డెంగీతో టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుల్ మృతి | Sakshi
Sakshi News home page

డెంగీతో టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుల్ మృతి

Published Tue, Oct 27 2015 1:43 AM

డెంగీతో టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుల్ మృతి - Sakshi

 బిహార్‌లో మృత్యువాత
 
 హైదరాబాద్: బిహార్ ఎన్నికల బందోబస్తు విధులు నిర్వహిస్తున్న  టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుల్ డెంగీ బారిన పడి మృతి చెందాడు.  కానిస్టేబుల్ చిల్ల వాసు(పీసీ నం.497) మృతితో కొండాపూర్‌లోని టీఎస్‌ఎస్‌పీ 8వ బెటాలియన్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాకినాడ, అవసరాల వీధికి చెందిన చిల్ల వాసు(36) యూసుఫ్‌గూడలోని మొదటి బెటాలియన్‌లో 2000 సంవత్సరంలో కానిస్టేబుల్‌గా చేరాడు. ప్రస్తుతం ఎనిమిదో బెటాలియన్‌కు చెందిన అతను బిహార్ ఎన్నికల బందోబస్తులో భాగంగా ఈ నెల 1న ఆ రాష్ట్రంలోని చాప్రా జిల్లాకు వెళ్లాడు. అక్కడ  డెంగీ జ్వరం సోకడంతో  జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం  మృతి చెందాడు.

 మృతదేహం తరలింపునకు చర్యలు
 వాసు మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు టీఎస్‌ఎస్‌పీ ఐజీ శ్రీనివాసరావు, కమాండెంట్ సత్యనారాయణరావు ఏర్పాట్లు చేశారు. వాసు భార్య రమణమ్మ, కొడుకులు శశాంక్, కుశాల్‌తో పాటు మరో ఇద్దరి బంధువులను సాయంత్రం 6 గంటలకు విమానంలో బిహార్‌కు పంపారు. వారితో పాటు కమాండెంట్ సత్యనారాయణ, టీఎస్‌ఎస్‌పీ 8వ బెటాలియన్ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు కె.బాలకృష్ణమూర్తి కూడా వెళ్లారు. వాసు మృతదేహాన్ని మంగళవారం విమానంలో స్వస్థలానికి తరలిస్తామని కమాండెంట్ తెలిపారు.

 కుటుంబంలో ఒకరికి ఉద్యోగం
 విధి నిర్వహణలో అనారోగ్యానికి గురై వాసు మృతి చెందడం తమకు ఎంతో బాధ కల్గించిందని ఇన్‌చార్జి కమాండెంట్ సత్యనారాయణరావు పేర్కొన్నారు. ఆదివారం అతనితో  ఫోన్‌లో మాట్లాడానని, కోలుకున్నాక వస్తానని చెప్పాడని ఇంతలోనే ఇలా జరగడం ఆవేదన కలిగించిందన్నారు. వాసు కుటుంబానికి న్యాయం చేస్తామని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఆర్థికంగా కూడా అతని కుటుంబానికి వచ్చే పరిహారాలు త్వరగా వచ్చేలా చూస్తామన్నారు.
 
 సరైన వైద్యం అందకే మృతి: భార్య రమణమ్మ
 తన భర్త వాసుతో ఆదివారం రాత్రి 10 గంటలకు ఫోన్‌లో మాట్లాడినట్లు అతని భార్య రమణమ్మ తెలిపారు. ఇంతలోనే ఇలాంటి వార్త వినడం తమను షాక్‌కు గురిచేసిందని ఆమె బోరున విలపించారు. 15 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నా సెలవు  మంజూరు చేయలేదనీ, సరైన వైద్యం కూడా అందని కారణంగానే తన భర్త మరణించాడని రమణమ్మ ఆరోపించారు.

Advertisement
Advertisement