Sakshi News home page

పసికందును చంపేశారు!

Published Sun, Sep 4 2016 11:54 PM

పసికందును చంపేశారు!

•  నానమ్మ ఇంటికెళ్లొస్తానని చెప్పి.. తిరిగిరాని లోకాలకు
•  గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో ఆగిన బాలుడి ఊపిరి
•  మిన్నంటిన కుటుంబ సభ్యుల రోదన

చోటు... చోటు.. (చిన్న.. చిన్న) అంటూ పలకరిస్తే అందరి దగ్గరకూ వెళుతుంటివే. అలాంటి వాణ్ణి చంపేందుకు వారికి చేతులెలా వచ్చాయి.. ఆ పసికందు ఏం పాపం చేశాడని పొట్టనపెట్టుకున్నారు.. అంటూ తల్లిదండ్రులు, నాయనమ్మ, తాతలు కన్నీరుమున్నీరుగా విలపించారు.  

అభం, శుభం తెలియని పసికందును మానవరూపంలో ఉన్న మృగాలు చంపేశాయి. ఈ విషాద సంఘటన మండలకేంద్రమైన కణేకల్లులో శనివారం రాత్రి జరిగింది. స్థానికులు, బంధువుల కథనం మేరకు... మత్స్య కార్మికుల కాలనీలో నివాసముంటున్న తాపీ మేస్త్రీ సద్దాంహుసేన్, బాను దంపతులు. వీరికి దాదాఖలందర్‌ (3), ఇమాంబు (1) సంతానం. శనివారం రాత్రి 7 గంటల సమయంలో దాదాఖలందర్‌కు ఆకలేయడంతో తల్లి అన్నం తినిపించింది.

ఆ తర్వాత పక్కనే ఉంటున్న నాయనమ్మ ఇంటికి వెళ్లొస్తానని చెప్పి దాదాఖలందర్‌ బయటికొచ్చాడు. సరే వెళ్లి తొందరగా రమ్మని చెప్పి పంపింది తల్లి. ఎంతసేపటికీ కొడుకు ఇంటికి రాకపోవడంతో అత్తింటికెళ్లి కొడుకు గురించి అడగడంతో ఇక్కడకు రాలేదని అత్తమామలు చెప్పారు. వెంటనే ఈ విషయాన్ని భర్త, ఇరుగుపొరుగు వారికి చెప్పడంతో అందరూ కలసి పసికందును వెతకడం ప్రారంభించారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ యువరాజు, పోలీసు సిబ్బంది కూడా పరిసర ప్రాంతాల్లో గాలించారు. రాత్రి 11గంటల వరకు గాలించినా ఎక్కడా ఆచూకీ లభించలేదు. అంతా వెళ్లిపోయిన తర్వాత కాలనీ ముందు భాగంలో చేపల పాండ్‌ ( చేపల పెంపకం కోసం ఏర్పాటు చేసిన కుంట) వద్ద బాలుని శవం లభించింది. తామంటే గిట్టనివారే ఈ అఘాయిత్యం చేసి ఉంటారని బంధువులు ఆరోపిస్తున్నారు.

పథకం ప్రకారమే హత్య..!
కణేకల్లు–కణేకల్లు క్రాసింగ్‌ మార్గమధ్యంలో కుడివైపున మత్స్య కార్మికుల కాలనీ ఉంది. చేపల పెంపకం కుంట ఎడమవైపు ఉంది. రెండింటికీ మధ్య ప్రధాన రహదారి ఉంది. మూడేళ్ల చిన్నారి కాలనీ నుంచి రోడ్డు దాటి అక్కడ నుంచి 120 అడుగుల దూరంలో ఉన్న కుంట వద్దకు వెళ్లలేడు. నాయనమ్మ ఇంటికి వెళ్లొస్తానని బయటికొచ్చిన సమయంలోనే  ఎవరో పథకం ప్రకారం దాదాఖలందర్‌ను చేరదీసి.. ఊపిరాడకుండా చేసి చంపేశారు. పోలీసులు, బంధువులు వెతకడం పూర్తయ్యాక అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో గుట్టుచప్పుడు కాకుండా వెళ్లి చేపల కుంట వద్ద విగతజీవుడైన బాలుడిని పడుకోబెట్టి వచ్చేశారు. ఒక వేళ చిన్నారే నడుచుకొంటూ వెళ్లినట్లైతే ఏటవాలుగా ఉన్న ఆ ప్రదేశంలో కాలుజారి గోతిలో పడిపోవాలి. అలా కాకుండా దిగువన నీటిగట్టపై నిద్రిస్తున్నట్టుగా ఉండటం బట్టి చూస్తే ఎవరో చంపేశారని స్పష్టమవుతోంది.

పాపాత్ములను అల్లానే శిక్షిస్తాడు..
పసిపిల్లలు దేవునితో సమానం. బాలుడిని చంపిన పాపాత్ములను ఆ అల్లానే శిక్షిస్తాడు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం చేయించడం ఇష్టం లేక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వలేదు.

Advertisement

What’s your opinion

Advertisement