పాస్టర్‌ హత్యకేసులో ఉత్కంఠ! | Sakshi
Sakshi News home page

పాస్టర్‌ హత్యకేసులో ఉత్కంఠ!

Published Fri, May 4 2018 7:18 AM

Paster Murder Case: Suspects Reveals - Sakshi

తెనాలిరూరల్‌: ఇటీవల హత్యకు గురైన తెనాలి మండలం కొలకలూరుకు చెందిన దళిత పాస్టర్‌ ఉన్నం సుబ్బారావు అలియాస్‌ దానియేలు హత్య కేసు దర్యాప్తు కొనసాగుతోంది. పాస్టర్‌ది అనుమానాస్పద మృతిగా పోలీసులు తొలుత భావించారు. గ్రామస్థులు హత్యే అని అనుమానాలు వ్యక్తం చేయడం, పాస్టర్‌ పోలీసులకు చెప్పుకున్నట్టు ఆయన బ్యాంకు అకౌంట్ల నుంచి సుమారు ఐదు లక్షల వరకు సొమ్ము డ్రా చేసి ఉండడంతో హత్య చేసి ఉంటారని నిర్థారించుకున్నారు. గ్రామానికి చెందిన టీడీపీ ఎంపీటీసీ భర్త ఆరుబాక రాజేష్‌ ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కోవడంతో కేసు దర్యాప్తుపై ఆది నుంచి అనుమానాలు వ్యక్తమవుతుండడం, దర్యాప్తు అధికారిని సైతం మార్చమని డిమాండ్‌ వచ్చిన సంగతి తెలిసిందే. కొలకలూరు గ్రామ దళితవాడలో తీవ్ర సంచలనం రేకెత్తించిన పాస్టర్‌ హత్య ఏప్రిల్‌ 24వ తేదీన జరుగగా, మే ఒకటో తేదీ వరకు నిందితులు బహిరంగంగా తిరుగుతూనే వచ్చారు. ఏప్రిల్‌ 30వ తేదీన తెనాలి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్‌ సెల్‌కు రాజేష్, మరో అనుమానితుడు నాని తమ తమ కుటుంబ సభ్యులతో కలసి వెళ్లి, అన్యాయంగా కేసులో ఇరికిస్తున్నారంటూ వినతిపత్రం అందజేశారు.

దీనిపై పోలీసుల కు ఉన్నత స్థాయి అధికారుల నుంచి మందలింపులు రావడంతో, స్పందించి చర్యలు ప్రారంభించారు. అదే రోజు అర్ధరాత్రి దాటాక రాజేష్‌తో పాటు సుద్దపల్లి పృద్వీ, కొలకలూరు నానిలను అదుపులోకి తీసుకున్నారు. రాజేష్‌కు సన్నిహితుడిగా పేరొందిన గ్రామానికి చెందిన ఉన్నం జాన్‌బాబును బుధవారం అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అలాగే జాన్‌బాబు కుమారుడు గోపి, మరో యువకుడు పి. పవన్‌కుమార్‌లను గురువారం అదుపులోకి తీసుకున్నారు. దీంతో పాస్టర్‌ హత్య కేసులో పోలీసుల అదుపులో ఉన్న అనుమానితుల సంఖ్య ఆరుకు చేరింది. హత్యలో జాన్‌బాబు పాత్ర ఉండి ఉంటుందన్న అనుమానాలు హత్య జరిగిన రోజు కొందరు  గ్రామస్థులు పోలీసుల వద్ద వ్యక్తం చేశారు. సీసీ కెమెరాల ఫుటేజ్‌ పరిశీలన అనంతరం జాన్‌బాబును అదుపులోకి తీసుకున్నారు. పాస్టర్‌ సుబ్బారావు ఇంటి వెనుక ఇంట్లో నివసించే కొలకలూరి దయాకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. పాస్టర్‌ మృతదేహాన్ని తొలుత తామే గుర్తించామని దయాకర కుటుంబ సభ్యులు హత్య జరిగిన రోజు పోలీసులకు తెలిపారు. ఆ తర్వాత  దయాకర్‌ తండ్రి ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నం చేశాడు. తెనాలిలోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్సపొంది బుధవారమే డిశ్చార్జి అయ్యారు. దయాకర్‌కు హత్యకు సంబంధించి కీలక సమాచారం తెలిసి ఉండొచ్చని పోలీసులు  భావిస్తున్నారు.

Advertisement
Advertisement