Sakshi News home page

గోడ కూలి ఇద్దరు కూలీల దుర్మరణం

Published Sun, May 27 2018 1:46 AM

Wall wreck killed two laborers - Sakshi

హైదరాబాద్‌: భవన నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు ఇద్దరు వలస కూలీలు దుర్మరణం పాలయ్యారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. హైదరాబాద్‌ బాగ్‌అంబర్‌పేట డీడీ కాలనీకి చెందిన రమేశ్‌గుప్త అంబర్‌పేట ప్రేమ్‌నగర్‌లోని జలమండలి నీటి శుద్ధి కేంద్రానికి ఆనుకొని ఉన్న ఆయన పరిశ్రమ స్థలంలో భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండలం లింగన్నపల్లికి చెందిన వెంకటయ్య (40), ఇదే ప్రాంతానికి చెందిన దాసు (19), వరంగల్‌కు చెందిన మోలావత్‌ చంద్రు (50).. రమేశ్‌ గుప్త చేస్తున్న నిర్మాణానికి కూలీలుగా వెళ్లారు.

వీరంతా భవన నిర్మాణం కోసం గత 10 రోజులుగా జేసీబీతో గుంతలు తవ్వి, పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలానికి ఆనుకొని ఉన్న గోడకు మట్టి పోస్తున్నారు. గోడ పక్కనే భారీ గుంత తవ్వుతుండటంతో శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఆ గోడ ఒక్కసారిగా వీరిపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో వెంకటయ్య, మోలావత్‌ చంద్రులు మట్టిలో కూరుకుపోయి అక్కడికక్కడే మృతి చెందారు. దాసు గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి, దాసును చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.  

కుటుంబాలను ఆదుకుంటాం... 
సమాచారం అందుకున్న ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, డిప్యూ టీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్, జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌ రఘుప్రసాద్, ఈస్ట్‌జోన్‌ డీసీపీ రమేశ్, కార్పొరేటర్‌ పులి జగన్‌ ఘటనా స్థలానికి చేరుకున్నా రు. కార్మిక శాఖ నుంచి ఒక్కొక్కరికి రూ.6.80 లక్ష లు, జీహెచ్‌ఎంసీ నుంచి రూ.లక్ష నష్టపరిహారం వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భవన నిర్మాణ యజమాని రమేశ్‌గుప్తాను అదుపులోనికి తీసుకున్నట్లు ఈస్ట్‌జోన్‌ డీసీపీ తెలిపారు. 

చైన్‌మన్‌ సస్పెండ్‌... 
సుమారు ఐదారు వందల గజాల స్థలంలో భారీ భవన నిర్మాణం జరుగుతుంటే టౌన్‌ ప్లానింగ్‌ అధికా రులకు కనీస సమాచారం లేకపోవడం క్షేత్రస్థాయి సిబ్బంది వైఫల్యమేనని డిప్యూటీ మేయర్, జోనల్‌ కమిషనర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు క్షేత్రస్థాయిలో నిర్మాణాలను పర్యవేక్షించే చైన్‌మన్‌ నాగరాజును సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. పైస్థాయి సిబ్బంది లోపాలపై కూడా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

Advertisement

What’s your opinion

Advertisement