చిన్నారి చెంతకు నాన్న | Sakshi
Sakshi News home page

చిన్నారి చెంతకు నాన్న

Published Sun, Oct 9 2016 10:10 PM

చిన్నారి చెంతకు నాన్న - Sakshi

కదిరి : రెండు నెలలుగా నాన్న కోసం ఓ చిన్నారి పడుతున్న తపనకు కదిరి రూరల్‌ మండల ఎస్‌ఐ ఉగాది వెంకట ప్రసాద్‌ తెరదించారు. ‘నాన్న కోసం’ శీర్షికన గత నెల 21న ‘సాక్షి’ పత్రికలో సున్నపుగుట్ట తండాకు చెందిన కుర్రాడి దీనగాథ ప్రచురితమైన విదితమే. ఈ విషయాన్ని ఎస్‌ఐ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎలాగైనా తండ్రిని తీసుకొస్తానని ఆనాడు చిన్నారి మణికంఠకు ధైర్యం చెప్పి పంపారు. అనంతరం కదిరి ప్రాంతం నుంచి వలస వెళ్లిన వారు ఎక్కడెక్కడున్నారో వాకాబు చేసి, సిబ్బందిని పంపి ఆయా ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు.

బెంగళూరులో కూలి పనులు చేసుకుంటూ వచ్చిన సొమ్ముతో మద్యం మత్తులో జల్సా చేస్తున్న కుర్రాడి తండ్రి చంద్రశేఖర్‌నాయక్‌ను గుర్తించి, ఆదివారం కదిరికి పిలుచుకువచ్చారు. తండ్రిని చూడగానే కుర్రాడిలో ఆనందభాష్పాలు నేలరాలాయి. తండ్రి హత్తుకుని బోరున విలపించాడు. కుర్రాడి వేదనను తీర్చిన ఎస్‌ఐ వెంకట ప్రసాద్, సిబ్బందిని ఉన్నతాధికారులతో పాటు గ్రామస్తులు అభినందించారు. 

Advertisement
Advertisement