Sakshi News home page

ఇసుకే చంపేస్తోంది!

Published Fri, Mar 23 2018 1:16 PM

sand is killing - Sakshi

సిరిసిల్లక్రైం: జిల్లాలోని అన్ని  ట్రాక్టర్స్‌ ఐడీ నంబర్‌తోపాటు వాటికి సంబంధించిన అన్ని పత్రాలు ఇన్సురెన్స్, అనుభవం కలిగిన డ్రైవర్‌ వివ రాలను ఆన్‌లైన్‌ చేసి ప్రమాదాలతోపాటు అక్రమ వ్యాపారానికి ట్రాక్టర్స్‌ ను వినియోగించే వారి కదలికలను కనిపెడతాం. ఒకటి, రెండుసార్లు నిబంధనలు అతిక్రమిస్తే అలాంటి ట్రాక్టర్స్‌ను సీజ్‌ చేసి సంబంధిత యజమానిపై కేసులు నమోదు చేస్తాం.’ ఇది ఆర్నెల్ల క్రితం  జిల్లా పోలీస్‌శాఖ చేసిన ప్రకటన. ఈ మాటలే తప్ప చేతల్లో సాధ్యకాలేదు సరికదా.. ఆర్నెల్లలో పోలీసు వ్యవహార శైలిలోనే మార్పు వచ్చింది. ఇసుక అక్రమ తరలింపును అరికట్టాల్సింది మైనింగ్, రెవెన్యూ అధికారులు.. అందులో తమను టార్గెట్‌ చేయడం ఏమిటని సదరు పోలీసుశాఖ అధికారులే అభిప్రాయపడ్డారు.

దీంతో ఇసుకట్రాక్టర్‌ డ్రైవర్లకు ఇతర శాఖల మధ్య ఉన్న సమన్వయలోపం కలిసి వచ్చింది. ఇంకేముంది మానేరు వాగునుంచి ఎవరికి తోచిన స్థావరాల్లో వాళ్లు రాత్రిళ్లు ఇసుకను తరలించే పనుల్లో మునిగితేలుతున్నారు. అడపాదడపా పోలీసుల్లో కొందరు విధులు నిర్వహించే క్రమంలో తాము ఎక్కడ పట్టుబడుతామో.. ట్రాక్టర్‌ సీజ్‌ అవుతోందోనన్న హైరానాతో ఇసుకాసురులు పలు ప్రమాదాలు చేస్తున్నారు. పలువురి ప్రాణాలను హరిస్తున్నారు. 


కడుపుశోకం.. ప్రమాద ఘటనలు..
జిల్లాలో కేంద్రం పరివాహక ప్రాంతాలైన కొడిముంజ, మానేరువాగు నుంచి ఇసుక ఇతర జిల్లాలకు వెళ్లే క్రమంలో లారీలు, ట్రాక్టర్స్‌ ప్రమాదాల్లో ఏడాదిలో పలువురు మృతి చెందారు. వీరిలో ఓ రైతు మృతి రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో వారివారి విధుల్లో తలామునకలవుతున్న అధికారులు కోర్టులచుట్టూ తిరగాల్సి వస్తోంది. మరోవైపు రెండునెలల వ్యవధిలోనే ఇసుక ట్రాక్టర్ల ఢీకొని మరో ఇద్దరు మృతి చెందారు. గత సంవత్సరం జూలై జిల్లాలోని నేరళ్ల వద్ద జరిగిన ఇసుక లారీ ప్రమాదంలో ఆ ప్రాంతానికి చెందిన రైతు భూమయ్య మృతి చెందాడు. తమ గ్రామం నుంచి లారీలు అధిక స్పీడుతో లారీ వెళ్తున్నాయని, ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నాయని స్థానికులు లారీలకు నిప్పుపెట్టారు. ఆ సమయంలో  ఇసుక రవాణాపై అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటారని అందరూ భావించినా.. అందుకు విరుద్ధంగా వ్యవహరించారు పోలీసులు.

ఈ ఏడాది ఫిబ్రవరి 19న తంగళ్లపల్లిలో రెండు ఇసుక ట్రాక్టర్లు ఢీకొన్నాయి. ఇందులో ఓ ద్విచక్ర వాహనం చిక్కుకుని మండలంలోని బద్దెనపల్లికి చెందిన గిరీష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. లక్ష్మీపూర్‌కు చెందిన గన్నె కనుకయ్య, ట్రాక్టర్‌ డ్రైవర్‌ శివరాజు, రాజు తీవ్ర గాయాలపాలయ్యారు. దీనిని మరువకముందే ఈనెల 21న ముస్తాబాద్‌ మండలం తర్కపల్లికి చెందిన గ్రామ పంచాయతీ కార్మికుడిని గుర్తుతెలియని ఇసుక ట్రాక్టర్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతికి కారణమైన ట్రాక్టర్‌ ఇప్పటికి అధికారులకు రెండు గడిచిన చిక్కలేదు. ఇలా ఇసుక లారీలు, ట్రాక్టర్ల ప్రమాదాలతో జరుగుతున్న మరణాలు జిల్లాలో భయాన్ని రేకెత్తిస్తున్నాయి. 
నిశికాసురులుగా..
నిబంధనల ప్రకారం రెవెన్యు వి«భాగం నుంచి వే బిల్లులు తీసుకుని ట్రాక్టర్‌ యజమానులు వారంలో మంగళ, గురు, శనివారాల్లో మానేరులోని ఇసుక రీచ్‌ నుంచి తీసుకెళ్లే అవకాశం ఉంది. కానీ దీనిలో కాస్త తక్కువగా డబ్బులు వస్తాయని భావించిన ట్రాక్టర్స్‌ యజమానులు రాత్రిళ్లు మానేరు వాగు సరిహద్దు ప్రాంతాల గుండా దొంగదారిలో వెళ్లి చిమ్మచీకట్లలో ఇసుకను ఎత్తుకెళ్తున్నారు. దీనిపై సమాచారం అందుకుని ఏదేని పోలీస్‌ అధికారులు వెళితే కొరియర్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని కేసులు నమోదవకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇటీవల కాలంలో అర్థరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వందల సంఖ్యలో ఇసుక రవాణా జరుగుతున్నట్లు సమాచారంతో ఓ పోలీస్‌ అధికారి వెళితే ట్రాక్టర్స్‌ డ్రైవర్స్‌ ఎక్కడివాళ్లక్కడే పరారయ్యారు. 

షరా ‘మాముళ్లు’గానే..
ఇసుక రవాణ జరగడంలో ఇంతకు ముందు తనిఖీలు నిర్వహించే విధానంలో పోలీసులతోపాటు రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం.. అమ్యామ్యాలతో వ్యాపారం సాగేది. కానీ ఇప్పుడది రెవెన్యూ కార్యాలయంలో వేబిల్లు చేతివాటం నుంచి రాజకీయ పలుకుబడి, రెవెన్యూ విభాగంలో కొంతమంది కిందిస్థాయి సిబ్బంది చేతివాటం ఉందని సమాచారం. ఇలాంటి సంఘటనలు బహిరంగంగా తెలిసిన మళ్లీ రాత్రిళ్లు ఇసుక రవాణా అక్రమంగా జరుగుతుందంటే దానికి అన్ని విభాగాలలో ఇసుక తోడేళ్లు మాముళ్ల పర్వాన్ని సాగించి సాఫీగా వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది. 

మానేరు పరివాహక పాంత్రాలన్నీ
జిల్లాలో మానేరు పరివాహక ప్రాంతాలు గంభీరావుపేట, ముస్తాబాద్, సిరిసిల్ల, బోయినిపల్లి, వేములవాడ రూరల్‌ మండలాల్లో ఇసుక రవాణా కేంద్రాలను ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు సాగుతున్నట్లు సమాచారం. జిల్లా కేంద్రంతోపాటు, బోయినిపల్లి, వేములవాడల్లో కేసులు నమోదవుతున్నాయే తప్ప మిగితా ప్రాంతాల్లో అక్రమ ఇసుక రవాణాకు అడ్డు అదుపులేకుండా పోతోందన్న విమర్శలున్నాయి. ఏదేని చర్యలకు పోలీసులు వెళితే స్థానిక అవసరాలన్న నెపాన్ని సాకుగా చూపి రాజకీయ బలం, ఆర్థిక సర్ధుబాటులో ట్రాక్టర్స్‌ నిర్వాహకులు తప్పించుకుంటున్నారని విమర్శలున్నాయి. సిరిసిల్లలోని సాయినగర్, శాంతినగర్, విద్యానగర్‌ నుంచి ఇసుక ప్రతినిత్యం తరులుతోంది. రోజుకు 120 – 200 ట్రిప్పులు అనధికారికంగా తరలుతున్నట్లు సమాచారం.   

Advertisement

What’s your opinion

Advertisement