ఖాకీ వేషంలో ఉన్న దొంగల అరెస్టు | Sakshi
Sakshi News home page

ఖాకీ వేషంలో ఉన్న దొంగల అరెస్టు

Published Wed, Jul 17 2019 11:00 AM

Thieves In Police Dress Has Arrested in Renigunta - Sakshi

సాక్షి, రేణిగుంట(తిరుపతి) : నగలు చోరీ చేయడానికి పోలీసు దుస్తుల్లో వచ్చిన జులాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 1,080 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పాకాల రైల్వేస్టేషన్‌లో గత నెల 11న జరిగిన నగల చోరీ కేసును రేణిగుంట జీఆర్‌పీ పోలీసులు ఛేదించినట్లు  తిరుపతి జీఆర్‌పీ డీఎస్‌పీ రమేష్‌బాబు తెలిపారు. రేణిగుంట జీఆర్‌పీ స్టేషన్‌లో మంగళవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో నిందితుల అరెస్ట్‌ను చూపిన పోలీసులు రికవరీ చేసిన బంగారు ఆభరణాలను ప్రదర్శించారు.

డీఎస్పీ తెలిపిన వివరాల మేరకు, తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన నగల వ్యాపారి ముకుందరాజన్‌ తరచూ కోయంబత్తూరు నుంచి రైలులో కడప జిల్లా ప్రొద్దుటూరులో నగల దుకాణాలకు బంగారు ఆభరణాలను విక్రయిస్తుంటాడు. ఈ క్రమంలో ప్రొద్దుటూరుకు చెందిన నక్కా రాజశేఖర్‌(24)  ముకుందరాజన్‌ రాక, పోకలపై కన్నేశాడు. ఈ క్రమంలో అతని స్నేహితులు ప్రొద్దుటూరుకు చెందిన మాజీ సిపాయి పుల్లారెడ్డి(28), యర్రగుంట్లకు చెందిన ప్రింటింగ్‌ ప్రెస్‌ నిర్వాహకుడు ప్రసాద్‌(26)తో కలసి ముకుందరాజన్‌ నుంచి నగలను తస్కరించేందుకు పథకం వేశాడు.

 గతనెల 11న కోయంబత్తూరుకు వెళ్లి అక్కడ నుంచి రైలులో ప్రొద్దుటూరుకు జయంతి ఎక్స్‌ప్రెస్‌రైలులో బయల్దేరిన ముకుందరాజన్‌ను వెంబడించారు. రైలులో పుల్లారెడ్డి ఎస్‌ఐ దుస్తుల్లోనూ, ప్రసాద్‌ కానిస్టేబుల్‌ దుస్తుల్లోనూ ముకుంద్‌రాజన్‌ వద్దకు వెళ్లి బ్యాగులను తనిఖీ చేశారు. తాము పోలీసులమని,  బంగారం అక్రమ వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం వచ్చిందని బెదిరించి అతని నగల బ్యాగును, రెండు మొబైల్‌ ఫోన్లను తీసుకున్నారు. పాకాల రైల్వేస్టేషన్‌లో రైలు ఆగగానే అతనిని కిందికి దింపి, రైల్వే క్వార్టర్స్‌ వైపు వెళ్లారు.

ఉదయం చిత్తూరు 1 టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు రావాలని అతనికి చెప్పి, అక్కడ నుంచి ఆటో ఎక్కి వెళ్లిపోయారు. దీంతో నగల వ్యాపారి ముకుంద్‌ ఉదయం చిత్తూరు వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని తెలిపాడు. రేణిగుంట జీఆర్‌పీ సీఐ అశోక్‌కుమార్‌ కేసు నమోదు చేసి ఎంతో చాకచక్యంగా దర్యాప్తు చేశారు. పాకాల సమీపంలో తిరుగుతున్న నిందితులు రాజశేఖర్, పుల్లారెడ్డి, ప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా ప్లాస్టిక్‌ కవరులో బంగారు ఆభరణాలను మూటకట్టి పాకాల సమీపంలోని ఓ గుట్టపై ముళ్లపొదల్లో పాతిపెట్టినట్లు తెలిపారు.

నిందితులను తీసుకెళ్లి ఆ నగలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ 21 లక్షల 90వేలు ఉంటుందని తెలిపారు. వారు ఉపయోగించిన పోలీసు దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. కేసు ఛేధించిన సీఐ అశోక్‌కుమార్, ఎస్‌ఐలు అనిల్‌కుమార్, ప్రవీణ్‌ను అభినందిస్తూ వారికి రివార్డులను అందజేయాలని సిఫార్సు చేస్తున్నట్లు డీఎస్‌పీ పేర్కొన్నారు. ప్రొద్దుటూరులో కమాండ్‌ కంట్రోల్‌ విభాగంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సుబ్బరాయుడు పోలీసుల వేషంలో వెళ్లండని నిందితులకు చెప్పడంతో అతనిపై చర్యలు తీసుకోనున్నారు.  నిందితులను  నెల్లూరు రైల్వేకోర్టుకు రిమిండ్‌ నిమిత్తం తరలించినట్లు తెలిపారు.  

Advertisement
Advertisement