Sakshi News home page

బోనస్‌ రూ.57 వేలు

Published Wed, Sep 20 2017 9:35 AM

బోనస్‌ రూ.57 వేలు

కోల్‌కత్తా సమావేశంలో నిర్ణయం
గని కార్మికులకు దీపావళి ముందు చెల్లింపు


గోదావరిఖని(రామగుండం) : దేశవ్యాప్తంగా కోల్‌ఇండియా, సింగరేణి సంస్థలలో పనిచేస్తున్న 3.50 లక్షలమంది బొగ్గుగని కార్మికులకు పెర్ఫార్మెన్స్‌ లింక్డ్‌ రివార్డు (పీఎల్‌ఆర్‌) బోనస్‌ (లాభాల బోనస్‌)ను రూ.57 వేలు చెల్లించేందుకు నిర్ణయం జరిగింది. కోల్‌కత్తాలో మంగళవారం జేబీసీసీఐ అఫెక్స్‌ కమిటీసమావేశమై ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. గత ఏడాది పీఆర్‌ఎల్‌ బోనస్‌ రూ.54 వేలుగా ఉండగా, ఈసారి రూ.57 వేలకు పెంచారు. కోల్‌ఇండియాలోని ఎనిమిది సబ్సిడరీ సంస్థలలో పనిచేసే కార్మికులకు దసరా పండుగకు ముందు అంటే ఈ నెల 26వ తేదీలోపు చెల్లిస్తుండగా...సింగరేణి కార్మికులకు మాత్రం దీపావళి పండుగకు ముందు యాజమాన్యం చెల్లించనున్నది.

డిపెండెంట్‌ ఎంప్లాయిమెంట్‌పై  కమిటీ ఏర్పాటు...
 జేబీసీసీఐ ఒప్పందం  ప్రకారం డిపెండెంట్‌ ఉద్యోగాలపై యాజమాన్య ప్రతినిధులు, జాతీయ కార్మిక సంఘాల ప్రతినిధులతో కమిటీని నియమించారు. గనిలో ప్రమాదంలో మరణించిన, సహజ మరణం పొందినా గతంలో కార్మికుడి వారసుడికి ఉద్యోగ అవకాశం కల్పించేవారు.  ఈవిషయమై సుధీర్ఘంగా చర్చించేందుకు యాజమాన్యం తరపున ఎస్‌ఈసీఎల్‌ సీఎండీ బీఆర్‌ రెడ్డి, ఈసీఎల్‌ డైరెక్టర్‌ (పర్సనల్‌) కేఎస్‌ పాత్రో, ఎంసీఎల్‌ డైరెక్టర్‌ (పర్సనల్‌) ఎల్‌ఎన్‌ మిశ్రా, సీసీఎల్‌ డైరెక్టర్‌ (ఫైనాన్స్‌) డీకే ఘోష్, యాజమాన్యాల తరపున హెచ్‌ఎంఎస్‌ నుంచి నాతూలాల్‌పాండే, సీఐటీయూ నుంచి డీడీ రామానందన్, బీఎంఎస్‌ నుంచి వైఎన్‌ సింగ్, ఏఐటీయూసీ నుంచి లకన్‌లాల్‌ మహాతో, సీఎంవోఏఐ నుంచి వీపీ సింగ్‌ సభ్యులుగా నియమించారు. వీరిని సమన్వయ పరిచేందుకు ఏకే సక్సేనాను కో–ఆర్డినేటర్‌గా నియమించారు.

బొగ్గు పరిశ్రమలో ఏడు రోజుల పని విధానం, ఇతర అంశాలపై వచ్చేనెల 9న డ్రాఫ్ట్‌ కమిటీ సమావేశం, 10న పూర్తిస్థాయి జేబీసీసీఐ సమావేశం నిర్వహించేందుకు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వి.సీతారామయ్య, హెచ్‌ఎంఎస్‌ ప్రధాన కార్యదర్శి రియాజ్‌అహ్మద్, ఐఎన్‌టీయూసీ ప్రధాన కార్యదర్శి బి.జనక్‌ప్రసాద్, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి మంద నర్సింహారావు తెలిపారు.

Advertisement

What’s your opinion

Advertisement