‘చల్లచల్లగా’ దోచేస్తున్నారు | Sakshi
Sakshi News home page

‘చల్లచల్లగా’ దోచేస్తున్నారు

Published Wed, May 4 2016 4:19 PM

‘చల్లచల్లగా’ దోచేస్తున్నారు

బీరుపై రూ.15 పెంచి అమ్మకాలు
మద్యం ప్రియుల జేబులకు చిల్లులు
నెలకు రూ.4.82 కోట్లకు పైగా దోపిడీ
 
చిత్తూరు: రోహిణి కార్తె రాకముందే ఎండలు రోళ్లు పగిలేలా కాస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రత 42 డిగ్రీలు దాటుతోంది. ఈ తరుణంలో మందుబాబులు చల్లని కిక్కు కోసం బీర్లను ఆశ్రయిస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకొని మద్యం వ్యాపారులు సిండికేట్ అయి రేట్లు పెంచి అందిన కాడికి దోచుకుంటున్నారు. ఎక్సైజ్ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి.
 
కూలింగ్ పేరుతో..
జిల్లాలో 382 మద్యం షాపులు, 26 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. తిరుపతి, చిత్తూరు ఎక్సైజ్ డివిజన్‌లుగా విభజించారు. ఈ డివిజన్ల నుంచే ఆ పరిధిలోని దుకాణాలకు మద్యం సరఫరా చేస్తుంటారు. ఈ రెండు డివిజన్ల పరిధిలో ఏప్రిల్‌లో సుమారు 2 లక్షల 68 వేల బీరు కేసులను అమ్మారు. ఒక్కో బీరు కేసులో 12 బీర్లు ఉంటాయి. ఒక్కో బీరుపై సుమారు రూ.15 అదనంగా వసూలు చేస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే కూలింగ్ కోసం పెంచామని సమాధానమిస్తున్నారు. ఇలా వసూలు చేయడం వల్ల జల్లా వ్యాప్తంగా రూ.4.82 కోట్లు మద్యం బాబులపై అదనపు భారం పడుతోంది.
 
నిబంధనలు గాలికి..
మద్యం షాపుల దగ్గర ఇచ్చే పర్మిట్ రూములకు కేవలం మందు తాగడానికే అనుమతి ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా ఇవి అన్ని చోట్లా దాబాలుగా మారిపోయాయి. మాంసం, ఇతర ఆహార పదార్థాలు విక్రయిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మద్యం షాపుల్లో బీర్లు, మద్యంపై రూ.10 నుంచి రూ.15 అదనంగా వసూలు చేస్తూ మద్యం ప్రియుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. ఈ దందా గురించి ఎక్సైజ్ పోలీసులకు తెలిసినా నెలనెలా మామూళ్లు అందుతుండటంతోపట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
కఠిన చర్యలు..
మద్యం అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 18 కేసులు నమోదు చేశాం. మద్యం అధిక ధరలకు విక్రయించకుండా ఆన్‌లైన్ బిల్లింగ్ పద్ధతిని త్వరలో ప్రవేశపెడుతున్నాం.
 -  సత్యప్రసాద్, అసిస్టెంట్ కమిషనర్,
 ఎక్సైజ్ శాఖ, చిత్తూరు.
 
 

Advertisement
Advertisement