డిజిటల్‌ లిటరసీపై శిక్షణ | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ లిటరసీపై శిక్షణ

Published Tue, Oct 4 2016 8:16 PM

digital literecy training

కరప : 
మహిళా శక్తి సంఘాల సభ్యులకు డిజిటల్‌ లిటరసీపై అవగాహన కల్పించేందుకు డిజిటల్‌ సాతీలను నియమించినట్టు  డీఆర్‌డీఏ పీడీ పి.మల్లిబాబు తెలిపారు. అమలాపురం, సామర్లకోట, రాజమండ్రిలలో శిక్షణ ఇచ్చేందుకు 302 మంది డిజిటల్‌ సాతీలను ఎంపిక చేశామన్నారు. స్థానిక మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. టాటా ట్రస్ట్‌ సహకారంతో డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో మొదటి విడతగా అమలాపురం ప్రాంతంలోని డిజిటల్‌ సాతీలకు బుధవారం నుంచి రెండు రోజుల పాటు శిక్షణ ఇస్తామన్నారు. ట్యాబ్‌లు, డిజిటల్‌ బ్రౌజర్‌ తదితర సామగ్రి టాటా ట్రస్ట్‌ సమకూరుస్తుందన్నారు. శిక్షణ పొందిన సాతీలు తమ పరిధిలోని గ్రామాల్లో పర్యటించి డ్వాక్రా గ్రూపు మహిళలకు డిజిటల్‌ లిటరసీపై శిక్షణ ఇచ్చి, అవగాహన కల్పిస్తారని తెలిపారు.
 
జిల్లాలో 3.4 లక్షల మందికి శిక్షణ                                                   
ఒక్కొక్క డిజిటల్‌ సాతీ 1,200 మంది మహిళలకు ట్యాబ్‌లు, స్మార్ట్‌ఫోన్‌ల వాడకం, ప్రభుత్వ వెబ్‌సైట్‌ల గురించి, కరెంట్, ఫోన్‌ బిల్లుల చెల్లింపులు, గ్యాస్‌ బుకింగ్‌ తదితర విషయాలపై అవగాహన కల్పించాల్సి ఉంటుందన్నారు. దసరా వెళ్లిన తర్వాత నుంచి మూడు నెలల్లో జిల్లాలోని 3.4 లక్షల మంది డ్వాక్రా మహిళలకు డిజిటల్‌ లిటరసీపై శిక్షణ ఇచ్చేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్టు ఆయన వివరించారు. శిక్షణ ఇచ్చే డిజిటల్‌ సాతీలకు నెలకు రూ.2 వేలు చొప్పున గౌరవవేతనం చెల్లిస్తామన్నారు. శిక్షణ కాలంలో ఇచ్చిన ట్యాబ్‌లు వారికే ఇచ్చేస్తామని, భవిష్యత్‌లో వారికి మీ–సేవా కేంద్రాలు కేటాయించడం, జియోట్యాగింగ్‌లో వారి సేవలు వినియోగించుకోవడం జరుగుతుందన్నారు.
 
3.25 లక్షల జతల స్కూలు యూనిఫాం
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు పంపిణీ చేసేందుకు 3.25 లక్షల జతల యూనిఫాంను డ్వాక్రా మహిళలతో కుట్టిస్తున్నట్టు ఆయన తెలిపారు. 29 మండలాల్లో దుస్తులు కుట్టిస్తున్నామన్నారు. 12 మండలాల్లో నూరు శాతం, 8 మండలాల్లో 80 శాతం మేర యూనిఫాం కుట్టడం పూర్తయిందన్నారు. మిగిలిన మండలాల్లో కూడా పూర్తిచేయించి, విద్యార్థులకు పంపిణీ æచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో పింఛన్ల కోసం 36 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ప్రభుత్వ నుంచి మంజూరు ఉత్తర్వులు వచ్చిన వెంటనే వారికి అందజేస్తామని చెప్పారు. సమావేశంలో ఎంపీడీఓ అన్నెపు ఆంజనేయులు, ఎంఈఓ ఎంవీవీ సుబ్బారావు పాల్గొన్నారు. 
 

Advertisement
Advertisement