అంధ పోస్టులను భర్తీ చేయాలి | Sakshi
Sakshi News home page

అంధ పోస్టులను భర్తీ చేయాలి

Published Wed, Jul 27 2016 10:31 PM

అంధ పోస్టులను భర్తీ చేయాలి - Sakshi

అనంతపురం ఎడ్యుకేషన్‌ : ప్రభుత్వ శాఖల్లో  ఖాళీగా ఉన్న అంధ అభ్యర్థులకు కేటాయించిన పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ గేయానంద్‌ డిమాండ్‌ చేశారు. విద్యాశాఖలో ఖాళీగా ఉన్న అంధ టీచర్‌ పోస్టులను  భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ  డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో బుధవారం డీఈఓ కార్యాలయం ఎదుట అంధ ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. వారి ఆందోళనకు గేయానంద్‌ మద్ధతు తెలిపి మాట్లాడారు. అంధుల పట్ల ప్రభుత్వం కళ్లు తెరవాలన్నారు. జిల్లాలో తొమ్మిది మంది అంధ అభ్యర్థులు 2014 డీఎస్సీలో ఎంపికయ్యాయరన్నారు. వీరిలో కొందరు నకిలీ ధ్రువీకరణ పత్రాలు పెట్టినట్లు  ఆరోపణలు ఉన్నాయని విచారించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.


డీవైఎఫ్‌ఐ జిల్లా, నగర కార్యదర్శులు కసాపురం ఆంజనేయులు, నూరుల్లా మాట్లాడుతూ అంధుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలన్నారు. వారి సమస్యలు పరిష్కరించే దాకా పోరాటాలు చేస్తామన్నారు. పరీక్షల సమయంలో కొందరు నకిలీ అభ్యర్థులు, బాగా చదువుకున్న వారిని సహాయకులుగా పెట్టుకుని పరీక్షలు రాయించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. అలాగే అర్హులైన అంధులకు మాత్రం పదో తరగతి విద్యార్థులను సహాయకులుగా నియమించారన్నారు. ఈ వ్యవహారం వెనుక లక్షలాది రూపాయలు చేతులు మారిందని ఆరోపించారు. కార్యక్రమంలో  డీవైఎఫ్‌ఐ నగర ఉపాధ్యక్షులు రాజు, కుమార్, సాంబ, ఎస్‌ఎఫ్‌ఐ నగర కార్యదర్శి సూర్యచంద్రయాదవ్, అంధులు నారాయణస్వామి, హరి, సురేష్, నరసింహ, సుధాకర్, తిప్పయ్య పాల్గొన్నారు.  

Advertisement
Advertisement