కవర్‌లో చుట్టి జనరల్‌ బోగీలో.. | Sakshi
Sakshi News home page

కవర్‌లో చుట్టి జనరల్‌ బోగీలో

Published Thu, Aug 4 2016 11:22 AM

కవర్‌లో చుట్టి జనరల్‌ బోగీలో..

బయటకెళ్లిన బిడ్డలు రావడం కాస్త ఆలస్యమైతే చాలు.. తల్లిదండ్రులు విలవిల్లాడిపోతారు.. గుమ్మం వద్దే నిల్చొని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తారు..ఫోను మీద ఫోను చేసేస్తారు..అలాంటిది పుట్టి.. పట్టుమని పక్షం రోజులు కూడా నిండని పసికందును వదులుకుంటారా?!..అసలు.. అటువంటి తల్లిదండ్రులుంటారా?? అంటే..దీనికి అవుననే.. సమాధానమిస్తోంది.. విశాఖ స్టేషన్లో బుధవారంనాటి ఘటన..తమ పేగు బంధాన్ని కర్కోటకంగా కవర్‌లో చుట్టి వదిలేసిపోయిన ఆ ఘటన కంట తడిపెట్టించింది..
 
తాటిచెట్లపాలెం 
అది విశాఖ స్టేషన్‌.. ఏడో నెంబర్‌ ప్లాట్‌ఫారం.. విశాఖ నుంచి గుంటూరు వెళ్లేందుకు సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ సిద్ధంగా ఉంది..ప్రయాణికులతో బోగీలు.. ప్లాట్‌ఫారం..అంతా గందరగోళంగా ఉంది...ఇంతలో ఒక జనరల్‌ బోగీలో కేర్‌.. కేర్‌.. మని శిశువు ఏడుపులు.. మొదట ఎవరో తోటి ప్రయాణికుల బిడ్డ ఏడుస్తోందనుకుని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు..అయితే ఆ ఏడుపు ఎంతకూ ఆగడం లేదు.. పైగా తీవ్రత పెరుగుతోంది..బిడ్డ అంతగా గుక్కపట్టి ఏడుస్తున్నా పట్టించుకోని తల్లిదండ్రులెవరా.. అని ఒక్కొక్కరుగా ప్రయాణికులు.. ఏడుపులు వినవస్తున్న వైపు సారించారు..అప్పుడు అర్థమైంది వారికి.. ఆ ఏడుపులు బోగీలోని ఒక సీటు కింద నుంచి వస్తున్నాయని!..
 
ఆత్రంగా ఒకరిద్దరు సీటు కిందికి తొంగి చూశారు.. అక్కడ.. ఒక కవరు.. అందులో ముక్కుపచ్చలారని పసికందు..ఆ పసికందును చూసి ప్రయాణికులు అవాక్కయ్యారు.. ఆరా తీస్తే.. ఆ పాప తల్లిదండ్రులనదగ్గ వారెవరూ అక్కడ లేరని తేలింది. 15 రోజుల ప్రాయం కూడా లేని పసికందును ఇలా వదిలేసిన కర్కశ హృదయులను తిట్టుకుంటూ.. వెంటనే రైల్వే పోలీసులకు(జీఆర్పీ) సమాచారం అందించారు. దాంతో అక్కడికి చేరుకున్న జీఆర్పీ సీఐ జి.కోటేశ్వర్రావు, ఎస్సై డి.వెంకటరమణ లు చైల్డ్‌లైన్‌ ప్రతినిధులకు.. వారి ద్వారా  చైల్డ్‌వెల్ఫేర్‌ కమిటీ అధ్యక్షుడు హుస్సేన్‌కు సమాచారం అందింది. హుస్సేన్‌ స్టేషన్‌కు వచ్చి శిశువును మహిళా శిశు సంక్షేమ శాఖకు చెందిన శిశుగృహకు తీసుకెళ్లారు. అక్కడ వైద్యపరీక్షలు నిర్వహించి.. వారి సంరక్షణలోనే పాపను ఉంచారు.
 
జీఆర్పీ అన్వేషణ
ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న జీఆర్పీ సిబ్బంది ఆ పాపను ఎవరు వదిలివెళ్లారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులే పాపను వదిలివెళ్లారా.. లేక ఎవరైనా పాపను కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లే ఆస్కారం లేక వదిలివెళ్లారా అన్న అంశంపై దృష్టి సారించారు. పాప గుర్తులు తెలుపు, లేత నీలం రంగు బనియన్‌తో ఉన్న ఆ పాప చామనఛాయ రంగులో ఉంది. పాప గురించి తెలిసిన వారు తమకు గానీ.. చైల్డ్‌లైన్‌ టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1098కి గానీ తెలియజేయాలని జీఆర్పీ సీఐ కోటేశ్వరరావు కోరారు.

Advertisement
Advertisement