ప్రాణాలు తీస్తున్న పార్థీ గ్యాంగ్‌ పుకార్లు | Sakshi
Sakshi News home page

ప్రాణాలు తీస్తున్న పార్థీ గ్యాంగ్‌ పుకార్లు

Published Tue, May 1 2018 9:03 AM

Parthi Gang Hulchul In Chittoor - Sakshi

చిత్తూరు అర్బన్‌: ఈ రెండే కాదు.. పార్థీ గ్యాంగ్‌ పేరు ప్రచారంలోకి వచ్చాక జిల్లాలోని సగానికి పైగా మండలాల్లో రాత్రులు జనం నిద్రపోవడంలేదు. ఎప్పుడు ఎవరు వస్తారో తెలియక చేతిలో కర్రలు, బలమైన ఆయుధాలు పట్టుకుని రాత్రులు గస్తీ తిరుగుతున్నారు. తమ ప్రాణాలు కాపాడుకోవాలనే ఆతృతలో అమాయకులపై, అనుమానంగా కనిపించే వారిపై దాడులు చేస్తున్నారు. ఇవి ఒక్కోసారి శ్రుతి మించడంలో అభం శుభం తెలియని వ్యక్తులు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి.

హిందీ మాట్లాడితే అంతే...
ఇటీవల రామచంద్రాపురం, పాకాల, ఎర్రావారిపాలెం మండలాల్లోని 12 గ్రామాల్లో పార్థీగ్యాంగ్‌ తిరుగుతోందనే పుకార్లతో ప్రజలంతా అప్రమత్తమయ్యారు. వంతులు వేసుకుని మరీ గత 15 రోజులుగా రాత్రుళ్లు జాగారం చేస్తున్నారు. వారం క్రితం పార్థీగ్యాంగ్‌ సభ్యుడనే అనుమానంతో రామచంద్రాపురంలో ఓ వ్యక్తిని చితకబాది పోలీసులకు అప్పగించారు. చిత్తూరు నగరంలోనూ ఇదే తంతు. పలు కాలనీల్లో యువకులు నిద్ర మానేసి పార్థీగ్యాంగ్‌ను పట్టుకుంటామని రాత్రులు పహారా కాస్తున్నారు. పొద్దుపోయిన తరువాత ఎవరైనా అనుమానిత వ్యక్తులు కాలనీలు, గ్రామాల్లోకి వచ్చి పొరపాటున హిందీ మాట్లాడితే చావుదెబ్బలు తినాల్సిన పరిస్థితి నెలకొంది. దోపిడీలు, హత్యలకు పాల్పడే పార్థీగ్యాంగ్‌ ముఠా ఆనవాళ్లు ప్రస్తుతం జిల్లాలో లేవని పోలీసులు చెబుతున్నా కొన్నిచోట్ల ప్రజల ఆలోచనల్లో మార్పు రావడంలేదు.

ఆలోచన అవసరం
ఎక్కడైనా అనుమానితులు కనిపిస్తే వాళ్లను పట్టుకుని కొట్టడం మానేయాలి. తొలుత అతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడని విచారించాలి. అతని వద్ద ఆయుధాలుంటే జాగ్రత్తగా వ్యవహరించాలి. ఒకరు విచారిస్తుండానే మరొకరు పోలీసులకు సమాచారం అందించాలి. అలాకాకుండా ఆవేశంలో విజ్ఞత మరచిపోయి కనిపించిన అనుమానితులపై దాడులు చేయడం, కొట్టి చంపడం మానవతా విలువల్ని చంపేయడమే అవుతుంది. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో అనుమానిత వ్యక్తిని ఏదైనా ఆధార్‌ కేంద్రానికి తీసుకెళ్లి అతని చేతివేలి ముద్రలు స్కాన్‌ చేస్తే చిరునామా వచ్చే అవకాశం ఉంది. పోలీసులకు అప్పగిస్తే వాళ్ల వద్ద ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో అనుమానిత వ్యక్తి ఎవరనేది గుర్తిస్తారు. దొంగైతే చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదు. చిత్తూరులో జరిగిన హత్యలో అనుమానిత వ్యక్తిని విచారించిన పోలీసులు అతనికి మతిస్థిమితంలేదని గుర్తించి ఏదైనా హోమ్‌లో చేర్పించి ఉంటే ప్రాణాలు పోయేవికావు. ప్రజల ఆవేశంతో పాటు పోలీసుల నిర్లక్ష్యం కూడా కనిపిస్తోంది.

మహిళను చితకబాదిక గ్రామస్తులు
పూతలపట్టు: మండలంలోని పి.కొత్తకోట ప్రాంతంలో సంచరిస్తున్న మహిళను స్థానికులు పార్థీ గ్యాంగ్‌ సభ్యురాలని భావించి చితక బాదారు. ఆమెకు మాటలు రాకపోవడం, గ్రామస్తులకు సమాధానం చెప్పకపోవడంతో పార్థీగ్యాంగ్‌ అని అనుమానించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. అనంతరం ఎస్‌ఐ మురళీమోహన్‌ ఫోన్‌ ద్వారా అమ్మ ఒడి ఆశ్రమ నిర్వాహుడు పద్మనాభ నాయుడికి సమాచారం అందించారు. వారు పూతలపట్టు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి మాటలు రాని మహిళను ఆశ్రమానికి తీసుకెళ్లారు. తన పేరు రష్మి అని ఆమె హిందీలో రాసి చూపించింది. పార్థీ గ్యాంగ్‌నకు సంబంధించిన వారని ఎవరినీ అనవసరంగా కొట్టరాదని, అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్‌ఐ కోరారు.

పార్థీగ్యాంగ్‌ లేదు
జిల్లాలో ఎక్కడా పార్థీగ్యాంగ్‌ ఆనవాళ్లు లేవు. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరంలేదు. అనుమానితులు కనిపిస్తే వెంటనే 100కు సమాచారం ఇవ్వండి. ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు. గస్తీలు కాయడం, పహారా ఉండడం తప్పుకాదు. కానీ ప్రాణాలు పోయే వరకు కొట్టడం అంటే హత్య చేయడమే. ఇలా చేయడం నేరం.– రాజశేఖర్‌బాబు, ఎస్పీ, చిత్తూరు

Advertisement
Advertisement