేసిన వెళ్లిన పసిబిడ్డ బొడ్డుకు క్లాంప్‌ వేయకుండా తాడు కట్టడం చూస్తే ఇంట్లోనే ప్రసవం అయినట్లుగా కనిపిస్తోంది. నెలలు నిండక ముందే బిడ్డ జన్మించినట్లుగా భావిస్తున్నాం. సెప్టిసేమియా(రక్తంలో ఇన్ఫెక్షన్‌) బాధపడుతున్నాడు. శ్వాస తీసుకోవాడనికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. బాబు 1.6 కేజీల బరువు ఉన్నాడు. రికవరీ అయ్యేందుకు సమయం పడుతుంది. మంగళవారం పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించి మెరుగైన చికిత్సను అందిస్తాం.
– డాక్టర్‌ దినకర్, ఎస్‌ఎన్‌సీయూ, అనంతపురం ప్రభుత్వాసుపత్రి

Advertisement
Advertisement