నష్టాలు తగ్గించుకోవాలి | Sakshi
Sakshi News home page

నష్టాలు తగ్గించుకోవాలి

Published Tue, Jan 31 2017 11:27 PM

నష్టాలు తగ్గించుకోవాలి - Sakshi

– ఉల్లి నిల్వ కేంద్రాలకు 50 శాతం రాయితీ
– ఉద్యానశాఖ ఏడీ–1 సీహెచ్‌ శివసత్యనారాయణ


అనంతపురం అగ్రికల్చర్‌ : ఉల్లి సాగులో అధిక దిగుబడులు, ఆర్థికంగా లాభపడాలంటే పంట కాలం, కోత అనంతరం మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలని ఉద్యానశాఖ సహాయ సంచాలకులు (ఏడీ–1) సీహెచ్‌ శివసత్యనారాయణ తెలిపారు. ఏటా ఖరీఫ్, రబీలో ఉల్లి పంట ఐదారు వేల హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతోందన్నారు. అయితే వినియోగదారులకు చేరకమునుపే 30 నుంచి 40 శాతం నష్టం జరుగుతోందని తెలిపారు. దీన్ని అధిగమించాలంటే కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచించారు. అదే విధంగా తక్కువ ఖర్చుతో 25 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం కలిగిన ఉల్లి నిల్వ కేంద్రాన్ని నిర్మించుకోవడానికి రూ.1.75 లక్షలు అవుతుండగా ప్రభుత్వం రూ.87,500 రాయితీ ఇస్తుందన్నారు.

యాజమాన్య పద్ధతులు : నత్రజని వినియోగం వల్ల ఉల్లిగడ్డల నాణ్యత, దిగుబడి, నిల్వశక్తిపై  ప్రభావం చూపించే అవకాశం ఉన్నందున సిఫారసు చేసిన మేరకు ఎరువులు వేయాలి. డ్రిప్‌ ద్వారా క్రమ పద్ధతిలో నీటి తడులు ఇవ్వాలి. కోతకు 10–15 రోజుల ముందు నీరు పెట్టడం ఆపేయాలి. ఉల్లిని ఆకులతో సహా వాడాలనుకుంటే పాయలను 2.5–3 సెంటీమీటర్లు పరిమాణంలో ఉన్నప్పుడు కోయాలి. నిలువ ఉంచాలనుకుంటే రబీలో 50 శాతం ఆకులు పడిపోయిన వారం తర్వాత కోయాలి. ఖరీఫ్‌ సీజన్‌లో ఆకులు లేత పసుపు రంగుకు మారినప్పుడు పెరకాలి. పంట కోత ఆలస్యమైతే గడ్డలో పంగలు, పగుళ్లు రావడం, పూత పూయడం (బోల్డింగ్‌) వలన నష్టాలు వస్తాయి.

ఆరబెట్టడం : గడ్డలను నిల్వ చేసే సమయంలో చెడిపోకుండా, తెగుళ్ల బారిన పడకుండా ఉండేందుకు గడ్డలలో తేమను తగ్గించేందుకు పొలంలోనే ఆరబెట్టాలి. 3–4 రోజులు ఆరబెట్టిన తర్వాత 10–12 రోజులు నీడలో ఆరబెట్టి, అనంతరం రెండు సెంటీమీటర్ల కాడ ఉంచి గడ్డలపై ఆకులు కోసేయాలి. నిల్వలో పెద్ద సైజు గడ్డలు తొందరంగా మొలకెత్తడం, చిన్నసైజువి పూర్తిగా పక్వానికి రాక గడ్డలు బరువు కోల్పోవడం జరుగుతుంది. కనుక సుమారు 4–6 సెంటీమీటర్లు వ్యాసం కలిగి గుండ్రంగా ఉన్నటువంటి గడ్డలు నిలువకు అనుకూలంగా ఉంటాయి.

ప్యాకింగ్, రవాణా : బాగా వెలుతురు, గాలి తగిలేటట్టుగా జనుము లేదా ప్లాస్టిక్‌తో  చేసిన వలలాంటి సంచులతో ఉల్లిగడ్డలు ప్యాకింగ్‌ చేయాలి. ప్యాకింగ్‌ చేసిన గడ్డలను రవాణాలో 6 లేదా 8 అడుగుల ఎత్తు వరకు అరలుగా అమర్చుకుంటే గాలి ప్రసరణ బాగా ఉండి గడ్డలు దెబ్బతినవు. ఖరీఫ్‌లో పండించిన పంటలకు నిలువశక్తి తక్కువ. రబీ గడ్డలకు నిల్వ శక్తి ఎక్కువ. లేత ఎరువు రంగు గడ్డల రకాలు ఎక్కువగా నిలువ ఉంటాయి. సాధారణంగా 30–35 డిగ్రీల ఉష్ణోగ్రత, 65–75 శాతం గాలిలో తేమ ఉంటే ఎక్కువ కాలం గడ్డలు నిల్వ ఉంటాయి. శీతల గిడ్డంగుల్లో 0–2 డిగ్రీ సెంటీగ్రేడ్, 65–70 శాతం తేమ ఉంటే 4–5 నెలలు నిల్వ చేసుకోవచ్చు. ఉల్లిగడ్డల పంట కోతకు ముందు అనగా 30, 20, 10 రోజుల ముందు 0.1 శాతం బావిస్టన్‌ మందు ద్రావణాన్ని పిచికారీ చేసుకుంటే నిలువలో జరిగే నష్టాలు తగ్గించుకోవచ్చు.

Advertisement
Advertisement