అలీసాగర్, గుత్ప వైఎస్‌ చలువే | Sakshi
Sakshi News home page

అలీసాగర్, గుత్ప వైఎస్‌ చలువే

Published Sat, Aug 6 2016 11:21 PM

అలీసాగర్, గుత్ప వైఎస్‌ చలువే - Sakshi

  •  మల్లన్నసాగర్‌ నిర్మాణం ఆచరణలో అసాధ్యం
  •  ప్రభుత్వం భేషజాలకు పోవద్దు
  •  భారీ నీటిపారుదల శాఖ మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి
  • బోధన్‌ : వైఎస్‌ హయాంలోనే అలీసాగర్, గుత్ప ఎత్తిపోతల పనులు చేపట్టడం జరిగిందని, నా ఆలోచనతోనే అలీసాగర్‌ బ్యాక్‌వాటర్‌ పథకాన్ని రూపకల్పన చేశానని మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి తెలిపారు. బోధన్‌ ప్రజలకు తాగునీటి ఎద్దడిని శాశ్వతంగా నివారించాలని గోదావరి జలాలను బెల్లాల్‌ చెరువుకు మళ్లించే పనులు పూర్తి చేశామని పేర్కొన్నారు. శనివారం మండలంలోని అమ్దాపూర్‌ శివారులో నిజాంసాగర్‌ ప్రాజెక్టు డి–40, చింతకుంట వద్ద నిజాంసాగర్‌ ప్రాజెక్టు మెయిన్‌ కాలువ వద్ద డి–40 కాలువ నీటి మళ్లింపు పాయింట్‌లను మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితి వల్ల గోదావరి నదిలో నీళ్ల లేక ఈ పథకం ద్వారా నీటి సరఫరా జరగలేదన్నారు. ప్రసుత్తం వర్షాలు కురిసి గోదావరి నదిలో నీళ్లు పుష్కలంగా ప్రవహించడంతో ఎత్తిపోసిన నీటిని అలీసాగర్‌ రిజర్వాయర్‌ ద్వారా బెల్లాల్‌ చెరువుకు తొలిసారిగా నీటి సరఫరా ఐదు రోజులుగా కొనసాగుతోందన్నారు. అలీసాగర్‌బ్యాక్‌వాటర్‌ ద్వారా బోధన్‌ పట్టణ ప్రజలకు తాగునీటి సౌకర్యంతో పాటు ఎడపల్లి మండలంలోని పలు గ్రామాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. అలీసాగర్‌ రిజర్వాయర్‌ ద్వారా నిజామాబాద్‌ నగర ప్రజల తాగునీటి అవసరాలకు సరఫరా అవుతున్నాయన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ హయాంలో అలీసాగర్, గుత్ప ఎత్తిపోతల పథకాలు చేపట్టడం జరిగిందని, అలీసాగర్‌ కింద 53 వేల ఎకరాలు, గుత్ప పథకం కింద 38 వేల ఎకరాలకు సాగునీరందుతోందన్నారు. వైఎస్‌ఆర్‌ హయాంలోనే నిజాంసాగర్‌ కాలువల ఆధునికీకరణకు రూ. 500 కోట్లు మంజూరు కాగా పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు.
    ప్రభుత్వం ఒంటెద్దు పోకడలకు పోవద్దు
    బోధన్‌ : మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు నిర్మాణ అంశంలో ప్రభుత్వం భేషజాలకు, ఒంటెద్దు పోకడలకు వెళ్లొదని మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి సూచించారు. ప్రాజెక్టు పనుల్లో రాజకీయాలొద్దన్నారు. మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు పేరుతో జిల్లా రైతాంగాన్ని మోసం చేయాలని ప్రయత్నిస్తే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. గోదావరి జలాల వినియోగంలో నీటి నిపుణులు, మేధావుల సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు ద్వారా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టును నింపుతామనే ప్రభుత్వ ఆలోచన సరైంది కాదన్నారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు 112 కిలో మీటర్ల దూరంలో ఎత్తు ప్రాంతంలో ఉన్న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా కడెం ప్రాజెక్టుకు సుమారు 40 టీఎంసీ నీళ్లు వెళ్తున్నాయని, కడెం ప్రాజెక్టు నుంచి శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు నీటిని మళ్లిస్తే అతి తక్కువ ఖర్చుతో సాగునీరు అందుతుందని పేర్కొన్నారు.
     

Advertisement
Advertisement