ముగిసిన మొక్కు‘బడి’ | Sakshi
Sakshi News home page

ముగిసిన మొక్కు‘బడి’

Published Wed, Apr 26 2017 11:05 PM

ముగిసిన మొక్కు‘బడి’ - Sakshi

తూతూ మంత్రంగా ‘ముందస్తు విద్యాసంవత్సరం’
విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో కానరాని ఉత్సాహం
లక్ష్యానికి ఆమడదూరంలో నిలిచిన ప్రయోగం
 
ప్రభుత్వం సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ మాదిరిగా కొత్త విద్యా సంవత్సరాన్ని (2017-18) ఒక నెల ముందుగానే ప్రారంభిస్తే సత్ఫలితాలు ఉంటాయని ఆశించినా రాష్ట్ర ప్రభుత్వ ఆశయం లక్ష్యానికి ఆమడదూరంలోనే నిలచిపోయింది. రాష్ట్ర విద్యాశాఖ మార్చి 17వ తేదీలోగా ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు వార్షిక పరీక్షలు నిర్వహించి 2016-17 విద్యాసంవత్సరాన్ని ముగించింది. నాలుగు రోజుల వ్యవధినిచ్చి అదే నెల 21 నుంచి కొత్త విద్యాసంవత్సరాన్ని ప్రారంభించింది. అయితే, మార్చి నెలారంభం నుంచే ఎండలు విపరీతం కావడం, పెళ్లిళ్ల సీజన్, పదో తరగతి పరీక్షల స్పాట్‌ వాల్యుయేషన్‌కు టీచర్లు వెళ్లడం తదితర కారణాలతో కొత్త విద్యాసంవత్సరం మొక్కుబడిగా ముగిసింది. తరగతులు జరిగిన రోజులు పలు పాఠశాలల్లో పిల్లల హాజరు శాతం అతి తక్కువగా కనిపించింది. 
- కాకినాడ రూరల్‌
గత నెల 17 నుంచి 30వ తేదీ వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించారు. ఆ సమయంలో టీచర్లు ఇన్విజిలేషన్‌కు వెళ్లడం, ఈ నెల మూడు నుంచి ప్రారంభమైన స్పాట్‌ వాల్యుయేషన్‌కు వెళ్లడంతో విద్యార్థులకు పాఠాలు బోధించేవారే కరువయ్యారు. మిగిలిన ఒకరో, ఇద్దరో పాఠశాలకు వచ్చి మమ అనిపించేశారు. దీంతో అసలు లక్ష్యం నెరవేరకపోగా సమయం వృథా అయ్యిందంటున్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి పాఠ్యపుస్తకాలు, యూనిఫాం పంపిణీ చేయకపోవడంతో చిన్నారులు పాతపుస్తకాలతోనే పాఠశాలకు వెళ్లడం తప్ప ముందస్తు విద్యాసంవత్సరంతో పిల్లలకు ఒరిగిందేమీలేదు. పాఠశాలలు సక్రమంగా నడుస్తున్నాయా? విద్యార్థుల సాధకబాధలేమిటీ? టీచర్లు సక్రమంగా హాజరవుతున్నారా? అనే విషయాల్లో ఉన్నతాధికారులు పర్యవేక్షించిన పాపాన పోలేదు. ముందస్తు పుణ్యమా అని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు కొత్త అడ్మిషన్ల పేరుతో ఫీజులు దండికోవడం తప్పితే ఒనగూరిన ప్రయోజనం లేదని సర్వతా విమర్శలు వినిపిస్తున్నాయి.
బోసిపోయిన తరగతులు
ఎండలు తీవ్రమవ్వడంతో ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలల్లోనూ విద్యార్థుల సంఖ్య బాగా తగ్గింది. కొన్ని పాఠశాల్లోనైతే వేళ్లమీద లెక్కించదగ్గ విద్యార్థులే హాజరయ్యారు. ఉపాధ్యాయులు సైతం ఇష్టానుసారంగా వచ్చిపోవడం కూడా ముందస్తు విద్యాసంవత్సరం విఫలమవ్వడానికి కారణమన్న ఆరోపణలు లేకపోలేదు. మొత్తానికి మండిపోతున్న ఎండలతో శనివారంతో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. దీంతో ముందస్తు విద్యాసంవత్సరం ముగించేశారు.
మార్పుపై పునరాలోచించాలి
సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ తరహాలో కొత్త విద్యాసంవత్సరాన్ని మార్చి 21 నుంచి ప్రారంభించినా అందుకు తగ్గట్టు విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లను ప్రభుత్వం సన్నద్ధం చేయకపోవడంతో ఈ ప్రయోగం విఫలమైందని తల్లిదండ్రులు, విద్యా మేథావులు అభిప్రాయపడుతున్నారు. కనీసం వచ్చే విద్యా సంవత్సరానికైనా ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచించాలని కోరుతున్నారు. ముందస్తు విద్యాసంవత్సరాన్ని కొనసాగించదల్చుకుంటే అన్ని వసతులు కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement