Sakshi News home page

గ్రానైట్‌పై పెద్దల కన్ను   

Published Fri, Jul 6 2018 12:38 PM

The Tribals Are Protest That The Quarries Are Allowed - Sakshi

కంచిలి: మండల పరిధిలో గిరిజన గ్రామాల్లో గ్రానైట్‌ క్వారీయింగ్‌ అనుమతులివ్వొద్దంటూ గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని జలంత్రకోట పంచాయతీ పరిధి నువాగడ రెవెన్యూ పరిధిలో గల క్రాంతినగర్‌ గ్రామానికి ఆనుకుని ఉన్న సర్వే నంబర్‌ 47లోని 5.5 హెక్టార్ల కొండలో గ్రానైట్‌ నిక్షేపాలు ఉన్నాయి.

దీంతో ఈ కొండలపై అధికార పార్టీ నేతల కన్ను పడింది. ఇదే అదునుగా తమ పలుకుబడి ఉపయోగించి కొండ చుట్టూ ఐటీడీఏ నిధులు రూ.32 లక్షలతో 1200 మీటర్ల మెటల్‌ రోడ్డును మంజూరు చేయించుకుని చకచకా పనులు చేపట్టేశారు. ఈ వ్యవహారమంతా స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ ప్రాబల్యంతో జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

ఎమ్మెల్యే బంధువుకే అనుమతి

ఎమ్మెల్యే అశోక్‌కు చెందిన బంధువు ఈ కొండపై అనుమతుల కోసం దరఖాస్తు చేశారు. దీంతో పంచాయతీ నుంచి అనుమతి పొందారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయానికి దరఖాస్తు చేశారు. దీంతో తహసీల్దార్‌ డి.రామ్మోహనరావు తన సిబ్బందితో కలసి కొండ సమీప గ్రామాలైన నువాగడ, క్రాంతినగర్, రాజాశాంతినగర్‌ గ్రామాలకు గురువారం వెళ్లి విచారించారు.

ఆ సమయంలో ఆయా గ్రామస్తులు చేరుకుని.. ఇక్కడ కొండను క్వారీయింగ్‌కు అనుమతివ్వొద్దంటూ నిరసన తెలిపారు. ఈ కొండకు ఆనుకుని తమ గ్రామాలున్నాయని, అడవి తల్లిని నమ్ముకుని జీవిస్తున్నామని, ఈ కొండలో క్వారీయింగ్‌ చేస్తే తమ బతుకులు నాశనమవుతాయని ప్రాథేయపడ్డారు. క్వారీయింగ్‌కు పాల్పడితే ఒప్పుకొనేది లేదని స్పష్టం చేశారు.

ఈ నిరసనలో గిరిజనులు భీమాబిసాయి, లిమ్మో బిసాయి, గణేష్‌ సవర, మహేష్‌గొమాంగో, లావణ్యబుయ్య, కవిత గొమాంగో, ఇస్తాయెల్‌ గొమాంగో తదితరులు పాల్గొన్నారు. స్థానిక రెవెన్యూ అధికారులపై ఎమ్మెల్యే మనుషుల ఒత్తిళ్లతో సంబంధిత ఫైల్‌.. టెక్కలి ఏడీ మైన్స్‌కు.. అక్కడి నుంచి రాష్ట్ర మైన్స్‌ అండ్‌ జియాలజీ డైరెక్టర్‌ అనుమతికి పంపించేశారు. 

బురుపడ కొండ కూడా..

మండలంలో కుంబరినౌగాం పంచాయతీ పరిధిలో బురుపడ గ్రామంలో సర్వేనంబర్‌ 167/1లో 3 హెక్టార్లలో ఉన్న కొండలో కూడా గ్రానైట్‌ నిక్షేపాలు ఉన్నాయి. దీనిని లీజు కోసం రాజాం ప్రాంతానికి చెందిన ఒక వ్యాపారి దరఖాస్తు చేశారు. దీనిపై గత సోమవారం స్థానిక గిరిజనులతో కలిసి మండల సీపీఐ నేతలు నిరసన తెలిపారు. దీనిపైన కూడా స్థానిక పంచాయతీ, తహసీల్దార్‌ కార్యాలయాల నుంచి ఎన్‌ఓసీ ఇచ్చేశారు.

సంబంధిత ఫైల్‌ను కూడా టెక్కలి ఏడీ మైన్స్‌కు అనుమతుల కోసం పంపించారు. ఇలా మండలంలో గిరిజన గ్రామాల్లో ఉన్న రెండు క్వారీల్లో గ్రానైట్‌ నిక్షేపాల తరలింపు కోసం చేస్తున్న ప్రయత్నాలపై గిరిజనులు కన్నెర్ర జేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయా క్వారీలు ఇక్కడ సాగించేది లేదంటూ ప్రతిఘటించటానికి సిద్ధమవుతున్నారు.

ఈ క్వారీలకు అడ్డుపడే వారిని ఏదోరకంగా భయపెట్టి తమదారిలోకి తెచ్చుకోవడానికి పోలీస్‌ కేసులు బనాయిస్తామని బెదిరింపులు ఎక్కువవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒక నిరసనకారుడిని బెదిరించారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది.  నువాగడ రెవెన్యూ పరిధిలో గ్రానైట్‌ క్వారీయింగ్‌ కోసం ప్రతిపాదించిన కొండ  
 

Advertisement

What’s your opinion

Advertisement