టెంపుల్‌ సిటీగా భద్రాద్రి | Sakshi
Sakshi News home page

టెంపుల్‌ సిటీగా భద్రాద్రి

Published Fri, Jun 9 2017 11:34 PM

టెంపుల్‌ సిటీగా భద్రాద్రి

యాదాద్రి తరహాలో తీర్చిదిద్దుతాం
► ఆలయాల అభివృద్ధికి కేసీఆర్‌ కృషి
► ఆగస్టు నాటికి పనులు ప్రారంభించాలి
► అధికారులతో సమీక్షలో మంత్రి తుమ్మల


సాక్షి, కొత్తగూడెం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆలయ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించామన్నారు. యాదాద్రి తరహాలో భద్రాద్రిని కూడా టెంపుల్‌ సిటీగా ఏర్పాటు చేసేందుకు టెంపుల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌లోని తన చాంబర్‌లో గురువారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భద్రాద్రి ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ది చేస్తామన్న సీఎం కేసీఆర్‌ హామీ మేరకు రూ. 100 కోట్లు కేటాయిస్తున్నారని, అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆలయ అభివృద్ధి నమూనా రూపకల్పనకు దేవాదాయ శాఖ కమిషనర్‌ శివశంకర్, ప్రభుత్వ సలహాదారులు పాపారావు, ఆర్కిటెక్‌ ఆనందసాయితో చర్చలు జరిపారు. ఆలయ అభివృద్ధి డీపీఆర్‌లను ఆగస్టు వరకు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందుకు సంబంధించిన అనుమతులను మంజూరు చేయించుకొని, ఆగస్టులోగా టెండర్లు పిలవాలని, వెంటనే పనులు ప్రారంభించాలని అన్నారు.

భద్రాద్రి ఆలయ అభివృద్ధి  నమూనా విషయంలో చిన్నజీయర్‌ స్వామి సలహాలు, సూచనలు తీసుకోవాలని ఆర్కిటెక్‌ ఆనందసాయికి సూచించారు. నూతన నమూనాను రూపొందించి ఇప్పటికే చిన్నజీయర్‌ స్వామికి చూపించామని, ఆయన కొన్ని మార్పులు చేర్పులు చేశారని, ఆ తర్వాతే డిజైన్‌ ఫైనల్‌ చేశామని ఆనందసాయి మంత్రికి వివరించారు.     అలయ అభివృద్ధికి రూపొందించిన ప్రణాళికను తుమ్మలకు వివరించారు. ప్రస్తుతం ఉన్న ఆలయ గోపుర నమూనాలో ఎంటువంటి మార్పులు లేకుండా ఆలయ ప్రాకారం, మాడ వీధులలో మాత్రమే మార్పులు చేర్పులు చేపట్టామని వివరించారు. అలాగే స్వామి వారి కల్యాణ మండపం, బ్రహ్మత్సోవ మండపం, అన్నదాన సత్రాలను మాత్రమే పునఃనిర్మిస్తున్నట్లు తెలిపారు.

అనంతరం తుమ్మల మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు భక్త రామదాసు మెమోరియల్‌ ట్రస్ట్‌ డిజైన్‌ రూపొందించాలని ఆనందసాయికి సూచించగా, వారం రోజుల్లో డిజైన్‌ రూపొందిస్తామని ఆర్కిటెక్‌ చెప్పారు. భక్త రామదాసు మెమోరియల్‌ ట్రస్ట్‌కు సంబంధించి సీఎం కెసీఆర్‌ త్వరలోనే ఒక ప్రకటన చేస్తారని మంత్రి తుమ్మల తెలిపారు. రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి కేసీఆర్‌ కృషి చేస్తున్నారని. ప్రధానమైన యాదాద్రి, వేములవాడ ఆలయాలకు ఇప్పటికే పెద్ద ఎత్తున నిధులు విడుదల చేశారని గుర్తు చేశారు. భద్రాద్రి ఆలయ అభివృద్ధికి సైతం గతంలోనే పలు సూచనలు చేశారని తెలిపారు. సీఎం ఆలోచనలకు అనుగుణంగా భద్రాద్రి దేవాలయాన్ని వేగంగా అభివృద్ధి చేయాలని అదికారులను కోరారు.

Advertisement
Advertisement