న్యూజీలాండ్లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ సంబరాలు | Sakshi
Sakshi News home page

న్యూజీలాండ్లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ సంబరాలు

Published Thu, Jun 9 2016 1:25 PM

న్యూజీలాండ్లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ సంబరాలు

ఆక్లాండ్: తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజీలాండ్(టీఏఎన్జెడ్) ఆధ్వర్యంలో ఆక్లాండ్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన న్యూజీలాండ్ ఇండియన్ సెంట్రల్ అసోసియేషన్ అధ్యక్షుడు భీకు భాను, ప్రకాష్ బీరాదర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. టీఏఎన్జెడ్ అధ్యక్షుడు కల్యాణ్ రావు కాసుగంటి, ఉపాధ్యక్షుడు ఉమా సల్వాజి, జనరల్ సెక్రటరీ బి.దయాకర్, జాయింట్ సెక్రటరీ యాచమనేని జ్యోతి ప్రజ్వలణలో పాల్గొన్నారు. వీరితో పాటు టీఏఎన్జెడ్ ముఖ్య సభ్యులు, భారతీయ సమాజ్ చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్, ఆక్లాండ్ మలయాళి సమాజ్, సాయిబాబా సంస్థాన్, న్యూజీలాండ్ తెలుగు అసోసియేషన్ సభ్యులు, ఇతర ప్రముఖులు కలిసి తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం టీఏఎన్జెడ్ క్యాలెంజర్ ని ఆవిష్కరించారు. మహిళలు బతుకమ్మ ఆడి తెలంగాణ వాతావరణాన్ని కళ్లకు కట్టేలా చేశారు.

సాంస్కృతిక కార్యక్రమాలను గణేశుని ప్రార్థనతో ప్రారంభించారు. చిన్నారి గ్రీష్మ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని చక్కగా ఆలపించింది. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడికి విచ్చేసిన అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ వేడుకకు శ్రిసుత నాంపల్లి, మురళీధర్ వ్యాక్యాతలుగా వ్యవహరించారు. కల్యాణ్ రావు కాసుగంటి మాట్లాడుతూ.. టీఏఎన్జెడ్ విజన్, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. స్పాన్సర్స్ కి, ఇతర సభ్యులకు జనరల్ సెక్రటరీ దయాకర్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రొఫెసర్ జయశంకర్ సేవలను, సాయుధ పోరాటం నుంచి నేటి వరకు తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను కొనియాడారు. ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయకుండా తెలంగాణపై అభిమానంతో ఇక్కడికి వచ్చారని వైస్ ప్రెసిడెంట్ రామ్మోహన్ దంతాల అన్నారు. జాతీయ గీతం జనగనమణ ఆలపించి ఈ కార్యక్రమాన్ని ముగించారు.





Advertisement
Advertisement