గుండె బరువెక్కుతోంది | Sakshi
Sakshi News home page

గుండె బరువెక్కుతోంది

Published Mon, Nov 28 2016 11:45 PM

గుండె బరువెక్కుతోంది - Sakshi

చావుబతుకుల మధ్య ఆటోడ్రైవర్‌ 
చికిత్సకు రూ. 20 లక్షల ఖర్చు
సీఎం సహాయ నిధి నుంచిరూ. 7 లక్షలు మంజూరు
దాతలు ఆదుకోవాలని విన్నపం
 
 కష్టాలన్నీ పేదలకే వస్తాయా... వారు చేసిన పాపం ఏమిటి? దేవుడు వారిపైనే ఎందుకు చిన్నచూపు చూస్తున్నాడు... పోలియో మహమ్మారి మిగిల్చిన అంగవైకల్యంతో బతుకీడుస్తూ... ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న బావన బాలమురళికి గుండె పెరిగిపోతోందని పిడుగులాంటి వార్త.  దీంతో ఆ కుటుంబం దుఖఃసాగరంలో మునిగి పోయింది. చికిత్సకు లక్షలాది రూపాయలు ఖర్చవుతా యని వైద్యులు తెలపడంతో దిక్కతోచక దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నాడు.
– సాక్షి, రాజమహేంద్రవరం 
రాజమహేంద్రవరం ఇందిరానగర్‌కు చెందిన బావన బాలమురళీ (36) ఆటో నడుపుతూ భార్య, ముగ్గురు పిల్లలను పోషిస్తున్నాడు. ఐదేళ్ల క్రితం ఆయాసంగా ఉండడంతో ఓప్రైవేటు ఆస్పత్రిలో వెళ్లగా గుండె పెరుగుతోందని వైద్యులు తెలిపి మందులు రాసిచ్చారు. ఈ క్రమంలో గత నెలలో పరిస్థితి విషమించి గుండె పనితీరు 80 శాతం క్షీణించిందని వెంటనే మార్పిడి చేయాలని హైదరాబాద్‌ ఆపోలో ఆస్పత్రిలోని ప్రముఖ గుండె మార్పిడి శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్‌ గోఖలే తెలిపారు. శస్త్ర చికిత్సకు రూ.39 లక్షలు ఖర్చు అవుతుందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 15 రోజుల్లో గుండె మార్పిడి చేయకపోతే పరిస్థితి చేయి దాటిపోతుందని వైద్యులు తెలపడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. బాలమురళి వైద్యం కోసం ఆ కుటుంబం ఇప్పటికే రూ.ఆరు లక్షల అప్పు చేసింది. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణను కలవగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. ఏడు లక్షలు మంజూరు చేయించారు. మరో రూ.ఏడు లక్షలు సమకూర్చుకుంటే మిగిలినది ప్రధానమంత్రి సహాయనిధి, అపోలో ట్రస్ట్‌ ద్వారా సమకూర్చుతామని ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది. ఇప్పటికే ప్రతి నెల మందుల కోసం రూ. 6 వేలు అవసరమవుతున్నాయి. బాలమురళి భార్య బుజ్టి స్థానికంగా ఓ కళాశాలలో ఆయాగా పని చేస్తోంది. తన భర్తను బతికించి, ముగ్గురు పిల్లలకు జీవితాన్ని ఇవ్వాలని దాతలను వేడుకుంటోంది. దాతలు బావన బుజ్జి, తాడితోట ఎస్‌బీఐ బ్రాంచ్‌ ఖాతా నంబర్‌ 35372835346, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ ఎస్‌బీఐఎన్‌  0004609లో నగదు జమ చేయొచ్చు. బాలమురళీ ఫోన్‌  నంబర్‌: 960358 87549
 

Advertisement
Advertisement