చంద్రబాబుకు డిపాజిట్లు దక్కవ్ | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు డిపాజిట్లు దక్కవ్

Published Fri, Dec 9 2016 3:20 AM

చంద్రబాబుకు డిపాజిట్లు దక్కవ్ - Sakshi

వచ్చే ఎన్నికల్లో జనసునామీలో కొట్టుకుపోవడం ఖాయం : వైఎస్ జగన్
 
కాంట్రాక్టర్ల కోసం పోలవరం వ్యయం పెంచుతున్నారు
సబ్ కాంట్రాక్టర్లకు పనులిచ్చి లంచాలు పంచుకుంటున్నారు
పరిహారం కోసం ప్రశ్నించిన రైతులను మాత్రం జైల్లో పెడుతున్నారు
ఒకే ప్రాజెక్టు కింద రకరకాల పరిహారాలివ్వడం ఎక్కడైనా ఉందా?
పట్టిసీమలో ఇచ్చినట్లే ప్రతి రైతుకూ రూ.19 లక్షలు ఇవ్వాలి
ఇప్పుడు 18 ఏళ్లు నిండిన వారికి కూడా ప్యాకేజీ వర్తింపచేయాలి
గిరిజన సంక్షేమ పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవు
ఒక్క ఆస్పత్రిలోనూ మందులు లేవు.. వైద్యులూలేరు
4 నెలల్లోనే 14 మంది పెద్దలు, 15 మంది పిల్లల కన్నుమూత
జీడీపీలో నాలుగో స్థానంలో ఉన్నామని చంద్రబాబు గొప్పలు  

 
 సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘‘పేదల ఉసురుపోసుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు జన సునామీలో కొట్టుకుపోవడం ఖాయం. పైనుంచి దేవుడు కూడా మొట్టికాయలు వేస్తున్నాడు. భగవంతుడు కరుణిస్తే మరో ఏడాదిలోనే ఎన్నికలు రావచ్చు. ఇవాళ కాకపోయినా మరో రెండేళ్లకు ఎన్నికలు రావడం అనివార్యం. అప్పుడు చంద్రబాబుకు డిపాజిట్లు దక్కవ్’’అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. పెట్రోల్, డీజిల్, సిమ్మెంట్, ఇనుము, ఇసుక రేట్లు తగ్గుతున్నా... కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వ్యయాన్ని ఏటేటా పెంచుతున్నారని దుయ్యబట్టారు. మరోవైపు ప్రాజెక్టుకోసం భూములిచ్చిన గిరిజనులు పరిహారం అడిగితే జైల్లో పెట్టిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి దిక్కుమాలిన ముఖ్యమంత్రి మరెక్కడా ఉండబోడని ఆగ్రహం వ్యక్తంచేశారు. తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో రెండవ రోజు పర్యటనలో భాగంగా  గురువారం వీఆర్ పురం మండలం రేఖపల్లిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

 కాంట్రాక్టర్ మేలుకే ‘పోలవరం’ వ్యయం పెంపు
 2013లో రూ.16 వేల కోట్లు ఉన్న వ్యయాన్ని రూ.40 వేల కోట్లకు పెంచడం కాంట్రాక్టర్లకు మేలు చేయడం కోసమే. చంద్రబాబు తనకు నచ్చిన సబ్‌కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి ’నాకింత నీకింత’ అని లంచాలు పంచుకుంటున్నారు. ఇదే జిల్లాకు చెందిన మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడు సుధాకర్ యాదవ్‌కు పోలవరం సబ్‌కాంట్రాక్ట్ పనులు అప్పగించారు. మరోవైపు పరిహారం కోసం ప్రశ్నించిన రైతులను  జైల్లో పెట్టిస్తున్నారు. ఇటువంటి దిక్కుమాలిన ముఖ్యమంత్రి మరెక్కడా ఉండడేమో. ముంపు ప్రాంతంలో మూడేళ్లుగా ప్రజలు పడుతున్న అగచాట్లను ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ముంపు మండలాల్లో వీఆర్వో దగ్గరనుంచి ఎమ్మార్వో వరకూ అందరూ టెంపరరీ, ఇన్‌చార్జ్ ఉద్యోగులే. ఆఖరుకు ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌గా ఓ ఏవోను పెట్టారు. దీన్ని చూస్తుంటేనే ఈ ప్రాంతంపై చంద్రబాబు ప్రభుత్వానికి ప్రేమ ఏమిటో అర్థమవుతోంది.

 ఒక్కో చోట ఒక్కో ప్యాకేజా?
 పోలవరం రావాలని అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కానీ ప్రాజెక్టుకోసం భూములిచ్చి త్యాగం చేసిన గిరిపుత్రులకు న్యాయం చేయాలని అడగడం ధర్మమే కదా! గిరిజనుల అవస్థల గురించి చెప్తే అభివృద్ధి నిరోధకులని అభాండాలు వేసేస్తున్నారు. పోలవరంలో భాగమైన పట్టిసీమకు భూములిచ్చిన రైతులకు రూ.19 లక్షలిచ్చారు. పశ్చిమ గోదావరిలో రూ. 10.50 లక్షలు ఇచ్చిన ప్రభుత్వమే తూర్పు గోదావరిలో రూ.7.50 లక్షలు మాత్రమే ఇస్తోంది. ఒకే ప్రాజెక్టు కింద ఒక్కో చోట ఒక్కో రకమైన పరిహారం ఇవ్వడం ఎక్కడైనా ఉందా? పట్టిసీమలో ఇచ్చినట్లే ప్రతి రైతుకూ అదే రూ.19 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా.

అలాగే ప్రాజెక్టు రావాలన్న తపనతో 2007-2009 సమయంలో మొదట భూములిచ్చిన రైతులకు అప్పట్లో కేవలం రూ.1.5 లక్షలిచ్చారు. ఆ మొత్తంతో ఇప్పుడు పదిసెంట్ల భూమి కూడా రాదు, అందుకే వారి త్యాగాన్ని గుర్తించి ఎకరాకు కనీసం మరో రూ.ఐదారు లక్షలైనా ఇవ్వాలని చంద్రబాబును డిమాండ్ చేస్తున్నా. అలాగే నోటిఫికేషన్ ఇచ్చేనాటికి 18 సంవత్సరాలు నిండిన వారికే ప్యాకేజీ ఇస్తామనడం సరికాదు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇప్పటికీ ఇవ్వనందున... ఇప్పుడు 18 సంవత్సరాలు నిండిన వారికి కూడా పరిహారమివ్వాల్సిందే. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కొండపోడు భూములను సాగు చేసుకునేందుకు పట్టాలిచ్చారు. ఇప్పుడు ఆ భూములను కూడా లాగేసుకుని పరిహారం ఇవ్వబోమనడం అన్యాయం. రైతులకు ఏ పరిహారమైతే ఇస్తున్నారో డి-ఫామ్ పట్టాలున్న రైతులకు కూడా అదే పరిహారం ఇవ్వాలని చంద్రబాబును డిమాండ్ చేస్తున్నా.
 
 స్వచ్ఛభారత్‌కు అంబాసిడర్‌లా బాబు ప్రగల్భాలు
 రాష్ట్రంలో ఎక్కడా బహిరంగ మల, మూత్ర విసర్జన లేనేలేదని, అంత గొప్పగా మరుగుదొడ్లు కట్టించానని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ నిన్న రంపచోడవరంలో గిరిజన సంక్షేమ పాఠశాల, కళాశాల పిలిస్తే అక్కడకు వెళ్లా. దాదాపు 750 మంది పిల్లలు అక్కడ చదువుతున్నారు. వాళ్లు చెబుతున్న కష్టాలు వింటుంటే ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు అర్హుడా? అనిపించింది. పిల్లలకు మరుగుదొడ్లు లేక చెంబు పట్టుకొని కొండెక్కాల్సి వస్తుంది. పడుకోవడానికి మంచాలు లేవు. వర్షం పడితే నీరు కారుతోంది. శ్లాబులు పడుతున్నారుు. ఇదే మం డలంలోని చింతూరులో ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనూ ఇదే దుస్థితి. కానీ చంద్రబాబేమో స్వచ్ఛ భారత్‌కు తానే అంబాసి డార్‌లా చెప్పుకుంటున్నారు. రెండేళ్లుగా జీతాలు రావడంలేదని లెక్చరర్లు మొత్తుకుంటున్నా పట్టించుకునేవారు లేరు.
 
 వైద్యులు లేరు.. మందులు లేవు..
 మన్యం ప్రాంతంలో ఒక్క ఆస్పత్రిలోనూ మందులు లేవు.. ఇక వైద్యమెలా చేస్తారు? మారేడుమల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మూడ్రోజులుగా ఒక్క వైద్యుడూ లేరు. నేను వెళ్లేటప్పటికి ఒక డాక్టర్ పరుగెత్తుకుంటూ వచ్చారు. ముగ్గురు వైద్యులు ఉండాల్సి ఉండగా ఇద్దరమే ఉన్నామని చెప్పారు. గైనిక్, పీజీ డాక్టర్ లేరని తెలిపారు. విలీన మండలాల్లో కాళ్లవాపు వ్యాధితో నాలుగు నెలల్లోనే దాదాపుగా 14 మంది చనిపోయారు. కానీ ఇవాల్టికీ వారెందుకు చనిపోయారో కారణం తెలీదు. రాజవొమ్మంగి మండలంలో రెండు నెలల్లో 15 మంది నెల, రెండు నెలల పిల్లలు చనిపోయారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో తగినంత పౌష్టికాహారం పెట్టకపోవడంతో... పౌష్టికాహారం, రక్తహీనతతో మరణించారని చెబుతున్నారు. వైఎస్ హయాంలో కేవలం 20 నిమిషాల్లో వచ్చే 108 వాహనాలు ఇప్పుడు కదలడంలేదు. ఐటీడీఏ పరిధిలో పది వాహనాలుండగా పనిచేస్తున్నది కేవలం మూడు. ఇదీ చంద్రబాబు పాలన. కానీ ఆయన ఇవ్వాళ పొద్దున్నే టీవీలో కనిపించి దేశంలోనే జీడీపీలో నాలుగో స్థానంలో ఉన్నామని చెప్పుకొచ్చారు. తానేం అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మేస్తారని ఆయన నమ్మకం. ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పే ఈయనా ముఖ్యమంత్రేనా?
 
 జబ్బేంటో తెలియకుండానే చచ్చిపోయారు
 చింతూరు నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘కాళ్ల వాపులు వచ్చాయని ఆసుపత్రికి తీసుకెళ్లాం. వైద్యం చేసిన డాక్టర్లు ఇంటికి తీసుకుపొమ్మన్నారు. తీరా ఇంటికొచ్చిన కొద్ది రోజులకే చచ్చిపోయారు. మా వాళ్లు చచ్చిపోరుు రోజులు గడిచినా జబ్బేంటో తెలీదు. ప్రభుత్వం కనీసం మా కుటుంబాలను పరామర్శించి, ఆదుకోలేదు..’’ అంటూ తూర్పు గోదావరి జిల్లా గిరిజన ప్రాంతంలో కాళ్ల వాపుతో మృతి చెందిన వారి కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో బోరుమన్నారుు. గత రెండు నెలల కాలంలో తూర్పు మన్యంలో అంతుచిక్కని వ్యాధి సోకి కాళ్ల వాపుతో 14 మంది చనిపోయారు. బుధవారం జిల్లాకు వచ్చిన జగన్ గురువారం కూడా మన్యప్రాంతంలో పర్యటించారు. చింతూరులో ఐదుగురు, వీఆర్‌పురంలో ఎనిమిది మంది, కూనవరంలో ఒకరు కాళ్ల వాపు వ్యాధితో మృతి చెందడంపై ఆరా తీశారు.
 
 చింతూరు మండలం మావిళ్లగూడెంలో మృతి చెందిన ముచ్చిక లక్ష్మయ్య, ముచ్చిక సీతారామయ్యల కుటుంబాలను నర్శింహాపురంలో పరామర్శించారు. ‘ప్రభుత్వం నుంచి ఏమైనా సాయం అందిందా? ఎన్ని రోజులు ఆసుపత్రిలో ఉన్నారు? మంత్రులు గానీ అధికారులు గానీ వచ్చి అడిగారా?’ అని అడిగి తెలుసుకున్నారు. అసలు తమ భర్తలు ఎలా చచ్చిపోయారో తమకు తెలియదని లక్ష్మయ్య భార్య దూలమ్మ, సీతారామయ్య భార్య కమలమ్మ విలపించారు. మమ్మల్నెవరూ పట్టించుకోలేదు, ఏ సాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ జబ్బుతో చనిపోయారో కూడా తెలియని దారుణమైన పాలనలో మనం ఉన్నామని, జనం చచ్చిపోతున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడంలేదని జగన్ మండిపడ్డారు. బాధితులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి న్యాయం చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
 

Advertisement
Advertisement