పైసలిస్తే.. ప్రమోషన్‌ | Sakshi
Sakshi News home page

పైసలిస్తే.. ప్రమోషన్‌

Published Mon, Oct 24 2016 1:26 AM

పైసలిస్తే.. ప్రమోషన్‌ - Sakshi

  • వైద్య, ఆరోగ్య శాఖలో సీనియర్లకు అన్యాయం
  • నేడు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్న బాధితులు 
  • ఏఎన్‌ఎం బదిలీలు.. డాక్టర్ల డిప్యుటేషన్లు.. ఒక యూడీసీకే ఐదారు పీహెచ్‌సీల బాధ్యతలు అప్పగించడం.. తాజాగా నాలుగోతరగతి ఉద్యోగులకు ఇచ్చే ప్రమోషన్లు కావచ్చు.. పైసలిస్తే జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఏదైనా సాధ్యమేనని.. వైద్య, ఆరోగ్యశాఖలో అర్హతలేని వారిని అందలమెక్కిస్తారనే ప్రచారం సాగుతోంది. 
    నెల్లూరు(అర్బన్‌):
    ఇటీవల కాలంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అవినీతికి నిలయంగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా 26 ఏళ్ల సీనియర్లను కాదని 18 ఏళ్ల సర్వీసు ఉన్న ఓ డ్రైవర్‌కు జూనియర్‌ అసిస్టెంట్‌గా శనివారం ప్రమోషన్‌ ఇచ్చారు. దీంతో వైద్యశాఖలో లొసుగులు వెలుగు చూస్తున్నాయి. 
    ప్రమోషన్లకు నోచుకోని నాలుగోతరగతి ఉద్యోగులు 
    జిల్లావైద్య ఆరోగ్య శాఖలో నాలుగోతరగతి ఉద్యోగులకు ప్రమోషన్లు దాదాపు మూడు దశాబ్దాలుగా లేవు. ఎంఎన్‌ఓ, ఎఫ్‌ఎన్‌ఓ, అటెండర్, తోటీలు, వాచ్‌మెన్లు ఇలా ఏడు రకాల సిబ్బంది నాలుగోతరగతి ఉద్యోగులుగా పనిచేస్తున్నారు.  3621/ఈ2, 2000 ప్రకారం, 2002, 2004, 2010లో గుంటూరు వైద్యశాఖలో, గుంటూరు జనరల్‌ ఆస్పత్రిలో, నెల్లూరు పెద్దాస్పత్రిలో సైతం నాలుగోతరగతి ఉద్యోగులకు  ప్రమోషన్లు ఇచ్చిన ఘటనలు ఉదాహరణలుగా ఉన్నాయి. అయితే ఒక్క నెల్లూరు వైద్య శాఖలో మాత్రమే ప్రమోషన్లు ఇవ్వలేదు. 
    గతంలోనూ  డ్రైవర్లకే ప్రమోషన్‌..
    -అధికారుల వాహనానికి డ్రైవర్‌గా ఉన్న ఓ జూనియర్‌  వ్యక్తికి గతంలో టైపిస్ట్‌గా ప్రమోషన్‌ ఇచ్చి జిల్లా వైద్యశాఖలో పోస్టింగ్‌ ఇచ్చారు. 
    -రెండున్నరేళ్ల క్రితం మరో డ్రైవర్‌కి ప్రమోషన్‌ ఇచ్చి అల్లూరు ప్రభుత్వాస్పత్రికి జూనియర్‌ అసిస్టెంట్‌గా బదిలీ చేశారు.
    2013లో  కలెక్టర్‌ ఆగ్రహంతో రివర్స్‌
    2013లో మైపాడు పీహెచ్‌సీలో పనిచేస్తున్న ఒక జూనియర్‌ అటెండర్‌కు ప్రమోషన్‌ ఇచ్చారు. దీనిపై సీనియర్‌ అయిన తనకు అన్యాయం జరిగిందని అశోక్‌ అనే వ్యక్తి కలెక్టర్‌ శ్రీకాంత్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇచ్చిన ప్రమోషన్‌ను క్యాన్సిల్‌ చేశారు.
    న్యాయం చేస్తానని చెప్పి..
     జూనియర్‌కి ప్రమోషన్‌ ఇవ్వాలని గత నెల అధికారులు సిద్ధపడ్డారు. ఇది తెలిసిన సీనియర్లు సూపరింటెండెంట్, డీఎంహెచ్‌ఓ దృష్టికి తీసుకెళ్లారు. సూపరింటెండెంట్‌ శ్రీనివాసులు మాట్లాడుతూ గతంలో  సీనియర్లకు అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని, ఇప్పుడు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఒక్క నెల ఆగి మళ్లీ తాము అనుకున్న వారికే ప్రమోషన్‌ కల్పించారు. త్వరలోనే మరో మూడు  పోస్టులకు జూనియర్లకే పదోన్నతి ఇవ్వనున్నట్టు సమాచారం. 
    నేడు కలెక్టర్‌కు ఫిర్యాదు 
    తమకు అన్యాయం జరిగిందంటూ అశోక్, మాల్యాద్రి అనే 26 ఏళ్ల సీనియర్లు సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిసింది. రూ.80వేలకు ప్రమోషన్‌ ఇస్తున్నారని వైద్యశాఖలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని సీనియర్లు కోరుతున్నారు. 
     
    అన్యాయం చేయలేదు -డాక్టర్‌ సి.వరసుందరం,  జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి
    తాము ఎవరికీ అన్యాయం చేయలేదు. డ్రైవర్లకు సంబంధించిన బ్యాక్‌ లాగ్‌ పోస్టును ఆపేదానికి లేదు. ముగ్గురు సూపరింటెండెంట్లను, సీనియర్‌ క్లర్కులను దగ్గర పెట్టుకుని ఫైలు పరిశీలించి ప్రమోషన్‌ ఇచ్చాం. ఇప్పుడు అన్యాయం జరిగిందని భావించేవారికి నేనే గత నెల్లో పిలిపించి వాస్తవాలు తెలిపా. డిసెంబర్‌లోపు వారికి కూడా ప్రమోషన్లు కల్పించి న్యాయం చేస్తా. 
     
     

Advertisement
Advertisement