న్యాయం చేయండి | Sakshi
Sakshi News home page

న్యాయం చేయండి

Published Thu, Aug 4 2016 9:56 PM

న్యాయం చేయండి - Sakshi

ఆర్మూర్‌ : సమాధాన పత్రాలు చింపివేయడంతో తాము ఫెయిల్‌ అయ్యామని, తమకు న్యాయం చేయాలని పట్టణంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో చదువుతున్న 15 మంది డిగ్రీ తృతీయ సంవత్సరం విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు. 
జూన్‌లో ఎంపీసీ తృతీయ సంవత్సరం పరీక్షలు రాసిన 15 మంది విద్యార్థులకు సంబంధించిన సమాధాన పత్రాలను గుర్తు తెలియని వ్యక్తులు చింపి వేసి యూనివర్సిటీకి పంపించిన విషయాన్ని గురువారం ‘సాక్షి’ దినపత్రిక వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. జవాబు పత్రాలు చింపివేయబడ్డ 15 మంది విద్యార్థులు టెట్‌–1 క్వాలిఫై అయినవారే కావడం గమనార్హం. సమాధాన పత్రాలు చింపి వేయడంతో తాము ఫెయిల్‌ అయినట్లు తెలుసుకున్న విద్యార్థులు రెండు రోజులుగా స్టడీ సెంటర్, యూనివర్సిటీ చుట్టూ తిరుగుతున్నారు. బాధితులకు పీడీఎస్‌యూ చంద్రన్న వర్గం నాయకులు అండగా నిలిచారు. గురువారం అంబేద్కర్‌ వర్సిటీ ఆర్మూర్‌ స్టడీ సెంటర్‌లో సెంటర్‌ కోఆర్డినేటర్‌ రాజ, క్లర్క్‌ శ్యాం, అటెండర్‌ రూపేశ్‌తో వాగ్వాదానికి దిగారు. ఆర్మూర్‌ సెంటర్‌లోనే సమాధాన పత్రాలు చినిగి వచ్చాయని వర్సిటీ అధికారులు చెబుతున్నారని విద్యార్థులు పేర్కొన్నారు. సమాధాన పత్రాలను భద్రపరిచిన క్లర్క్‌ శ్యాం, హాల్‌ టికెట్టు నంబర్లు సేకరించిన అటెండర్‌లపై విద్యార్థులు అనుమానాలు వ్యక్తం చేశారు.  పరీక్షలు రాసే సమయంలో ఎలాంటి కారణం చెప్పకుండానే అటెండర్‌ రూపేశ్‌ తమ హాల్‌ టికెట్‌ నెంబర్లు ఎందుకు నోట్‌ చేసుకున్నాడో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఫెయిల్‌ అయిన విద్యార్థులను రీవాల్యూయేషన్‌లో పాస్‌ చేయిస్తానంటూ క్లర్క్‌ శ్యాం చెప్పేవాడని ఆరోపించారు. ఈ సంఘటనపై కలెక్టర్‌ యోగితారాణాకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. 
 
పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ధర్నా..
సమాధాన పత్రాలను చింపివేయడంతో విద్యా సంవత్సరం వృథా అవుతున్న విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ పీడీఎస్‌యూ చంద్రన్న వర్గం నాయకులు డిగ్రీ కళాశాల ఎదుట ధర్నా చేశారు. అనంతరం వైస్‌ ప్రిన్సిపాల్, అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ స్టడీ సెంటర్‌ కోఆర్డినేటర్‌ రాజకు వినతి పత్రం సమర్పించారు. వినతి పత్రం సమర్పించిన వారిలో పీడీఎస్‌యూ ఆర్మూర్‌ డివిజన్‌ అధ్యక్షుడు శ్రీకాంత్, నాయకులు స్వామి, రమాకాంత్, చందు, దినేశ్‌ తదితరులున్నారు.
 

Advertisement
Advertisement