చైనా స్కెచ్‌ | Sakshi
Sakshi News home page

చైనా స్కెచ్‌

Published Thu, Jul 28 2016 12:06 AM

చైనా స్కెచ్‌

విజయవాడ సెంట్రల్‌ : 
రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌తో విజయవాడ నగర రూపురేఖలను మార్చేస్తామని చెబుతున్న పాలకులు, అధికారులు.. పేద, మధ్య తరగతి వర్గాల ఉపాధికి గండి కొడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  నగరాన్ని గ్రీన్, బ్లూ సిటీగా తీర్చిదిద్దాలని నిర్ణయించిన సర్కార్‌ చైనాకు చెందిన  గుచ్చియో  ఇంటర్నేషనల్‌ ఇన్వెస్టిమెంట్‌ కార్పొరేషన్‌ (జీఐసీసీ) సంస్థకు డిజైన్‌ బాధ్యతలు అప్పగించింది. నగరపాలక సంస్థ,  అర్బన్‌గ్రీన్‌ సంస్థ అధికారులు, జీఐసీసీ ప్రతినిధులు సంయుక్తంగా మార్చి నెల్లో  క్షేత్ర స్థాయిలో పర్యటించారు. కృష్ణానది పరివాహక ప్రదేశాలు, రైవస్, ఏలూరు, బందరు కాల్వలు, బుడమేరు కాల్వగట్ల ప్రాంతాలు, గులాబీ తోట, మధురానగర్, అల్లూరి సీతారామరాజు వంతెన, సాంబమూర్తిరోడ్డు, అలంకార్‌ సెంటర్‌ వరకు కాల్వగట్లను పరిశీలించారు. ఆయాప్రాంతాల స్థితిగతులు, వాస్తవ నైతిక స్వరూపం, కనకదుర్గ ఫ్లైఓవర్‌కు సంబంధించిన మ్యాప్, నగర భౌగోళిక మ్యాప్‌లను చైనా బృందానికి అధికారులు అప్పగించారు.  ఆ తరువాత జీఐసీసీ బృందం డిజైన్‌ను సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే పుష్కరాల వంకపెట్టి ఒక్కొక్కటీ తొలగిస్తున్నారని భోగట్టా. 
కార్పొరేషన్‌ ఒక్కటే ...
నగరపాలక సంస్థ కార్యాలయం చుట్టూ ఉన్న కట్టడాల తొలగింపు కార్యక్రమం ముమ్మరమైంది. తొలుత గాంధీ విగ్రహాన్ని, సీతమ్మవారి పాదాలు, ఆలయాలను తొలగిచారు. తాజాగా పోలీస్‌క్వార్టర్స్‌ను కూల్చేశారు. రాజీవ్‌గాంధీ హోల్‌సేల్‌ పూల, కూరగాయల మార్కెట్‌ తరలింపునకు రంగం సిద్ధం చేశారు. నెలాఖరునాటికి మార్కెట్‌ను నేలమట్టం చేయాలన్నది అధికారుల ఆలోచన. చుట్టూ ఉన్న కట్టడాల తొలగింపు పోను ఒక్క కార్పొరేషన్‌ కార్యాలయం మాత్రమే మిగలనుంది. కట్టడాలు తొలగించిన ప్రాంతాన్ని  రెస్టారెంట్లు, ఎమ్యూజ్‌మెంట్‌తో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి దండిగా ఆదాయం రాబట్టలన్నది ప్రభుత్వ ఎత్తుగడగా తెలుస్తోంది. హోల్‌సేల్‌ మార్కెట్‌ తరలింపు వల్ల సుమారు ఐదువేల మంది వ్యాపారులు, రైతులు ఇబ్బందులు పడతారని మొరపెట్టుకున్న ప్రభుత్వ పెద్దలు పట్టించుకున్న దాఖలాలు లేవు.
 పూలింగ్‌ అస్త్రంప్రై
ప్రకాశం బ్యారేజ్‌ నుంచి భవానీఘాట్‌ వరకు బ్లూ, గ్రీన్‌సిటీగా అ«భివృద్ధికి డిజైన్‌ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా  కరకట్ట ప్రాంతంలోని 1,500 ఇళ్ళను ఇప్పటికే తొలగించారు. పున్నమిఘాట్‌ నుంచి స్వాతి థియేటర్‌ రోడ్డు చర్చి వరకు ఉన్న సుమారు 25 ఎకరాల ప్రైవేటు స్థలాన్ని సేకరించాలని నిర్ణయించారు. రెండు విడతలుగా స్థల యజమానులతో కమిషనర్‌ జి.వీరపాండియన్‌ చర్చలు జరిపారు.
60 : 40 నిష్పత్తిలో స్థలాన్ని అభివృద్ధి చేసి కేటాయిస్తామనే ప్రతిపాదన చేశారు. ఇందుకు స్థల యజమానులు అంగీకరించలేదు. 60 శాతం తమకు కేటాయిస్తే సమ్మతమేనని చెప్పారు. చర్చలకు తాత్కాలిక బ్రేక్‌పడింది. పుష్కరాల అనంతరం పూలింగ్‌ అస్త్రాన్ని సంధించి స్థలాలను స్వాధీనం చేసుకోవాలనే ఆలోచనలో సర్కార్‌ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే రెవెన్యూ అధికారులు ప్రైవేటు స్థలాల్లో సర్వే పూర్తి చేశారు. 
 

Advertisement
Advertisement