Sakshi News home page

వీడిన హత్య కేసు మిస్టరీ..!

Published Sat, Mar 24 2018 10:48 AM

Murder Case Revealed - Sakshi

ప్రొద్దుటూరు క్రైం : ఇటీవల పెద్దశెట్టిపల్లె గ్రామ పంట పొలాల్లో హత్యకు గురైన వ్యక్తి కేసును రూరల్‌ పోలీసులు ఛేదించినట్లు తెలుస్తోంది. సంబేపల్లి మండలానికి చెందిన కృష్ణమూర్తిగా పోలీసులు గుర్తించారు. ఈ నెల 15న పెద్దశెట్టిపల్లె సమీపంలోని మైలవరం పంట కాలువలో అతన్ని చంపి, మృతదేహాన్ని కాల్చిన విషయం తెలిసిందే. విషయం తెలియడంతో డీఎస్పీ శ్రీనివాసరావుతో పాటు సీఐ ఓబులేసు, ఎస్‌ఐ చంద్రశేఖర్‌లు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహం గుర్తు పట్టలేని విధంగా ఉండటంతో పోలీసు దర్యాప్తుకు కొంతమేర ఆటంకం కలిగింది. దీంతో ప్రొద్దుటూరుతో పాటు చుట్టు పక్కల గ్రామాల్లో పోలీసులు విచారించారు.

భర్త కనిపించలేదని మహిళ చెప్పడంతో..
సంబేపల్లి మండలానికి చెందిన కృష్ణమూర్తి దంపతులు ప్రొద్దుటూరులోని ప్రైవేట్‌ పాఠశాల, కళాశాలల హాస్టల్‌లో వంట మనుషులుగా పని చేస్తున్నారు. వంటకు కావాల్సిన కూరగాయలను మార్కెట్‌ నుంచి వీళ్లే తెచ్చుకునేవారు. శంకరాపురం గ్రామానికి చెందిన వ్యక్తి మూడేళ్ల కిందట కళాశాలలో అటెండర్‌గా పని చేసేవాడు. ఆ సమయంలో అటెండర్‌ కృష్ణమూర్తి దంపతులతో పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 14న కృష్ణమూర్తి హత్యకు గురయ్యాడు. శంకరాపురానికి చెందిన వ్యక్తే అతన్ని హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో కృష్ణమూర్తి భార్య పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తునట్లు సమాచారం. ఆస్తి కోసం అతన్ని హత్య చేశారా లేక మరే ఇతర కారణాలతో చంపారా అనే విషయం తెలియాల్సి ఉంది. కృష్ణమూర్తి రెండు రోజుల నుంచి ఇంటికి రాకపోవడంతో ఆమె పలువురికి ఫోన్లు చేసి భర్త గురించి అడిగినట్లు సమాచారం. ఇలా పోలీసులకు తెలియడంతో ఆమెను స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించగా హత్య కేసు వివరాలు బహిర్గతం అయినట్లు తెలిసింది.

Advertisement

What’s your opinion

Advertisement